Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

2 రాజులు 16 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం


యూదా రాజైన ఆహాజు

1 రెమల్యా కుమారుడైన పెకహు పరిపాలనలోని పదిహేడవ సంవత్సరంలో యూదారాజు, యోతాము కుమారుడైన ఆహాజు రాజయ్యాడు.

2 ఆహాజు రాజైనప్పుడు అతని వయస్సు ఇరవై సంవత్సరాలు, అతడు యెరూషలేములో పదహారు సంవత్సరాలు పరిపాలించాడు. తన పితరుడైన దావీదులా కాకుండా, అతడు తన దేవుడైన యెహోవా దృష్టిలో సరియైనది చేయలేదు.

3 అతడు ఇశ్రాయేలు రాజుల మార్గాలను అనుసరించాడు, ఇశ్రాయేలీయుల ఎదుట నుండి యెహోవా ఏ జనాలనైతే వెళ్లగొట్టారో, ఆ జనాల హేయక్రియలు చేసి, తన కుమారున్ని అగ్నిలో బలి ఇచ్చాడు.

4 అతడు క్షేత్రాల్లో, కొండలమీద, పచ్చని ప్రతి చెట్టు క్రింద బలులు అర్పిస్తూ ధూపం వేసేవాడు.

5 అప్పుడు అరాము రాజైన రెజీను, ఇశ్రాయేలు రాజు, రెమల్యా కుమారుడైన పెకహు యెరూషలేము మీదికి యుద్ధానికి వచ్చి ఆహాజును ముట్టడించారు కాని, అతన్ని జయించలేకపోయారు.

6 ఆ సమయంలో అరాము రాజైన రెజీను, అరాము కోసం ఏలతును తిరిగి పట్టుకుని, దానిలో నుండి యూదా వారిని వెళ్లగొట్టాడు. అప్పుడు ఎదోమీయులు ఏలతుకు వెళ్లి నేటి వరకు అక్కడే నివసిస్తున్నారు.

7 ఆహాజు అష్షూరు రాజైన తిగ్లత్-పిలేసెరుకు దూతలను పంపి, “నేను మీ దాసున్ని మీ బానిసను. మీరు వచ్చి, నాపై దాడి చేస్తున్న అరాము ఇశ్రాయేలు రాజుల నుండి నన్ను రక్షించండి” అని చెప్పాడు.

8 ఆహాజు యెహోవా మందిరంలో నుండి రాజభవనం ఖజానాలో నుండి వెండి బంగారాలు అష్షూరు రాజుకు కానుకగా పంపించాడు.

9 అష్షూరు రాజు అతని మాట అంగీకరించి, దమస్కు మీద దండెత్తి, దానిని స్వాధీనపరచుకున్నాడు. దాని ప్రజలను కీరుకు బందీలుగా తీసుకెళ్లాడు, రెజీనును చంపాడు.

10 రాజైన ఆహాజు అష్షూరు రాజైన తిగ్లత్-పిలేసెరును కలుసుకోడానికి దమస్కు పట్టణానికి వెళ్లాడు. దమస్కు పట్టణంలో ఒక బలిపీఠాన్ని చూసి, దాని పోలిక, నమూనా, దాని నిర్మాణ విధానం అంతా యాజకుడైన ఊరియాకు పంపాడు.

11 కాబట్టి యాజకుడైన ఊరియా ఆహాజు రాజు దమస్కు నుండి పంపిన నమూనా ప్రకారం బలిపీఠం ఒకటి కట్టించి, రాజైన ఆహాజు తిరిగి రాకముందే దాన్ని ఏర్పాటు చేశాడు.

12 రాజు దమస్కు నుండి తిరిగివచ్చి ఆ బలిపీఠాన్ని చూసి, దానిని సమీపించి, దాని మీద బలి అర్పించాడు.

13 దాని మీద దహనబలిని, భోజనార్పణను అర్పించాడు, పానార్పణాన్ని పోశాడు, సమాధానబలి రక్తాన్ని బలిపీఠం మీద చల్లాడు.

14 యెహోవా సముఖంలో ఉన్న ఇత్తడి బలిపీఠాన్ని మందిరం ఎదుట నుండి అనగా తాను కట్టించిన నూతన బలిపీఠానికి యెహోవా ఆలయానికి మధ్య నుండి తీసి, నూతన బలిపీఠానికి ఉత్తర దిక్కున దానిని ఉంచాడు.

15 ఆహాజు రాజ యాజకుడైన ఊరియాకు ఇలా ఆదేశాలిచ్చాడు: “నూతన పెద్ద బలిపీఠం మీద ఉదయకాలపు దహనబలి, సాయంకాలపు భోజనార్పణ, రాజు దహనబలి, దేశ ప్రజల దహనబలులు, భోజనార్పణలు, పానార్పణలు అర్పించాలి. ఈ బలిపీఠం మీద దహనబలులు ఇతర బలులన్నిటి రక్తాన్ని చల్లాలి. అయితే నేను ఇత్తడి బలిపీఠాన్ని విచారణ కోసం వాడుకుంటాను.”

16 రాజైన ఆహాజు ఆదేశించినట్లే యాజకుడైన ఊరియా చేశాడు.

17 రాజైన ఆహాజు పీఠాలకున్న ప్రక్క పలకలను, పీఠాల నుండి గంగాళాన్ని తీయించాడు. ఇత్తడి ఎడ్ల మీద పెద్ద నీళ్ల తొట్టిని తీసేసి పరచిన రాళ్లమీద దానిని ఉంచాడు.

18 మందిరం దగ్గర కట్టబడిన సబ్బాతు మంటపాలను, యెహోవా మందిరం బయట రాజు ద్వారాన్ని తీయించాడు. ఇది అష్షూరు రాజుకు భయపడి ఇదంతా చేశాడు.

19 ఆహాజు పరిపాలనకు సంబంధించిన ఇతర విషయాలు, అతడు చేసింది, యూదా రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడలేదా?

20 ఆహాజు చనిపోయి తన పూర్వికుల దగ్గరకు చేరాడు. అతన్ని దావీదు పట్టణంలో సమాధి చేశారు. అతని తర్వాత అతని కుమారుడైన హిజ్కియా రాజయ్యాడు.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica® Open Telugu Contemporary Version™

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica, Inc.
Lean sinn:



Sanasan