Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

1 కొరింథీ 13 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

1 మానవుల లేదా దేవదూతల భాషలు నేను మాట్లాడ కలిగినా, నాకు ప్రేమ లేకపోతే కేవలం మ్రోగే గంటలా గణగణ మ్రోగించే తాళంలా ఉంటాను.

2 నేను ప్రవచన వరాన్ని కలిగినా, అన్ని రహస్యాలను అర్థం చేసికోగలిగినా, సమస్త జ్ఞానం కలిగి ఉన్నా, పర్వతాలను కూడా కదిలించగల గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నా, నాలో ప్రేమ లేకపోతే నేను వ్యర్థమే.

3 నాకున్న సంపాదనంతా పేదలకు ఇచ్చివేసి, మెప్పు కోసం నా శరీరాన్ని కష్టానికి అప్పగించినా నాలో ప్రేమ లేకపోతే నాకు ప్రయోజనం ఏమి లేదు.

4 ప్రేమే సహనం, ప్రేమే దయ, అది అసూయ లేనిది, అది హెచ్చించుకోదు, గర్వం లేనిది.

5 అది ఇతరులను అగౌరపరచదు, స్వార్థం లేనిది, త్వరగా కోప్పడదు, తప్పులను జ్ఞాపకం ఉంచుకోదు.

6 ప్రేమ చెడుతనంలో ఆనందించదు కాని సత్యంలో ఆనందిస్తుంది.

7 అది అన్నిటిని కాపాడుతుంది, అన్నిటిని నమ్ముతుంది, అన్నిటిని నిరీక్షిస్తుంది, అన్నిటిని సహిస్తుంది.

8 ప్రేమ ఎప్పుడు విఫలం కాదు. అయితే ప్రవచనాలు ఆగిపోతాయి, భాషలైనా నిలిచిపోతాయి, జ్ఞానం గతించిపోతుంది.

9 ఎందుకంటే మనకు తెలిసింది కొంచెమే, మనం ప్రవచించేది కొంతవరకే.

10 కాని సంపూర్ణమయింది వచ్చినప్పుడు అసంపూర్ణమైనవి గతించిపోతాయి.

11 నేను చిన్నబిడ్డగా ఉన్నపుడు చిన్నబిడ్డగా మాట్లాడాను, చిన్నబిడ్డగా తలంచాను, చిన్నబిడ్డగా ఆలోచించాను, కాని నేను పెద్దవాన్ని అయినప్పుడు బాల్యపు పద్ధతులు వదిలేశాను.

12 ఇప్పుడు మనం చూస్తున్నది కేవలం అద్దంలో కనబడే ప్రతిబింబమే; కాని తర్వాత ముఖాముఖిగా చూస్తాము. ఇప్పుడు నాకు తెలిసింది కొంతమాత్రమే, తర్వాత నేను పూర్తిగా తెలుసుకోబడిన ప్రకారం నేను పూర్తిగా తెలుసుకుంటాను.

13 విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ అనే ఈ మూడు నిలిచి ఉంటాయి. వీటిలో శ్రేష్ఠమైనది ప్రేమే.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica® Open Telugu Contemporary Version™

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica, Inc.
Lean sinn:



Sanasan