Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

1 కొరింథీ 16 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం


పరిశుద్ధుల కోసం కానుక సేకరించుట

1 ప్రభువు ప్రజల కోసం కానుక పోగుచేయడం గురించి గలతీయలోని సంఘాలకు నేను ఏమి చేయమని చెప్పానో మీరు కూడా అది చేయాలి.

2 ప్రతి వారంలో మొదటి రోజున మీలో ప్రతి ఒక్కరు మీ సంపాదన బట్టి కొంత ధనాన్ని ప్రక్కన పెట్టి దాచి ఉంచండి. దానివల్ల నేను వచ్చినపుడు కానుకలు సేకరించాల్సిన అవసరం ఉండదు.

3 నేను వచ్చిన తర్వాత, మీరు ఆమోదించిన వారికి నేను పరిచయ పత్రికలను ఇచ్చి, మీ కానుకలతో వారిని యెరూషలేముకు పంపుతాను.

4 నేను కూడా వెళ్లడం అవసరం అయితే, వారు నా వెంట వస్తారు.


వ్యక్తిగత విజ్ఞాపనలు

5 నేను మాసిదోనియాకు వెళ్లాలని అనుకుంటున్నాను కాబట్టి మాసిదోనియాకు వెళ్లినప్పుడు మీ దగ్గరకు వస్తాను.

6 బహుశ మీతో కొంతకాలం గడుపుతాను లేదా చలికాలమంతా ఉంటాను. అప్పుడు నేను ఎక్కడికి వెళ్తానో అక్కడికి నా ప్రయాణంలో మీరు నాకు సహాయం చేయగలరు.

7 మార్గమధ్యలో మిమ్మల్ని చూసి వెంటనే వెళ్లిపోవాలని నేను అనుకోవడం లేదు. ప్రభువు అనుమతిస్తే మీతో కొంతకాలం గడపాలని అనుకుంటున్నాను.

8 అయితే పెంతెకొస్తు దినం వరకు ఎఫెసులోనే ఉంటాను.

9 ఎందుకంటే చాలామంది నన్ను వ్యతిరేకించినా, ఫలవంతమైన పని చేయడానికి ఒక గొప్ప ద్వారం నాకు తెరవబడింది.

10 తిమోతి వచ్చినప్పుడు అతడు మీ దగ్గర నిర్భయంగా ఉండేలా చూడండి. నాలాగే అతడు కూడా ప్రభువు పని చేస్తున్నాడు.

11 కాబట్టి ఎవరూ అతని పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తించవద్దు. అతడు నా దగ్గరకు తిరిగి వచ్చేలా అతన్ని సమాధానంతో పంపించండి. అతడు సహోదరులతో పాటు వస్తాడని నేను ఎదురు చూస్తున్నాను.

12 మన సహోదరుడైన అపొల్లో విషయం ఏంటంటే, సహోదరులతో పాటు మీ దగ్గరకు వెళ్లమని అతన్ని నేను చాలా బ్రతిమాలాను. కాని ఇప్పుడే బయలుదేరడం అతనికి ఏమాత్రం ఇష్టం లేదు. అయితే సరియైన అవకాశం లభించినపుడు అతడు వస్తాడు.

13 మెలకువగా ఉండండి; విశ్వాసంలో నిలకడగా ఉండండి; ధైర్యం కలిగి బలవంతులై ఉండండి.

14 ప్రేమ పూర్వకంగా అన్ని పనులు చేయండి.

15 స్తెఫెను అతని ఇంటివారు అకాయలో మొదటిగా క్రీస్తును స్వీకరించారని మీకు తెలుసు. వారు పరిశుద్ధుల సేవకు తమను తాము అర్పించుకున్నారు. సహోదరీ సహోదరులారా, మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను,

16 అలాంటి వారికి, వారితో పాటు పని చేసి సేవ చేసేవారికి మీరు లోబడి ఉండండి.

17 స్తెఫెను, ఫొర్మూనాతు అకాయికు అనేవారు రావడం నాకు సంతోషం ఎందుకంటే మీరు లేని కొరత వారు నాకు తీర్చారు.

18 నా ఆత్మకు, మీ ఆత్మకు కూడా వారు నూతన ఉత్తేజం కలిగించారు. అలాంటివారు గౌరవించదగినవారు.


చివరి అభినందనలు

19 ఆసియా ప్రాంతంలోని సంఘాలు మీకు తమ అభినందనలు పంపుతున్నారు. అకుల, ప్రిస్కిల్ల అనేవారు, వారి ఇంట్లో సమావేశమయ్యే సంఘం మీకు ప్రభువులో హృదయపూర్వక అభినందనలు పంపుతున్నారు.

20 ఇక్కడి సహోదరీ సహోదరులందరు మీకు అభినందనలు పంపుతున్నారు. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరిని ఒకరు అభినందనలు తెలుపుకోండి.

21 పౌలు అనే నేను నా స్వహస్తంతో ఈ శుభములు వ్రాస్తున్నాను.

22 ప్రభువును ప్రేమించనివారు శపింపబడును గాక! ప్రభువా రండి!

23 ప్రభువైన యేసు కృప మీతో ఉండును గాక.

24 క్రీస్తు యేసులో మీ అందరికి నా ప్రేమను తెలియజేస్తున్నాను. ఆమేన్.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica® Open Telugu Contemporary Version™

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica, Inc.
Lean sinn:



Sanasan