2 సమూయేలు 21 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదంప్రతీకారం తీర్చుకున్న గిబియోనీయులు 1 దావీదు పాలనలో మూడు సంవత్సరాలు వరుసగా కరువు రాగా దావీదు యెహోవాకు మనవి చేశాడు. అందుకు యెహోవా, “సౌలు గిబియోనీయులను చంపాడు; అతడు, అతని కుటుంబం రక్తం చిందించిన కారణంగా ఈ కరువు వచ్చింది” అన్నారు. 2 రాజు గిబియోనీయులను పిలిపించి వారితో మాట్లాడాడు. (ఈ గిబియోనీయులు ఇశ్రాయేలీయులకు సంబంధించినవారు కారు; వారు అమోరీయుల జాతిలో మిగిలినవారు. ఇశ్రాయేలీయులు మిమ్మల్ని చంపమని వారికి ప్రమాణం చేశారు కాని సౌలుకు ఇశ్రాయేలు, యూదా వారి పట్ల ఉన్న ఆసక్తితో వారిని చంపుతూ వచ్చాడు.) 3 దావీదు గిబియోనీయులను, “మీరు యెహోవా వారసత్వాన్ని దీవించేలా మీ కోసం ప్రాయశ్చిత్తంగా నేను ఏం చేయాలి?” అని అడిగాడు. 4 అందుకు గిబియోనీయులు, “సౌలు అతని కుటుంబం నుండి వెండి బంగారాలను గాని ఇశ్రాయేలులో ఎవరినైనా చంపమని గాని అడగడం లేదు” అని అన్నారు. దావీదు, “నేనేం చేయాలో చెప్పండి అది మీకు చేస్తాను” అన్నాడు. 5 అప్పుడు వారు రాజుతో, “మాకు శత్రువుగా మారి మేము నాశనం అవ్వాలని ఇశ్రాయేలు సరిహద్దులలో లేకుండా నిర్మూలం చేయాలని కుట్రపన్నిన సౌలు సంతతివారిలో ఏడుగురు మగవారిని మాకు అప్పగించండి. 6 యెహోవా ఏర్పరచుకున్న సౌలు పట్టణమైన గిబియాలో యెహోవా సమక్షంలో వారిని ఉరితీస్తాం” అన్నారు. అందుకు రాజు, “సరే, నేను వారిని మీకు అప్పగిస్తాను” అన్నాడు. 7 దావీదు సౌలు కుమారుడైన యోనాతానుతో యెహోవా ఎదుట చేసిన ప్రమాణం కారణంగా సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతును రాజు వారికి అప్పగించలేదు. 8 అయితే రాజు సౌలుకు అయ్యా కుమార్తె రిస్పాకు పుట్టిన ఇద్దరు కుమారులైన అర్మోని మెఫీబోషెతులను, సౌలు కుమార్తె మెరాబుకు మెహోలతీయుడైన బర్జిల్లయి కుమారుడైన అద్రీయేలుకు పుట్టిన అయిదుగురు కుమారులను తీసుకువచ్చాడు. 9 వారిని గిబియోనీయులకు అప్పగించాడు. వారు ఈ ఏడుగురిని యెహోవా ఎదుట కొండమీద ఉరితీసి చంపారు. ఆ ఏడుగురు ఒకేసారి చనిపోయారు. కోతకాలం మొదటి రోజున యవల కోత మొదలు పెడుతున్నప్పుడు వారిని చంపారు. 10 అయ్యా కుమార్తె రిస్పా గోనెపట్ట తీసుకుని ఒక బండ మీద దానిని పరచుకొని కోతకాలం ప్రారంభం నుండి ఆ శవాల మీద ఆకాశం నుండి వర్షం కురిసేవరకు పగలు పక్షులు వాటిని ముట్టకుండా రాత్రి అడవి జంతువులు వాటిని తినకుండా కాపలా కాస్తూ ఆమె అక్కడే ఉండిపోయింది. 