1 దిన 26 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదంద్వారపాలకులు 1 ద్వారపాలకుల విభాగాలు: కోరహీయుల నుండి: ఆసాపు కుమారులలో ఒక్కడైన కోరే కుమారుడైన మెషెలెమ్యా. 2 మెషెలెమ్యాకు కుమారులు ఉన్నారు: జెకర్యా మొదటివాడు, యెదీయవేలు రెండవవాడు, జెబద్యా మూడవవాడు, యత్నీయేలు నాలుగవవాడు, 3 ఏలాము అయిదవవాడు, యెహోహనాను ఆరవవాడు, ఎల్యోయేనై ఏడవవాడు. 4 ఓబేద్-ఎదోముకు కూడా కుమారులు ఉన్నారు: షెమయా మొదటివాడు, యెహోజాబాదు రెండవవాడు, యోవాహు మూడవవాడు, శాకారు నాలుగవవాడు, నెతనేలు అయిదవవాడు, 5 అమ్మీయేలు ఆరవవాడు, ఇశ్శాఖారు ఏడవవాడు, పెయుల్లెతై ఎనిమిదవ వాడు. (దేవుడు ఓబేద్-ఎదోమును ఆశీర్వదించారు.) 6 ఓబేద్-ఎదోము కుమారుడైన షెమయాకు కూడా కుమారులు ఉన్నారు, వారు చాలా సమర్థులు కాబట్టి తమ తండ్రి కుటుంబంలో నాయకులుగా ఉన్నారు. 7 షెమయా కుమారులు: ఒత్ని, రెఫాయేలు, ఓబేదు, ఎల్జాబాదు; అతని బంధువులు ఎలీహు, సెమక్యాలు కూడా బలవంతులు. 8 వీరందరు ఓబేద్-ఎదోము వారసులు; వారు వారి కుమారులు వారి బంధువుల్లో పని చేయగల బలసామర్థ్యం గలవారు మొత్తం 62 మంది. 9 మెషెలెమ్యాకు కుమారులు, బంధువులు ఉన్నారు, వారిలో మొత్తం 18 మంది సమర్థులు. 10 మెరారీయుడైన హోసాకు కుమారులు ఉన్నారు: షిమ్రీ మొదటివాడు (అతడు మొదట పుట్టినవాడు కాకపోయినా, అతని తండ్రి అతన్ని మొదటివానిగా నియమించాడు), 11 హిల్కీయా రెండవవాడు, టెబల్యాహు మూడవవాడు, జెకర్యా నాలుగవవాడు, హోసా కుమారులు బంధువులు మొత్తం 13 మంది. 12 వారి నాయకులకు అనుగుణంగా, ఇలా ఏర్పాటైన ద్వారపాలకుల విభాగాలకు తమ బంధువులు చేసినట్లే యెహోవా మందిరంలో సేవ చేయడానికి బాధ్యతలు అప్పగించారు. 13 చిన్నవారికి పెద్దవారికి ఒకే విధంగా తమ కుటుంబాల ప్రకారం, ప్రతి ఒక్క ద్వారం దగ్గర కావలివారిగా ఉండడానికి చీట్లు వేశారు. 14 తూర్పు వైపు ద్వారం షెలెమ్యాకు వచ్చింది. తర్వాత తెలివిగల సలహాదారుడైన అతని కుమారుడైన జెకర్యాకు కూడా చీటి వేయగా అతనికి ఉత్తరం వైపు ద్వారం వచ్చింది. 15 ఓబేద్-ఎదోముకు దక్షిణం వైపు ద్వారం వచ్చింది, గిడ్డంగుల కాపలా అతని కుమారులకు వచ్చింది. 16 పడమటి వైపు ద్వారం, ఎత్తైన రహదారిలో ఉన్న షల్లెకెతు ద్వారం కాపలా షుప్పీముకు, హోసాకు వచ్చింది. వీరంతా ఒకరి ప్రక్కన ఒకరు ఉండి కాపలా కాసేవారు: 17 ప్రతిరోజు తూర్పున ఆరుగురు లేవీయులు, ఉత్తరాన నలుగురు, దక్షిణాన నలుగురు, గిడ్డంగి దగ్గర ఇద్దరిద్దరు ఉన్నారు. 18 పడమటి ఆవరణం విషయానికి వస్తే, దగ్గర ఉన్న రాజమార్గం దగ్గర నలుగురు, ఆవరణం దగ్గర ఇద్దరు ఉన్నారు. 