Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

1 సమూయేలు 29 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం


దావీదును సిక్లగుకు తిరిగి పంపిన ఆకీషు

1 ఫిలిష్తీయులు తమ సైన్యాన్నంతా సమకూర్చుకొని ఆఫెకులో దిగారు; ఇశ్రాయేలీయులు యెజ్రెయేలులోని నీటి ఊట ప్రక్కన బసచేశారు.

2 ఫిలిష్తీయుల రాజులు తమ సైన్యాలతో వందమంది చొప్పున వెయ్యిమంది చొప్పున వస్తుండగా దావీదు అతని మనుష్యులు ఆకీషుతో కలసి సైన్యం వెనుక వస్తున్నారు.

3 ఫిలిష్తీయుల సేనాధిపతులు, “ఈ హెబ్రీయులు ఎందుకు వస్తున్నారు?” అని ఆకీషును అడిగారు. అందుకు ఆకీషు, “ఇతడు ఇశ్రాయేలు రాజైన సౌలు యొక్క అధికారియైన దావీదు కాదా? ఇతడు ఇప్పటికే ఒక సంవత్సరం పాటు నాతో ఉన్నాడు ఇతడు సౌలును విడిచిపెట్టిన రోజు నుండి ఇప్పటివరకు, నేను ఇతనిలో ఎటువంటి తప్పును చూడలేదు” అని వారికి జవాబిచ్చాడు.

4 అందుకు ఫిలిష్తీయుల సేనాధిపతులు ఆకీషుమీద కోప్పడి, “నీవు ఇతనికి కేటాయించిన పట్టణానికి ఇతన్ని తిరిగి పంపించు. ఇతడు మనతో పాటు యుద్ధానికి రాకూడదు, ఒకవేళ వస్తే యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు మనకే వ్యతిరేకంగా మారతాడేమో! ఇతడు తన యజమాని దయను తిరిగి పొందడానికి మనవారి తలలు తీసుకెళ్లడంకన్నా వేరే మంచి మార్గం ఏముంటుంది?

5 “ ‘సౌలు వేయిమందిని దావీదు పదివేలమందిని చంపారు’ అని వారు నాట్యం చేస్తూ పాటలు పాడింది ఈ దావీదు గురించే కాదా?” అని అతనితో అన్నారు.

6 కాబట్టి ఆకీషు దావీదును పిలిచి అతనితో, “సజీవుడైన యెహోవా మీద ప్రమాణం చేసి చెప్తున్న, నీవు నిజంగా యథార్థవంతుడవు; సైన్యంలో నీవు నాతో పాటు కలిసి పని చేయడం నాకు ఇష్టమే. నీవు నా దగ్గరకు వచ్చిన రోజు నుండి ఈ రోజు వరకు నిజాయితీగా ఉన్నావు, కానీ ఈ అధికారులు నిన్ను తీసుకెళ్లడానికి అంగీకరించడం లేదు.

7 కాబట్టి నీవు తిరిగి నీ స్థలానికి సమాధానంగా వెళ్లు; ఫిలిష్తీయుల అధికారులకు కోపం తెప్పించేది ఏది చేయకు” అని అన్నాడు.

8 అందుకు దావీదు ఆకీషుతో, “కానీ నేను ఏమి చేశాను? నేను మీ దగ్గరకు వచ్చిన రోజు నుండి ఇప్పటివరకు నీ సేవకునికి వ్యతిరేకంగా నీకు ఏమి దొరికింది? నేను వెళ్లి నా ప్రభువైన రాజు శత్రువులతో ఎందుకు పోరాడలేను?”

9 అందుకు ఆకీషు దావీదుతో, “నీవు నా కంటికి దేవదూతలా మంచిగా కనబడుతున్నావు; కాని ఫిలిష్తీయుల దళాధిపతులు, ‘ఇతడు మనతో పాటు యుద్ధానికి రాకూడదు’ అని అంటున్నారు.

10 కాబట్టి ఉదయం నీవు, నీతో పాటు వచ్చిన నీ యజమాని సేవకులు త్వరగా లేచి, వెలుగు రాగానే వెళ్లండి” అని అన్నాడు.

11 కాబట్టి దావీదు అతని మనుష్యులు ఉదయం త్వరగా లేచి ఫిలిష్తీయుల దేశానికి తిరిగి వెళ్లారు, మరోవైపు ఫిలిష్తీయులు యెజ్రెయేలుకు వెళ్లారు.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica® Open Telugu Contemporary Version™

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica, Inc.
Lean sinn:



Sanasan