Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

1 థెస్సలొనీకయులకు 5 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం


ప్రభువు దినం

1 సహోదరీ సహోదరులారా, యేసు క్రీస్తు రాకడ ఎప్పుడు సంభవిస్తుందో ఆ కాలాలు, సమయాల గురించి మేము మీకు వ్రాయాల్సిన అవసరం లేదు,

2 ప్రభువు దినం రాత్రి దొంగలా వస్తుందని మీకు బాగా తెలుసు.

3 ప్రజలు, మేము, “నెమ్మది కలిగి సురక్షితంగా ఉన్నాం” అని అనుకుంటున్నప్పుడు, ఒక గర్భిణి స్త్రీకి పురుటినొప్పులు వచ్చునట్లు వారి పైకి నాశనం అకస్మాత్తుగా వస్తుంది, కాబట్టి వారు దాని నుండి తప్పించుకోలేరు.

4 అయితే సహోదరీ సహోదరులారా, ఆ దినం దొంగలా మిమ్మల్ని ఆశ్చర్యపరచడానికి మీరు చీకటిలో లేరు.

5 మీరంతా వెలుగు సంతానం పగటి సంతానము. మనం చీకటికి లేదా రాత్రికి చెందినవారం కాదు.

6 కాబట్టి మనం నిద్రపోతున్న ఇతరుల్లా ఉండకుండా, మెలకువ కలిగి తెలివిగా ఉందాము.

7 నిద్రపోయేవారు రాత్రివేళ నిద్రపోతారు, మత్తులుగా ఉండేవారా రాత్రివేళ మత్తులై ఉంటారు.

8 అయితే మనం పగటికి చెందినవారం కాబట్టి తెలివి కలిగి, విశ్వాసం ప్రేమ అనే కవచాన్ని, రక్షణ పొందాలనే ఆ ఆశాభావాన్ని శిరస్త్రాణంగా ధరించుకొంటాము.

9 ఎందుకంటే దేవుడు మనల్ని ఉగ్రతను అనుభవించడానికి నియమించలేదు కాని, మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందడానికే నియమించారు.

10 ఆయన తిరిగి వచ్చినప్పుడు మనం లోకంలో జీవించి ఉన్నా లేదా మరణించినా ఆయనతో పాటు మనం జీవించాలని క్రీస్తు మన కోసం చనిపోయారు.

11 కాబట్టి మీరిప్పుడు చేస్తున్నట్లుగానే ఒకరిని ఒకరు ప్రోత్సహించుకొంటూ ఒకరిని ఒకరు బలపరచుకోండి.


తుది నియమాలు

12 సహోదరీ సహోదరులారా, మీ మధ్యలో ప్రయాసపడుతున్నవారిని, ప్రభువులో మీ కోసం శ్రద్ధ చూపించేవారిని, మిమ్మల్ని హెచ్చరించేవారిని గౌరవించాలని మేము మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాము.

13 వారి పనిని బట్టి వారిని ప్రేమతో అధికంగా గౌరవించండి. ఒకరితో ఒకరు సమాధానం కలిగి ఉండండి.

14 సహోదరీ సహోదరులారా, సోమరులను హెచ్చరించమని, క్రుంగిపోయినవారిని ప్రోత్సహించమని, బలహీనులకు సహాయం చేయమని, అందరితో సహనం కలిగి ఉండమని మేము మిమ్మల్ని వేడుకుంటున్నాము.

15 మీలో ఎవరూ కీడుకు ప్రతిగా కీడు చేయకుండ చూసుకోండి, అలాగే అందరికి మంచి చేయడానికే ఎల్లప్పుడూ ప్రయత్నించండి.

16 ఎల్లప్పుడు ఆనందించండి;

17 విడువక ప్రార్థించండి,

18 మీరు ప్రతి విషయం కోసం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని క్రీస్తు యేసులో మీ పట్ల దేవుని ఉద్దేశము.

19 ఆత్మ ప్రేరణను ఆర్పకండి.

20 ప్రవచనాలను తిరస్కరించకండి.

21 అన్నిటిని పరీక్షిస్తూ మంచి వాటిని గట్టిగా పట్టుకోండి,

22 ప్రతీ కీడును తిరస్కరించండి.

23 సమాధానకర్తయైన దేవుడు తానే స్వయంగా మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక. మీ పూర్ణాత్మను, మనస్సును దేహాన్ని మన ప్రభువైన యేసు క్రీస్తు రాకడలో నిందారహితంగా కాపాడును గాక.

24 మిమ్మల్ని పిలిచేవాడు నమ్మకమైనవాడు, కాబట్టి ఆయన ఖచ్చితంగా చేస్తారు.

25 సహోదరీ సహోదరులారా, మాకోసం ప్రార్థించండి.

26 దేవుని ప్రజలందరికి పవిత్ర ముద్దుతో వందనాలు.

27 సహోదరీ సహోదరులందరికి ఈ పత్రికను చదివి వినిపించాలని ప్రభువు పేరట మిమ్మల్ని ఆదేశిస్తున్నాను.

28 మన ప్రభువైన యేసు క్రీస్తు కృప మీతో ఉండును గాక.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica® Open Telugu Contemporary Version™

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica, Inc.
Lean sinn:



Sanasan