Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

1 తిమోతికి 6 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

1 దేవుని నామాన్ని మేము చేసిన బోధలను ప్రజలు దూషించకుండ ఉండడానికి, దాసులుగా బానిసత్వపు కాడి క్రింద ఉన్న విశ్వాసులైన వారందరు తమ యజమానులను గౌరవించదగినవారిగా భావించాలి.

2 విశ్వాసులైన యజమానులను కలిగినవారు వారు తమ తోటి విశ్వాసులే కదా అని అగౌరవంగా ప్రవర్తించకూడదు. పైగా తోటి విశ్వాసులైన తమ యజమానులు తమకెంతో ప్రియమైనవారని, వారు తమ దాసుల క్షేమం కోసం నియమించబడినవారని, వారికి మరింత బాగా సేవలు చేయాలి. నీవు ఈ సంగతులు బోధించి విశ్వాసులను ప్రోత్సాహించాలి.


అబద్ధ బోధకులు ధనాన్ని ప్రేమించేవారు

3 మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క మంచి ఉపదేశాలకు మన దైవభక్తిని పెంచే బోధకు వ్యతిరేకమైన బోధను ఎవరైనా బోధిస్తే,

4 అలాంటివారు వివేకం లేనివారు అహంకారులు. అలాంటివారు, మాటల వలన కలిగే వివాదాలలో గొడవలలో అనవసరమైన ఆసక్తి కలిగి ఉంటారు. దాని ఫలితంగా అసూయలు, కలహాలు, ద్వేషపూరితమైన మాటలు, దుష్ట సందేహాలు కలుగుతాయి,

5 దుష్ట ఆలోచనలు కలిగిన ప్రజల మధ్యలో తరచూ ఘర్షణలు జరుగుతాయి, అలాంటివారు సత్యం నుండి తొలగిపోయి, దైవభక్తి అనేది ఆదాయం తెచ్చే ఒక మార్గమని భావిస్తారు.

6 అయితే సంతృప్తితో దైవభక్తి కలిగి ఉండడమే గొప్ప లాభదాయకము.

7 మనం ఈ లోకంలోనికి ఏమి తీసుకురాలేదు, లోకం నుండి ఏమి తీసుకెళ్లలేము.

8 కాబట్టి మనం ఆహారాన్ని వస్త్రాలను కలిగి ఉంటే, వాటితో తృప్తిచెందాలి.

9 అయితే ధనవంతులుగా అవ్వాలని కోరుకునేవారు శోధనలో పడి, మానవులను పాడుచేసి నాశనం చేసే మూర్ఖమైన ప్రమాదకరమైన కోరికల వలలో చిక్కుకుంటారు.

10 డబ్బుపై ఉండే ప్రేమ ప్రతి దుష్టత్వానికి వేరు. కొందరు డబ్బును ఎక్కువగా ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి, తమను తామే అనేక దుఃఖాలకు గురిచేసుకున్నారు.


తిమోతికి చివరి బాధ్యత

11 అయితే దైవజనుడవైన నీవు, వీటి నుండి పారిపోయి నీతి, భక్తి, విశ్వాసం, ప్రేమ, సహనం, మంచితనం అనే వాటిని వెంబడించు.

12 విశ్వాస సంబంధమైన మంచి పోరాటాన్ని పోరాడు. అనేకమంది సాక్షిసమూహం ఎదుట నీవు చేసిన మంచి ఒప్పుకోలును బట్టి నీవు పిలువబడిన నిత్యజీవాన్ని చేపట్టు.

13 అన్నిటికి జీవాన్ని ఇచ్చే దేవుని ఎదుట, పొంతి పిలాతు ఎదుట మంచి సాక్ష్యమిచ్చిన క్రీస్తు యేసు ముందు నేను నీకు నిర్ధేశించాను.

14 నీవు మన ప్రభువైన యేసు క్రీస్తు తిరిగి ప్రత్యక్షమయ్యే వరకు నిందగాని డాగుగాని లేకుండా ఈ ఆజ్ఞలకు లోబడు.

15 రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, ఏకైక అధిపతిగా ఉన్న భాగ్యవంతుడైన దేవున్ని తగిన సమయంలో దేవుడు ప్రత్యక్షపరుస్తారు.

16 ఆయన ఒక్కడే మరణం లేనివాడు, ఆయన సమీపించలేనంత వెలుగులో నివసిస్తాడు, ఆయనను ఎవరూ ఎన్నడు చూడలేదు, ఎన్నడు చూడలేరు. అలాంటి దేవునికే ఘనత ప్రభావాలు నిరంతరం కలుగును గాక ఆమేన్.

17 ఈ లోకంలో ధనవంతులైన వారిని గర్వంతో ఉండవద్దని, స్థిరంగా ఉండని సంపదలపై తమ నమ్మకాన్ని ఉంచక, వారి సంతోషం కోసం కావలసిన వాటన్నిటిని సమృద్ధిగా ఇచ్చే దేవునిలోనే నిరీక్షణ ఉంచమని ఆజ్ఞాపించు.

18 వారు మంచిని చేస్తూ, మంచి పనులు చేయడంలో ధనవంతులుగా ఇతరులకు ఇవ్వడంలో ధారాళంగా ఉండమని ఆజ్ఞాపించు.

19 ఈ విధంగా రాబోవు కాలానికి దృఢమైన పునాది కాగల ధనాన్ని వారు తమ కోసం కూర్చుకుంటారు, అప్పుడు వారు నిజమైన జీవాన్ని సంపాదించుకోగలరు.

20 తిమోతీ, నీకు అప్పగించబడిన బోధను జాగ్రత్తగా పాటించు. దుష్టమైన వట్టి మాటలకు, జ్ఞానమని తప్పుగా పిలువబడే విరుద్ధమైన ఆలోచనలకు దూరంగా ఉండాలి.

21 కొందరు అలాంటి జ్ఞానాన్ని కలిగి ఉన్నామని చెప్పుకుంటూ విశ్వాసం నుండి తొలగిపోయారు. కృప నీకు తోడై ఉండును గాక!

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica® Open Telugu Contemporary Version™

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica, Inc.
Lean sinn:



Sanasan