Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

1 కొరింథీ 4 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం


నిజమైన అపొస్తలత్వం యొక్క స్వభావం

1 అందుచేత, క్రీస్తు సేవకులుగా దేవుని మర్మాలను తెలియజేసే బాధ్యత పొందినవారిగా మమ్మల్ని మీరు భావించాలి.

2 ఆ బాధ్యతను పొందినవారు నమ్మకమైనవారిగా రుజువుపరచుకోవటం చాలా అవసరము.

3 మీ చేత గాని ఇతరులచేత గాని నేను తీర్పు తీర్చబడటం నాకు చాలా చిన్న విషయము. నిజానికి, నన్ను నేనే విమర్శించుకోను.

4 నా మనస్సాక్షి నిర్దోషమైనది, అయినా నేను నిర్దోషి అని కాదు నన్ను తీర్పు తీర్చేది ప్రభువే.

5 అందుకే నిర్ణీత సమయం రాకముందే తీర్పు తీర్చవద్దు, ప్రభువు వచ్చేవరకు ఆగాలి. చీకటిలో దాచబడిన రహస్యాలను వెలుగులోకి తెచ్చి హృదయంలోని ఉద్దేశాలను ఆయనే బయటపెడతారు. ఆ సమయంలో ప్రతి ఒక్కరు దేవుని నుండి తమ ఘనతను పొందుకొంటారు.

6 సహోదరీ సహోదరులారా, “వ్రాయబడిన వాటిని మించి వెళ్లవద్దు” అని చెప్పబడిన మాట భావాన్ని మా నుండి మీరు నేర్చుకోగలిగేలా, మీకు మేలు కలుగడానికి ఈ విషయాలను నా గురించి అపొల్లో గురించి ఉదాహరణగా చెప్పాను. అప్పుడు మమ్మల్ని అనుసరించే వారిగా మీరు ఒకరిపై ఒకరు అతిశయపడకుండా ఉంటారు.

7 ఇతరులకంటే నిన్ను ప్రత్యేకంగా చేసేది ఎవరు? ఇతరుల నుండి నీవు పొందనిది నీ దగ్గర ఏమి ఉంది? నీవు ఇతరుల నుండి పొంది కూడా పొందని వానిలా గొప్పలు చెప్పుకోవడం ఎందుకు?

8 ఇప్పటికే మీకు కావలసినవన్ని మీరు కలిగి ఉన్నారు! మీరు ధనవంతులైయ్యారు! మేము లేకుండానే మీరు పరిపాలించడం ప్రారంభించారు! మేము కూడా మీతో కలిసి పరిపాలించేలా మీరు నిజంగా పరిపాలించడం నాకు సంతోషమే!

9 దేవుడు అపొస్తలులమైన మమ్మల్ని మరణశిక్ష విధించబడినవారి వరుసలో అందరికంటే చివరిగా ఉంచాడని నాకు అనిపిస్తుంది. మేము లోకమంతటికి, దేవదూతలకు అదే విధంగా మనుష్యులకు ఒక వింతగా ఉన్నాము.

10 మేము క్రీస్తు కోసం బుద్ధిహీనులం, కాని మీరు క్రీస్తులో తెలివైనవారు! మేము బలహీనులం, కాని మీరు బలవంతులు! మీరు గౌరవం పొందారు, మేము అవమానం పొందాం!

11 ఈ సమయం వరకు ఆకలిదప్పులతో అలమటించాము, చింపిరి గుడ్డలతో ఉన్నాము, క్రూరంగా కొట్టబడ్డాము, నిరాశ్రయులుగా ఉన్నాము.

12 మా చేతులతో కష్టపడి పని చేసుకుంటున్నాము. మమ్మల్ని శపించినవారిని మేము దీవిస్తున్నాము; మమ్మల్ని హింసించినప్పుడు ఓర్చుకుంటున్నాము,

13 మమ్మల్ని దూషించినప్పుడు, దయతో సమాధానం చెప్తున్నాము. ఇప్పటివరకు మేము భూమి మీద నీచులుగా, లోకంలో పెంటకుప్పగా ఉన్నాము.


పౌలు వేడుకోలు, హెచ్చరిక

14 మిమ్మల్ని సిగ్గుపరచాలని కాదు కానీ, నా ప్రియమైన పిల్లలుగా మిమ్మల్ని హెచ్చరించాలని ఈ మాటలు వ్రాస్తున్నాను.

15 క్రీస్తులో మీకు పదివేలమంది ఉపదేశకులు ఉన్నా, తండ్రులు అనేకులు లేరు. కాబట్టి క్రీస్తు యేసులో సువార్త ద్వారా నేను మీకు తండ్రినయ్యాను.

16 కాబట్టి, నన్ను అనుకరించమని మిమ్మల్ని వేడుకుంటున్నాను.

17 ఈ కారణంగా, ప్రభువులో నమ్మకమైనవాడు నేను ప్రేమించే నా కుమారుడైన తిమోతిని మీ దగ్గరకు పంపాను. ప్రతి సంఘంలో ప్రతిచోట నేను బోధించిన దానితో ఏకీభవించే యేసు క్రీస్తులో నా జీవన విధానాన్ని అతడు మీకు జ్ఞాపకం చేస్తాడు.

18 నేను మీ దగ్గరకు రాననుకొని మీలో కొందరు గర్విస్తున్నారు.

19 అయితే, ప్రభువు చిత్తమైతే త్వరలోనే మీ దగ్గరకు వస్తాను. ఆ గర్విష్ఠులు మాట్లాడే మాటలనే కాకుండా వారికి ఏ శక్తి ఉందో తెలుసుకుంటాను.

20 దేవుని రాజ్యం అంటే వట్టిమాటలు కాదు అది శక్తితో కూడింది.

21 మీరేది కోరుతున్నారు? నేను మీ దగ్గరకు క్రమశిక్షణ అనే బెత్తంతో రావాలా? లేదా నేను ప్రేమతో సౌమ్యమైన మనస్సుతో రావాలా?

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica® Open Telugu Contemporary Version™

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica, Inc.
Lean sinn:



Sanasan