Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

2 కొరింథీ 9 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

1 పరిశుద్ధులకు చేస్తున్న పరిచర్య గురించి నేను మీకు వ్రాయాల్సిన అవసరం లేదు.

2 సహాయం చేయడానికి మీరు ఆసక్తి గలవారని నాకు తెలుసు, అందుకే మాసిదోనియాలోని ప్రజలకు మీ గురించి గొప్పగా చెప్పి, అకాయలో ఉన్న మీరు గత ఏడాది నుండి సహాయం చేయడానికి సిద్ధపడ్డారని వారికి చెప్పాను; మీ ఆసక్తి వారిలో అనేకమందిని ప్రేరేపించింది.

3 అయితే ఈ విషయంలో మీ గురించి మేము చెప్పిన గొప్పలు వట్టివి కాకుండా నేను చెప్పినట్లుగా మీరు సిద్ధంగా ఉండాలని సహోదరులను నేను పంపుతున్నాను.

4 ఒకవేళ మాసిదోనియా వారెవరైనా నాతో వచ్చినపుడు మీరు సిద్ధంగా లేరని చూస్తే, మీరే కాదు మీమీద ఎంతో నమ్మకాన్ని కలిగి ఉన్నందుకు మేము కూడా సిగ్గుపడాల్సి ఉంటుంది.

5 అందుకే, మీరు వాగ్దానం చేసిన కానుకలు అయిష్టంగా కాకుండా దాతృత్వంతో ఇచ్చేలా సిద్ధపడి ఉండడానికి ప్రోత్సహించేలా మీ దగ్గరకు ముందుగానే సహోదరులను పంపడం అవసరమని నేను అనుకున్నాను.


దాతృత్వం ప్రోత్సహింపబడుట

6 ఇది జ్ఞాపకం ఉంచుకోండి: కొంచెం విత్తినవానికి కొంచెం పంటే పండుతుంది. విస్తారంగా విత్తినవానికి విస్తారమైన పంట పండుతుంది.

7 సంతోషంతో ఇచ్చేవారిని దేవుడు ప్రేమిస్తారు కాబట్టి అయిష్టంగా బలవంతంగా కాకుండా మీలో ప్రతి ఒక్కరు మీ హృదయాల్లో నిర్ణయించుకున్న ప్రకారం ఇవ్వండి.

8 అన్ని విషయాల్లో, అన్నివేళల్లో మీకు కావలసినవన్ని కలిగి ఉండి, ప్రతి మంచి కార్యంలో సమృద్ధిగా ఉండేలా దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించగలరు.

9 దీని గురించి ఇలా వ్రాయబడి ఉంది: “వారు ధారాళంగా బహుమానాలను పేదలకు పంచిపెట్టారు. వారి నీతి నిరంతరం నిలిచి ఉంటుంది.”

10 విత్తువానికి విత్తనాలు, తినడానికి రొట్టె సమకూర్చే దేవుడు మీకు విత్తనం ఇచ్చి ఫలింపజేస్తారు, మీ నీతి పంటను విస్తరింపజేస్తారు.

11 మీరు ప్రతి సమయంలో ధారాళంగా ఇవ్వడానికి మీరు అన్ని రకాలుగా సంపన్నులు అవుతారు. మీ దాతృత్వం బట్టి మా ద్వారా దేవునికి కృతజ్ఞతలు చెల్లించబడతాయి.

12 మీరు చేసే ఈ పరిచర్య కేవలం పరిశుద్ధుల అవసరాలు తీర్చడమే కాదు, దేవునికి అనేక విధాలుగా కృతజ్ఞతలు చెల్లించినట్టవుతుంది.

13 ఈ పరిచర్య వలన మిమ్మల్ని మీరు నిరూపించుకున్నారు. క్రీస్తు సువార్తను మీరు అంగీకరించడాన్ని బట్టి కలిగిన విధేయత కోసం, వారితో అందరితో పాలుపంచుకొనే మీ దాతృత్వం బట్టి ఇతరులు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తారు.

14 దేవుడు మీకిచ్చిన అత్యధిక కృపను బట్టి వారు మీ కోసం ప్రార్థిస్తూ, మిమ్మల్ని చూడాలని ఆశపడుతున్నారు.

15 చెప్పశక్యం కాని ఆయన వరాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica® Open Telugu Contemporary Version™

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica, Inc.
Lean sinn:



Sanasan