Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

1 కొరింథీ 14 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం


ఆరాధనలో స్పష్టత

1 ప్రేమ చూపడానికి ప్రయాసపడండి, ఆత్మ వరాలను ఆసక్తితో కోరుకోండి. మరి ముఖ్యంగా ప్రవచన వరాన్ని ఆశించండి.

2 భాషల్లో మాట్లాడేవారు మానవులతో కాదు కాని దేవునితో మాట్లాడతారు. ఎవరూ వాటిని అర్థం చేసుకోలేరు; ఆత్మ ద్వారా వారు రహస్యాలను పలుకుతున్నారు.

3 అయితే ప్రవచించేవారు మానవులను బలపరచడానికి, ప్రోత్సాహం, ఆదరణ కలిగించడానికి వారితో మాట్లాడుతున్నారు.

4 భాషల్లో మాట్లాడేవారు తనకు తానే జ్ఞానాభివృద్ధి చేసుకుంటారు, కాని ప్రవచించేవారు సంఘానికి అభివృద్ధి కలుగజేస్తారు.

5 మీరందరు భాషల్లో మాట్లాడాలని నా కోరిక కాని, మీరు ప్రవచించాలని మరి ఎక్కువగా కోరుతున్నాను. భాషల్లో మాట్లాడేవారు తెలిపిన దానికి సంఘం అభివృద్ధి చెందేలా మరొకరు అర్థం చెప్తేనే తప్ప, భాషల్లో మాట్లాడేవారి కంటే ప్రవచించేవారే గొప్పవారు.

6 కాబట్టి సహోదరీ సహోదరులారా, నేను మీ దగ్గరకు వచ్చి సత్యాన్ని తెలియజేయడం గాని జ్ఞానం గాని ప్రవచనం గాని వాక్య బోధ గాని మీకు చెప్పకపోతే నేను వచ్చి భాషల్లో మాట్లాడడం వల్ల నా నుండి మీకు ఏ మంచి జరుగుతుంది?

7 వేణువు, వీణ వంటి జీవంలేని వాయిద్యాలను వాయించినప్పుడు వాటి స్వరాల్లో భేదం లేకపోతే ఏది ఏ వాయిద్యమో ఎలా తెలుసుకోగలరు?

8 అంతేకాక, బూర ఊదేవారు స్పష్టమైన ధ్వని చేయకపోతే యుద్ధానికి ఎవరు సిద్ధపడతారు?

9 అలాగే మీరు నాలుకతో స్పష్టమైన మాటలు మాట్లాడకపోతే మీరు ఏమి మాట్లాడుతున్నారో ఎవరైనా ఎలా తెలుసుకోగలరు? అప్పుడు మీరు కేవలం గాలిలో మాట్లాడినట్లు ఉంటుంది.

10 లోకంలో చాలా భాషలు ఉన్నాయి, అవన్నీ అర్థాన్ని కలిగి ఉన్నాయని అనడంలో సందేహం లేదు.

11 ఎవరైనా మాట్లాడినప్పుడు దాని అర్థాన్ని నేను గ్రహించలేకపోతే మాట్లాడేవారికి నేను, నాకు మాట్లాడేవారు పరాయివానిగా ఉంటాను.

12 ఆత్మ సంబంధమైన వరాలు పొందాలన్న ఆసక్తి మీలో ఉంది కాబట్టి సంఘాన్ని బలపరచడానికి వాటిని సమృద్ధిగా పొందే ప్రయత్నం చేయండి.

13 భాషలో మాట్లాడేవారు తాము మాట్లాడిన దానికి అర్థం చెప్పే శక్తి కోసం ప్రార్థించాలి.

14 ఎందుకంటే, నేను భాషలో ప్రార్థిస్తే, నా ఆత్మ కూడా ప్రార్థిస్తుంది కాని నా మనస్సు ఫలవంతంగా ఉండదు.

15 కాబట్టి నేను ఏమి చేయాలి? నా ఆత్మతో ప్రార్థిస్తాను, అయితే నా జ్ఞానంతో కూడ ప్రార్థిస్తాను. నా ఆత్మతో పాడతాను, నా మనసుతో కూడా పాడతాను.

16 లేకపోతే మీరు ఆత్మలో దేవునికి కృతజ్ఞత చెల్లిస్తే, మీరు చెప్పిన దాన్ని గ్రహించలేనివారు అక్కడ ఉంటే, మీరు ఏం చెప్పారో వారికి తెలియదు కాబట్టి మీ కృతజ్ఞతా స్తుతికి వారు “ఆమేన్” అని ఎలా చెప్తారు?

17 నీవు చక్కగానే దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నావు కాని దానివల్ల ఎవరికి జ్ఞానవృద్ధి కలుగదు.

18 మీ అందరికంటే నేను ఎక్కువగా భాషల్లో మాట్లాడుతున్నందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.

19 కాని, సంఘంలో అర్థం చేసుకోలేని భాషలో పదివేల మాటలు మాట్లాడడం కంటే, ఇతరులకు బోధించడానికి అర్థమైన అయిదు మాటలు నేను మాట్లాడితే మంచిది.

20 సహోదరీ సహోదరులారా, పసిబిడ్డల్లా ఆలోచించడం ఆపండి. చెడు విషయంలో పసివారిలా ఉండండి కాని ఆలోచించడంలో పెద్దవారిలా ఉండండి.

