Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

2 సమూయేలు 16 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం


రాజైన దావీదు, సీబా

1 దావీదు కొండమీద కొంత దూరం వెళ్లినప్పుడు, మెఫీబోషెతు సేవకుడైన సీబా అతన్ని కలవడానికి వేచి ఉన్నాడు. అతడు కళ్లకు గంతలు కట్టివున్న రెండు గాడిదలను తీసుకువచ్చాడు. వాటి మీద 200 రొట్టెలు, 100 ఎండు ద్రాక్ష గెలలు, 100 అంజూర పండ్లు ఉన్న కొమ్మలు, ఒక ద్రాక్షరసపు తిత్తి ఉన్నాయి.

2 రాజు సీబాను చూసి, “వీటిని ఎందుకు తెచ్చావు?” అని అడిగాడు. అందుకు సీబా, “గాడిదలు రాజు ఇంటివారు ఎక్కి వెళ్లడానికి, రొట్టె పండ్లు మీతో ఉన్నవారు తినడానికి, ద్రాక్షరసం అరణ్యంలో అలసిపోయిన వారు త్రాగడానికి” అని జవాబిచ్చాడు.

3 అప్పుడు రాజు, “నీ యజమాని మనుమడు ఎక్కడున్నాడు?” అని అడిగాడు. అందుకు సీబా రాజుతో, “ఈ రోజు ఇశ్రాయేలీయులు మా తాత రాజ్యాన్ని నాకు తిరిగి ఇస్తారనుకుని అతడు యెరూషలేములోనే ఉన్నాడు” అని జవాబిచ్చాడు.

4 అప్పుడు రాజు సీబాతో, “మెఫీబోషెతుకు చెందినదంతా ఇప్పుడు నీది” అని అన్నాడు. అందుకు సీబా, “నా ప్రభువా రాజా, మీ దయ నాపై ఉండును గాక, మీకు నా దండాలు” అన్నాడు.


షిమీ దావీదును శపించుట

5 రాజైన దావీదు బహూరీముకు వచ్చినప్పుడు, సౌలు కుటుంబ వంశానికి చెందిన ఒక వ్యక్తి అక్కడినుండి బయటకు వచ్చాడు. అతడు గెరా కుమారుడైన షిమీ. అతడు బయటకు వస్తూ దావీదును శపిస్తున్నాడు.

6 సైనికులు బలాఢ్యులు దావీదుకు ఇరువైపులా ఉన్నప్పటికీ అతడు రాజైన దావీదు మీదికి అతని అధికారులందరి మీదికి రాళ్లు విసిరాడు.

7 అంతేకాక షిమీ అతన్ని శపిస్తూనే, “వెళ్లిపో, వెళ్లిపో, హంతకుడా, దుర్మార్గుడా!

8 నీవు ఎవరి స్థానంలో పరిపాలించావో, ఆ సౌలు ఇంటివారి రక్తాన్ని నీవు చిందించినందుకు యెహోవా నీకు ప్రతిఫలమిచ్చారు. యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యాన్ని అప్పగించారు. నీవు హంతకుడివి కాబట్టే నీవు పతనానికి దగ్గరలో ఉన్నావు” అని దూషించాడు.

9 అప్పుడు సెరూయా కుమారుడైన అబీషై రాజుతో, “ఈ చచ్చిన కుక్క రాజైన నా ప్రభువును ఎందుకు శపించాలి? నేను వెళ్లి అతని తల నరికివేయనివ్వండి” అన్నాడు.

10 అందుకు రాజు, “సెరూయా కుమారులారా! ఈ విషయంతో మీకేమి సంబంధం? ‘దావీదును శపించు’ అని ఒకవేళ యెహోవా అతనితో చెప్పినందుకు అతడు శపిస్తున్నాడేమో, అలాంటప్పుడు, ‘నీవు ఎందుకిలా చేస్తున్నావు’ అని ఎవరు అడగగలరు?” అన్నాడు.