19 కోరహు, మెరారి వారసులైన ద్వారపాలకుల విభాగాలు ఇవి. కోశాధికారులు ఇతర అధికారులు 20 అహీయా నాయకత్వంలో నడిపించబడిన ఇతర లేవీయులు, దేవుని మందిరంలోని ఖజానాలకు యెహోవాకు సమర్పించబడిన కానుకల ఖజానాలకు బాధ్యత వహించారు. 21 గెర్షోనీయుడైన లద్దానుకు చెందిన కుటుంబాల పెద్దలైన గెర్షోనీయుడైన లద్దాను వారసులు యెహీయేలీ, 22 యెహీయేలీ కుమారులు, జేతాము అతని సోదరుడైన యోవేలు. వీరికి యెహోవా ఆలయ ఖజానాల బాధ్యత అప్పగించబడింది. 23 అమ్రామీయులు, ఇస్హారీయులు, హెబ్రోనీయులు, ఉజ్జీయేలీయులు అనేవారి నుండి: 24 మోషే కుమారుడైన గెర్షోము వారసుడు షెబూయేలు ఖజానా మీద ప్రధానిగా నియమించబడ్డాడు. 25 ఎలీయెజెరు ద్వారా అతని బంధువులు: ఎలీయెజెరు కుమారుడైన రెహబ్యా, అతని కుమారుడైన యెషయా, అతని కుమారుడైన యోరాము, అతని కుమారుడైన జిఖ్రీ, అతని కుమారుడైన షెలోమీతు. 26 (రాజైన దావీదు, సహస్రాధిపతులు, శతాధిపతులు యైన కుటుంబ పెద్దలు ఇతర సైన్యాధిపతులు ప్రతిష్ఠించిన వస్తువులున్న ఖజానాలన్నిటి బాధ్యత షెలోమీతుకు, అతని బంధువులకు అప్పగించబడింది. 27 వారు యుద్ధంలో స్వాధీనం చేసుకున్న సొమ్ములో కొంత భాగాన్ని యెహోవా ఆలయ మరమత్తు కోసం ప్రతిష్ఠించారు. 28 దీర్ఘదర్శి సమూయేలు, కీషు కుమారుడైన సౌలు, నేరు కుమారుడైన అబ్నేరు, సెరూయా కుమారుడైన యోవాబు ప్రతిష్ఠించినవన్నీ, ఇతర ప్రతిష్ఠితమైన వస్తువులన్నీ షెలోమీతు అతని బంధువుల సంరక్షణలో ఉన్నాయి.) 29 ఇస్హారీయుల నుండి: కెనన్యా అతని కుమారులు మందిరపు బయటి పనులు చేయడానికి ఇశ్రాయేలీయులకు అధికారులుగా, న్యాయాధిపతులుగా నియమించబడ్డారు. 30 హెబ్రోనీయుల నుండి: హషబ్యా, అతని బంధువులు పదిహేడు వందల మంది సమర్థులైన వారికి యొర్దాను నదికి పడమర వైపున ఉన్న ఇశ్రాయేలు ప్రాంతంలో యెహోవాకు చేసే మొత్తం సేవ రాజుకు చేసే సేవ బాధ్యత అప్పగించబడింది. 31 హెబ్రోనీయులలో వారి కుటుంబ వంశావళుల ప్రకారం, యెరీయా వారికి ప్రధాన నాయకుడు. (దావీదు పరిపాలనలోని నలభైయవ సంవత్సరంలో వంశావళులను పరిశీలించినప్పుడు, గిలాదులోని యాజెరులో ఉన్న హెబ్రోనీయులలో పరాక్రమశాలులు ఉన్నారని తెలిసింది. 32 కుటుంబ పెద్దలుగా ఉన్న సమర్థులైన యెరీయా బంధువులు రెండువేల ఏడువందలమంది. రాజైన దావీదు వారిని దేవుని విషయాలన్నిటిలో, రాజ వ్యవహారాలలో రూబేనీయులమీద, గాదీయులమీద, మనష్షే అర్థగోత్రం వారిమీద నియమించాడు.) |
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica, Inc.