21 ధర్మశాస్త్రంలో ఇలా వ్రాయబడి ఉంది: “ఇతర భాషలతో పరదేశీయుల పెదాలతో నేను ఈ ప్రజలతో మాట్లాడతాను, కాని వారు నా మాట వినరు, అని ప్రభువు పలుకుతున్నాడు.”

22 కాబట్టి భాషలతో మాట్లాడడం అనేది విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే సూచన. అయితే ప్రవచించడం అవిశ్వాసులకు కాదు విశ్వాసులకే సూచన.

23 ఒకవేళ సంఘమంతా ఒకచోట చేరి అందరు భాషల్లో మాట్లాడుతున్నప్పుడు గ్రహించలేనివారు గాని అవిశ్వాసులు గాని లోపలికి వస్తే, మీరందరు పిచ్చివారిలా మాట్లాడుతున్నారని అనుకుంటారు కదా?

24 కాని, అందరు ప్రవచిస్తే అవిశ్వాసి కాని, తెలియనివారు కాని లోపలికి వస్తే తాము విన్నదానిని బట్టి వారు తాము పాపులమని గ్రహించి అందరిని బట్టి వారు తీర్పుపొందుతారు.

25 వారి హృదయ రహస్యాలు బయలుపరచబడతాయి. వారు సాగిలపడి దేవున్ని ఆరాధిస్తూ, “దేవుడు నిజంగా మీ మధ్యలో ఉన్నాడు!” అని అంగీకరిస్తారు.


ఆరాధనలో మంచి క్రమం

26 సహోదరీ సహోదరులారా, మేము ఇక ఏమి చెప్పాలి? మీరు సమావేశమైనప్పుడు, మీలో ఒకరు కీర్తన పాడాలని, ఒకరు బోధించాలని, ఒకరు దేవుడు బయలుపరచిన దాన్ని ప్రకటించాలని, ఒకరు భాషలతో మాట్లాడాలని, ఒకడు దానికి అర్థం చెప్పాలని తలస్తున్నారు. కాని ఇవన్నీ సంఘాన్ని బలపరచడానికి చేయండి.

27 భాషల్లో మాట్లాడాలనుకున్నవారు ఇద్దరు లేదా ముగ్గురు మాత్రమే ఒకరి తర్వాత ఒకరు మాట్లాడాలి. మరొకరు దాని అర్థాన్ని వివరించాలి.

28 అయితే అర్థాన్ని వివరించగలవారు ఎవరూ లేకపోతే, భాషలు మాట్లాడేవారు సంఘంలో మౌనంగా ఉండి, తనలో తాను దేవునితోను మాత్రమే మాట్లాడుకోవాలి.

29 ప్రవక్తల్లో ఇద్దరు లేదా ముగ్గురు మాత్రమే మాట్లాడాలి. ఇతరులు వారు చెప్పిన దానిని జాగ్రత్తగా వివేచించాలి.

30 సమావేశంలో కూర్చున్నవారిలో ఎవరైనా దేవుని నుండి ప్రత్యక్షతను పొందితే, మాట్లాడుతున్నవారు తన మాటలు ఆపివేయాలి.

31 ప్రతి ఒక్కరు నేర్చుకోవడానికి ప్రోత్సహించబడేలా మీరందరు ఒకరి తర్వాత ఒకరు ప్రవచించాలి.

32 ప్రవక్తల ఆత్మ ప్రవక్తలకు లోబడి ఉండాలి.

33 అలాగే పరిశుద్ధుల సంఘాలన్నిటిలో దేవుడు సమాధానాన్ని కలిగిస్తారే తప్ప అల్లరిని కాదు.

34 స్త్రీలు సంఘాల్లో మౌనంగా ఉండాలి. వారు మాట్లాడడానికి అనుమతి లేదు కాని ధర్మశాస్త్రంలో చెప్పబడినట్లుగా వారు వినయం కలిగి ఉండాలి.

35 వారు ఏదైనా తెలుసుకోవాలంటే ఇంటి దగ్గర తమ భర్తలను అడగాలి; సంఘంలో మాట్లాడడం స్త్రీకి అవమానకరం.

36 దేవుని వర్తమానం మీ నుండే మొదలైనదా? లేదా అది మీ దగ్గరకు మాత్రమే వచ్చిందా?

37 ఎవరైనా తాము దేవుని ప్రవక్తలమని లేదా ఆత్మ వరాలు గల వారమని తలిస్తే, నేను మీకు వ్రాసేది ప్రభువు ఆజ్ఞ అని వారు గ్రహించాలి.

38 కాని, ఎవరైనా దీన్ని నిర్లక్ష్యం చేస్తే, వారు నిర్లక్ష్యం చేయబడినవారిగానే ఉంటారు.

39 కాబట్టి నా సహోదరీ సహోదరులారా, ప్రవచించడాన్ని ఆసక్తితో కోరుకోండి, భాషలతో మాట్లాడడాన్ని ఆటంకపరచకండి.

40 అయితే సమస్తం మర్యాదగా క్రమంగా జరుగనివ్వండి.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica® Open Telugu Contemporary Version™

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica, Inc.
Lean sinn:



Sanasan