Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

2 కొరింథీ 2 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

1 కాబట్టి నేను దుఃఖం కలిగించేలా మీ దగ్గరకు తిరిగి రాకూడదని నేను నిర్ణయించుకున్నాను.

2 ఎందుకంటే, నేను మీకు దుఃఖం కలిగిస్తే, నేను దుఃఖంలో విడిచిపెట్టిన వారు తప్ప మరి ఎవరు నన్ను సంతోషపెట్టగలరు?

3 కాబట్టి, నేను అక్కడికి వచ్చినపుడు నన్ను సంతోషపెట్టాల్సిన వ్యక్తులే నన్ను దుఃఖపెట్టకూడదని నేను మీకు వ్రాశాను. నా ఆనందమే మీ అందరి ఆనందమని నాకు గట్టి నమ్మకము.

4 ఎంతో దుఃఖ హృదయంతో, కన్నీటితో మీకు వ్రాశాను. నేను వ్రాసింది మిమ్మల్ని బాధపెట్టడానికి కాదు కాని, నేను మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నానో, మీరు గుర్తించడానికి మాత్రమే.


దోషికి క్షమాపణ

5 ఎవరైనా దుఃఖం కలిగిస్తే, నాకు మాత్రమే గాక మీకందరికిని దుఃఖం కలిగించినట్లే. ఇంతకంటే కఠినంగా మాట్లాడటం నాకు ఇష్టం లేదు.

6 అలాంటి వానికి మీలో ఎక్కువ మంది ద్వారా విధించబడిన శిక్షే చాలు.

7 కాబట్టి మీరిక అతన్ని శిక్షించకుండా క్షమించి, ఓదార్చడం మంచిది, లేకపోతే అతడు అధిక దుఃఖంలో మునిగిపోతాడేమో.

8 అందుకే, మీరు అతని పట్ల మీ ప్రేమను మళ్ళీ రూఢిపరచుమని మిమ్మల్ని వేడుకుంటున్నాను.

9 మిమ్మల్ని పరీక్షించి, అన్ని విషయాల్లో మీరు విధేయత చూపుతారో లేదో తెలుసుకోవడానికి నేను అలా వ్రాశాను.

10 మీరు క్షమించేవారిని నేను క్షమిస్తాను. నేను ఏ దోషమైన క్షమిస్తే, మీ కోసమే క్రీస్తును బట్టి క్షమిస్తాను.

11 సాతాను మనపై ఆధిక్యాన్ని పొందకుండా అలా చేశాను, సాతాను తంత్రాలు మనకు తెలియనివి కావు.


క్రొత్త నిబంధన పరిచారకులు

12 క్రీస్తు సువార్తను బోధించడానికి నేను త్రోయకు చేరినప్పుడు ప్రభువు నా పని కోసం అప్పటికే అక్కడ మార్గం సిద్ధపరచి ఉంచారని తెలుసుకున్నాను.

13 కాని నా సోదరుడు తీతును అక్కడ నాకు కనిపించకపోవడంతో నా మనస్సుకు నెమ్మది లేదు. కాబట్టి అక్కడి ప్రజలకు వీడ్కోలు చెప్పి మాసిదోనియా ప్రాంతానికి వెళ్లాను.

14 కాబట్టి ఆయన మా ద్వారా ప్రతి స్థలంలో క్రీస్తును గురించిన జ్ఞానపు సువాసన వ్యాపింపచేస్తూ, ఆయనలో మమ్మల్ని ఎల్లప్పుడు విజయోత్సాహంతో ముందుకు నడిపిస్తున్న దేవునికి కృతజ్ఞతలు.

15 ఎందుకంటే, రక్షించబడుతున్నవారి మధ్య, నశించేవారి మధ్య మేము దేవునికి ఇష్టమైన క్రీస్తు పరిమళంగా ఉన్నాము.

16 ఒకరికి మరణం తెచ్చే వాసనగా, మరొకరికి జీవం తెచ్చే వాసనగా ఉన్నాము. కాబట్టి, అలాంటి కార్యానికి యోగ్యులు ఎవరు?

17 మేము దేవుని వాక్యాన్ని స్వలాభం కోసం అమ్మేవారం కాదు, మేము దేవుని వాక్యాన్ని నిజాయితీగా క్రీస్తు అధికారంతో ఆయన ఎదుట బోధిస్తున్నాము. దేవుడు మమ్మల్ని చూస్తున్నారని మాకు తెలుసు.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica® Open Telugu Contemporary Version™

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica, Inc.
Lean sinn:



Sanasan