Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

2 రాజులు 24 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

1 యెహోయాకీము పరిపాలన కాలంలో బబులోను రాజైన నెబుకద్నెజరు దేశం మీదికి వచ్చాడు, యెహోయాకీము అతనికి లొంగిపోయి, మూడేళ్ళు సామంతుడిగా ఉన్నాడు. తర్వాత అతడు నెబుకద్నెజరు మీద తిరుగుబాటు చేశాడు.

2 అయితే యూదా రాజ్యాన్ని నాశనం చేయడానికి యెహోవా దాని మీదికి బబులోనీయుల, అరామీయుల, మోయాబీయుల, అమ్మోనీయుల దోపిడి మూకను పంపించాడు. ఇది యెహోవా తన సేవకులైన ప్రవక్తల ద్వారా చెప్పినట్లు జరిగింది.

3-4 ఇవి మనష్షే పాపాలు, అతడు చేసిన పనులన్నిటిని బట్టి, నిరపరాధుల రక్తం చిందించినందుకు, యూదా ప్రజలను తన సముఖంలో లేకుండా చేయాలని యెహోవా ఆజ్ఞ ప్రకారం జరిగాయి. ఎందుకంటే అతడు నిరపరాధుల రక్తంతో యెరూషలేమును నింపాడు, అది క్షమించడానికి యెహోవా ఇష్టపడలేదు.

5 యెహోయాకీము పరిపాలన గురించిన ఇతర విషయాలు, అతడు చేసినదంతా యూదా రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడలేదా?

6 యెహోయాకీము చనిపోయి తన పూర్వికుల దగ్గరకు చేరాడు. అతని తర్వాత అతని కుమారుడైన యెహోయాకీను రాజయ్యాడు.

7 ఈజిప్టు వాగు నుండి యూఫ్రటీసు నది వరకు ఈజిప్టు రాజు వంశంలో ఉన్న ప్రదేశాలన్నిటినీ బబులోను రాజు స్వాధీనం చేసుకున్నాడు కాబట్టి అతడు తన సొంత దేశాన్ని విడిచి బయటకు రాలేదు.


యూదా రాజైన యెహోయాకీను

8 యెహోయాకీను రాజైనప్పుడు అతని వయస్సు పద్దెనిమిది సంవత్సరాలు, అతడు యెరూషలేములో మూడు నెలలు పరిపాలించాడు. అతని తల్లి ఎల్నాతాను కుమార్తెయైన నెహుష్తా; ఈమె యెరూషలేము నగరవాసి.

9 అతడు తన తండ్రి చేసినట్టే యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు.

10 ఆ కాలంలో బబులోను రాజైన నెబుకద్నెజరు సైన్యాధికారులు యెరూషలేము మీదికి వచ్చి పట్టణానికి ముట్టడి వేశారు,

11 వారు పట్టణాన్ని ముట్టడిస్తూ ఉంటే బబులోను రాజు నెబుకద్నెజరు తానే దాని మీదికి వచ్చాడు.

12 యూదా రాజైన యెహోయాకీను, అతని తల్లి, అతని పరివారం, అతని క్రింద సంస్థానాధిపతులు, అతని అధికారులు బబులోను రాజుకు లొంగిపోయారు. బబులోను రాజు పరిపాలన యొక్క ఎనిమిదవ సంవత్సరంలో, అతడు యెహోయాకీనును ఖైదీగా తీసుకెళ్లాడు.

13 యెహోవా ప్రకటించినట్లు, నెబుకద్నెజరు యెహోవా మందిరంలో నుండి, రాజభవనంలో నుండి విలువైన వస్తువులన్నిటిని బయటకు తెప్పించాడు, ఇశ్రాయేలు రాజైన సొలొమోను యెహోవా మందిరం కోసం చేయించిన బంగారు పాత్రలన్నిటిని బబులోను రాజు ముక్కలు చేశాడు.

14 అతడు యెరూషలేము నగరవాసులందరినీ అనగా దేశంలో ఉన్న బీదలను తప్ప అధికారులందరిని యుద్ధవీరులను హస్తకళాకారులను కంసాలివారిని మొత్తం పదివేలమంది బందీలుగా తీసుకెళ్లాడు.

15 నెబుకద్నెజరు యెహోయాకీనును బందీగా బబులోనుకు తీసుకెళ్లాడు. అతడు యెరూషలేము నుండి రాజు తల్లిని, రాజు భార్యలను, రాజభవన అధికారులను, దేశంలోని ప్రముఖులను కూడా తీసుకెళ్లాడు.

16 బబులోను రాజు ఏడు వేలమంది యుద్ధములలో ఆరితేరిన బలాఢ్యులైన పరాక్రమశాలులందరిని, వేయిమంది హస్తకళాకారులను, కంసాలివారిని కూడా తీసుకెళ్లాడు.

17 బబులోను రాజు యెహోయాకీను పినతండ్రియైన మత్తన్యాను అతని స్థానంలో రాజుగా నియమించి, అతని పేరును సిద్కియా అని మార్చాడు.


యూదా రాజైన సిద్కియా

18 సిద్కియా రాజైనప్పుడు అతనికి ఇరవై ఒక్క సంవత్సరాలు, అతడు యెరూషలేములో పదకొండు సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు హమూటలు; ఆమె యిర్మీయా కుమార్తె; ఆమె లిబ్నా పట్టణస్థురాలు.

19 యెహోయాకీము చేసినట్టే అతడు యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు.

20 యెహోవా తీవ్రమైన కోపంతో వారిని తన సన్నిధి నుండి త్రోసివేసేంతగా ఈ చెడుతనం యెరూషలేము, యూదాల్లో జరిగింది. తర్వాత సిద్కియా బబులోను రాజుపై తిరుగుబాటు చేశాడు.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica® Open Telugu Contemporary Version™

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica, Inc.
Lean sinn:



Sanasan