2 దిన 12 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదంషీషకు యెరూషలేముపై దాడి చేయుట 1 రెహబాము రాజ్యం స్థిరపడి బలపడిన తర్వాత అతడు, ఇశ్రాయేలీయులంతా యెహోవా ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టారు. 2 వారు యెహోవా పట్ల నమ్మకద్రోహులుగా ఉన్నారు కాబట్టి, రాజైన రెహబాము పాలనలోని అయిదవ సంవత్సరం ఈజిప్టు రాజైన షీషకు యెరూషలేము మీద దాడి చేశాడు. 3 అతనితో పాటు 1,200 రథాలు, 60,000 మంది రౌతులు, లెక్కలేనంత మంది లిబియానీయులు సుక్కీయులు కూషీయులు ఈజిప్టు నుండి వచ్చారు. 4 షీషకు యూదా దేశంలో కోటగోడలు గల పట్టణాలను పట్టుకుని, తర్వాత యెరూషలేము వరకు వచ్చాడు. 5 అప్పుడు షెమయా ప్రవక్త రెహబాము దగ్గరకు, షీషకుకు భయపడి యెరూషలేముకు వచ్చి చేరిన యూదా అధిపతుల దగ్గరకు వచ్చి వారితో, “యెహోవా చెప్పేదేమిటంటే, మీరు నన్ను విడిచిపెట్టారు. కాబట్టి నేను మిమ్మల్ని షీషకు చేతికి అప్పగించాను” అని చెప్పాడు. 6 రాజు ఇశ్రాయేలు అధికారులు తమను తాము తగ్గించుకొని, “యెహోవా న్యాయం గలవాడు” అని ఒప్పుకున్నారు. 7 వారు అలా తగ్గించుకోవడం యెహోవా చూశారు. కాబట్టి యెహోవా నుండి ఈ వాక్కు షెమయాకు వచ్చింది, “వారు తమను తాము తగ్గించుకున్నారు కాబట్టి నేను వారిని నాశనం చెయ్యను. త్వరలో వారిని శిక్షిస్తాను. షీషకు ద్వారా నా కోపాగ్ని యెరూషలేము మీద కుమ్మరించను. 8 కాని, నాకు సేవచేయడంలో ఇతర దేశాల రాజులకు సేవచేయడంలో ఉన్న తేడా వారు గ్రహించాలి కాబట్టి వారు షీషకుకు దాసులవుతారు.” 9 ఈజిప్టు రాజైన షీషకు యెరూషలేము మీదికి వచ్చినప్పుడు, అతడు యెహోవా మందిరంలోని నిధిని, రాజభవనంలో నిధిని దోచుకున్నాడు. అతడు సమస్తాన్ని, సొలొమోను చేయించిన బంగారు డాళ్లతో పాటు తీసుకెళ్లాడు. 10 కాబట్టి రాజైన రెహబాము ఆ డాళ్లకు బదులు ఇత్తడి డాళ్ళను చేయించి వాటిని రాజభవనాన్ని కాపలా కాసే రక్షకభటుల అధిపతులకు అప్పగించాడు. 11 రాజు యెహోవా ఆలయానికి వచ్చినప్పుడెల్లా భటులు ఆ డాళ్లు మోసుకెళ్లేవారు. తర్వాత వాటిని కాపలా గదిలో ఉంచేవారు. 12 రెహబాము తనను తగ్గించుకున్నందుకు, యూదాలో కొన్ని మంచి విషయాలు కనిపించినందుకు యెహోవా అతన్ని పూర్తిగా నాశనం చేయక, అతని మీద నుండి తన కోపం మళ్ళించుకున్నాడు. 13 రాజైన రెహబాము యెరూషలేములో సుస్థిరంగా ఉండి రాజుగా పరిపాలిస్తూ వచ్చాడు. అతడు రాజైనప్పుడు అతని వయస్సు నలభై ఒక సంవత్సరాలు. తన నామం ఉంచడానికి యెహోవా ఇశ్రాయేలు గోత్రాల్లో నుండి ఎన్నుకున్న పట్టణమైన యెరూషలేములో అతడు పదిహేడు సంవత్సరాలు పరిపాలించాడు, రెహబాము తల్లి పేరు నయమా; ఆమె అమ్మోనీయురాలు. 14 రెహబాము యెహోవాను వెదకడం మీద మనస్సు నిలుపుకోలేదు, కాబట్టి చెడుగా ప్రవర్తించేవాడు. 15 రెహబాము పరిపాలనకు సంబంధించిన విషయాలు, మొదటి నుండి చివరి వరకు షెమయా ప్రవక్త వ్రాసిన గ్రంథంలో దీర్ఘదర్శియైన ఇద్దో వ్రాసిన వంశవృక్షాల విషయమైన గ్రంథంలో వ్రాయబడలేదా? రెహబాముకు యరొబాముకు మధ్య యుద్ధం ఎప్పుడూ జరుగుతూ ఉండేది. 16 రెహబాము చనిపోయి తన పూర్వికుల దగ్గరకు చేరాడు, దావీదు పట్టణంలో అతన్ని తన పూర్వికుల దగ్గర సమాధి చేశారు. అతని తర్వాత అతని కుమారుడు అబీయా రాజయ్యాడు. |
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica, Inc.