11 తర్వాత దావీదు అబీషైతో, తనతో ఉన్నవారందరితో, “నా రక్తం పంచుకుని పుట్టిన నా కుమారుడే నన్ను చంపే ప్రయత్నం చేస్తున్నాడు. అలాంటప్పుడు ఈ బెన్యామీనీయుడు ఇలా చేయడంలో ఆశ్చర్యమేముంది? అతన్ని వదిలేయండి, శపించమని యెహోవా వానికి చెప్పారు, కాబట్టి శపించనివ్వండి.

12 యెహోవా నా బాధ చూసి, ఈ రోజు ఇతడు పలికిన శాపాలకు బదులుగా నాకు మంచి చేస్తాడేమో!” అని అన్నాడు.

13 దావీదు, అతని మనుష్యులు తమ దారిన ముందుకు వెళ్తుండగా, షిమీ అతనికి ఎదురుగా కొండ ప్రక్క నుండి వెళ్తూ, దావీదును శపిస్తూ, అతని మీదికి రాళ్లు విసురుతూ, అతని మీద దుమ్మెత్తి పోస్తూ ఉన్నాడు.

14 రాజు, అతనితో ఉన్నవారందరు తమ గమ్యాన్ని చేరుకునే సరికి అలసిపోయారు కాబట్టి అక్కడ వారు అలసట తీర్చుకున్నారు.


అహీతోపెలు హూషై సలహా ఇచ్చుట

15 ఇంతలో అబ్షాలోము ఇశ్రాయేలు వారందరు యెరూషలేముకు వచ్చారు. అహీతోపెలు కూడా అతనితో ఉన్నాడు.

16 అప్పుడు దావీదు స్నేహితుడు అర్కీయుడైన హూషై అబ్షాలోము దగ్గరకు వచ్చి అతనితో, “రాజు చిరకాలం జీవించు గాక! రాజు చిరకాలం జీవించు గాక!” అన్నాడు.

17 అబ్షాలోము, “నీ స్నేహితుడైన దావీదుకు నీవు చూపించే ప్రేమ ఇదేనా? అతడు నీ స్నేహితుడే కదా, అతనితో పాటు నీవెందుకు వెళ్లలేదు?” అని హూషైను అడిగాడు.

18 అందుకు హూషై అబ్షాలోముతో, “యెహోవా, ఈ ప్రజలు, ఇశ్రాయేలీయులందరు కలిసి ఎవరిని ఎంచుకుంటారో అతనికి చెందిన వాడనై అతనితోనే నేను ఉంటాను.

19 అంతేకాదు నేను ఎవరికి సేవ చేయాలి? అతని కుమారునికి నేను సేవ చేయకూడదా? మీ తండ్రికి సేవ చేసినట్లే నీకు కూడా నేను సేవ చేస్తాను” అన్నాడు.

20 తర్వాత అబ్షాలోము అహీతోపెలుతో, “మనమేమి చేద్దాం? సలహా ఇవ్వు” అన్నాడు.

21 అందుకు అహీతోపెలు అబ్షాలోముతో, “రాజభవనానికి కాపలాగా మీ తండ్రి ఉంచిన అతని ఉంపుడుగత్తెలతో పడుకోండి. అప్పుడు మీ తండ్రికి మీరు మరింత అసహ్యులు అయ్యారని ఇశ్రాయేలీయులందరు తెలుసుకుంటారు. మీ పక్షాన ఉన్న ప్రతి ఒక్కరు ఇంకా శక్తిమంతులవుతారు” అన్నాడు.

22 కాబట్టి వారు అబ్షాలోము కోసం మేడమీద ఒక గుడారం వేశారు. ఇశ్రాయేలీయులు చూస్తుండగా అబ్షాలోము తన తండ్రి ఉంపుడుగత్తెలతో గడిపాడు.

23 ఆ రోజుల్లో అహీతోపెలు ఏదైనా సలహా చెప్తే అది దేవుని నుండి వచ్చిన మాటలా ఉండేది. దావీదు, అబ్షాలోము కూడా అలానే భావించేవారు.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica® Open Telugu Contemporary Version™

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica, Inc.
Lean sinn:



Sanasan