11 అయ్యా కుమార్తె సౌలు ఉంపుడుగత్తెయైన రిస్పా చేసింది దావీదుకు తెలిసినప్పుడు, 12 దావీదు వెళ్లి యాబేషు గిలాదువారి దగ్గరి నుండి సౌలు, అతని కుమారుడైన యోనాతాను ఎముకలను తీసుకువచ్చాడు. (గిల్బోవలో ఫిలిష్తీయులు సౌలు యోనాతానులను చంపి బేత్-షాను పట్టణపు వీధుల్లో వ్రేలాడదీసినప్పుడు యాబేషు గిలాదువారు వారి మృతదేహాలను దొంగిలించారు.) 13 దావీదు వారి దగ్గర నుండి సౌలు అతని కుమారుడైన యోనాతాను ఎముకలు తెప్పించాడు. రాజాజ్ఞ ప్రకారం ఉరితీయబడిన ఆ ఏడుగురి ఎముకలు కూడా సమకూర్చారు. 14 సౌలు అతని కుమారుడైన యోనాతాను ఎముకలు తీసుకుని బెన్యామీనీయుల దేశంలోని సేలాలో ఉన్న సౌలు తండ్రి కీషు సమాధిలో పాతిపెట్టారు. రాజు ఆజ్ఞ ప్రకారం ప్రతిదీ వారు చేసిన తర్వాత దేశం కోసం వారు చేసిన ప్రార్థనకు దేవుడు జవాబిచ్చారు. ఫిలిష్తీయులతో యుద్ధం 15 తర్వాత మరోసారి ఫిలిష్తీయులకు ఇశ్రాయేలీయులకు యుద్ధం జరిగింది. దావీదు తన సైనికులతో కలిసి వెళ్లి ఫిలిష్తీయులతో యుద్ధం చేసి అలసిపోయాడు. 16 అక్కడ రాఫా సంతతివాడైన ఇష్బి-బెనోబు అనేవాడు క్రొత్త ఖడ్గం, మూడువందల షెకెళ్ళ బరువు ఉన్న ఇత్తడి ఈటె పట్టుకుని, “దావీదును చంపుతాను” అని అన్నాడు. 17 అయితే సెరూయా కుమారుడైన అబీషై దావీదును కాపాడి ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపాడు. అప్పుడు దావీదు మనుష్యులు, “ఇశ్రాయేలీయుల దీపమైన నీవు ఆరిపోకుండా ఉండేలా నీవు ఇకపై మాతో పాటు యుద్ధానికి రావద్దు” అని దావీదుతో ప్రమాణం చేయించారు. 18 కొంతకాలం తర్వాత గోబు దగ్గర ఫిలిష్తీయులతో మరోసారి యుద్ధం జరిగింది. ఆ సమయంలో హుషాతీయుడైన సిబ్బెకై రాఫా వారసులలో ఒకడైన సఫును చంపాడు. 19 గోబు దగ్గర ఫిలిష్తీయులతో జరిగిన మరో యుద్ధంలో బేత్లెహేమీయుడైన యాయీరు కుమారుడు ఎల్హానాను గిత్తీయుడైన గొల్యాతు సోదరున్ని చంపాడు. అతని ఈటె నేతపనివాని అడ్డకర్రంత పెద్దది. 20 గాతు దగ్గర జరిగిన మరో యుద్ధంలో చాలా పొడవైన వాడొకడు ఉన్నాడు. అతని రెండు చేతులకు కాళ్లకు ఆరు వ్రేళ్ళ చొప్పున మొత్తం ఇరవైనాలుగు వ్రేళ్ళు ఉన్నాయి. అతడు కూడా రాఫా సంతతివాడు. 21 అతడు ఇశ్రాయేలీయులను దూషించినప్పుడు, దావీదు సోదరుడు, షిమ్యా కుమారుడైన యోనాతాను అతన్ని చంపాడు. 22 ఈ నలుగురు గాతుకు చెందిన రాఫా సంతతివారు, వీరు దావీదు అతని సైనికుల చేతిలో చనిపోయారు. |
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica, Inc.