Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

1 దిన 22 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

1 తర్వాత దావీదు, “దేవుడైన యెహోవా మందిరం, ఇశ్రాయేలు కోసం దహనబలులు అర్పించే బలిపీఠం ఇక్కడ ఉండాలి” అని అన్నాడు.


దేవాలయం కోసం సన్నాహాలు

2 కాబట్టి దావీదు ఇశ్రాయేలు దేశంలో నివసిస్తున్న విదేశీయులను సమావేశపరచమని ఆజ్ఞాపించాడు. అతడు వారిలో కొందరిని దేవుని మందిరం కట్టించడానికి రాళ్లు చెక్కే పనికి నియమించాడు.

3 దావీదు ద్వారాల తలుపులకు కావలిసిన మేకులు, బందుల కోసం చాలా ఇనుమును తూయలేనంత ఇత్తడిని సమకూర్చాడు.

4 సీదోనీయులు, తూరీయులు దావీదుకు పెద్ద సంఖ్యలో దేవదారు మ్రానులను తీసుకురావడం వల్ల, వాటిని కూడా లెక్కపెట్టలేనంతగా సమకూర్చాడు.

5 దావీదు, “నా కుమారుడైన సొలొమోను చిన్నవాడు, అనుభవం లేనివాడు, యెహోవాకు కట్టవలసిన మందిరపు కీర్తి, వైభవం బట్టి అది అన్ని దేశాల్లో ప్రసిద్ధి చెందాలి. కాబట్టి దాని నిర్మాణానికి కావలసిన వాటిని నేను సిద్ధం చేస్తాను” అని చెప్పి దావీదు చనిపోవడానికి ముందే విస్తారంగా సామాగ్రిని సిద్ధం చేశాడు.

6 తర్వాత అతడు తన కుమారుడైన సొలొమోనును పిలిచి, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు మందిరం కట్టాలని అతన్ని ఆదేశించాడు.

7 దావీదు సొలొమోనుతో ఇలా అన్నాడు: “నా కుమారుడా, నా దేవుడైన యెహోవా నామం కోసం మందిరాన్ని కట్టించాలని నా హృదయంలో అనుకున్నాను.

8 అయితే యెహోవా మాట నాతో ఇలా చెప్పింది: ‘నీవు చాలా రక్తం చిందించి, చాలా యుద్ధాలు చేశావు. నా ఎదుట నీవు నేల మీద చాలా రక్తాన్ని చిందించావు, కాబట్టి నీవు నా పేరిట మందిరాన్ని కట్టించకూడదు.

9 అయితే నీకు ఒక కుమారుడు జన్మిస్తాడు, అతడు సమాధానం, విశ్రాంతి కలిగిన వ్యక్తిగా ఉంటాడు. అన్నివైపులా అతని శత్రువులందరి నుండి నేనతనికి విశ్రాంతిని ఇస్తాను. అతనికి సొలొమోను అనే పేరు పెడతారు. అతని కాలంలో ఇశ్రాయేలు ప్రజలకు సమాధానాన్ని, నెమ్మదిని ఇస్తాను.

10 అతడే నా పేరిట ఒక మందిరాన్ని కట్టిస్తాడు. అతడు నాకు కుమారుడై ఉంటాడు, నేనతనికి తండ్రినై ఉంటాను. ఇశ్రాయేలీయుల మీద అతని రాజ్యసింహాసనాన్ని శాశ్వతంగా స్థిరపరుస్తాను.’

11 “నా కుమారుడా, యెహోవా నీకు తోడుగా ఉంటారు, నీవు విజయం సాధించి, నీ దేవుడైన యెహోవా నీ గురించి చెప్పిన ప్రకారం నీవు ఆయనకు మందిరాన్ని కట్టిస్తావు.

12 నీ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రాన్ని నీవు అనుసరించేలా ఆయన నిన్ను ఇశ్రాయేలీయుల మీద పాలకునిగా నియమించినప్పుడు, యెహోవా నీకు వివేకాన్ని జ్ఞానాన్ని ఆయన ఇచ్చును గాక.

13 అప్పుడు ఇశ్రాయేలీయుల గురించి యెహోవా మోషేకు ఇచ్చిన నియమనిబంధనలను నీవు జాగ్రత్తగా పాటిస్తే, నీవు విజయం సాధిస్తావు. ధైర్యంగా దృఢంగా ఉండు. భయపడకు, నిరుత్సాహపడకు.

14 “యెహోవా మందిరం కట్టడానికి కావలసిన వాటిని సమకూర్చడం కోసం నేను చాలా శ్రమపడ్డాను. దాని కోసం లక్ష తలాంతుల బంగారాన్ని, పది లక్షల తలాంతుల వెండిని, తూయలేనంత ఇత్తడిని, ఇనుమును సమకూర్చాను. చెక్క, రాళ్లు కూడా సమకూర్చాను. నీవింకా వాటికి కలుపవచ్చు.

15 నీ దగ్గర చాలామంది నైపుణ్యం కలిగిన పనివారు అనగా శిల్పకారులు, తాపీ పనివారు, వడ్రంగులు, అన్ని రకాల పనులు చేసేవారు,

16 బంగారం, వెండి, ఇత్తడి, ఇనుములతో పని చేసే శిల్పకారులు సంఖ్యకు మించి ఉన్నారు. కాబట్టి ఇక పని మొదలుపెట్టు. యెహోవా నీకు తోడుగా ఉండును గాక!”

17 తర్వాత తన కుమారుడైన సొలొమోనుకు సహాయం చేయాలని దావీదు ఇశ్రాయేలీయుల నాయకులందరికి ఆదేశించాడు.

18 అతడు వారితో ఇలా అన్నాడు, “మీ దేవుడైన యెహోవా మీతో ఉన్నారు కదా? అన్నివైపులా ఆయన మీకు విశ్రాంతి ఇచ్చారు కదా? ముందున్న దేశవాసులను ఆయన నా చేతికి అప్పగించారు కాబట్టి ఇప్పుడు దేశం యెహోవాకు, ఆయన ప్రజలకు స్వాధీనం అయింది.

19 ఇప్పుడు మనసారా మీ దేవుడైన యెహోవాను వెదకండి. యెహోవా నిబంధన మందసాన్ని, దేవుని సంబంధమైన పవిత్ర వస్తువులను, ఆయన పేరున కట్టబడే మందిరంలోకి చేర్చేటట్టు మీరు దేవుడైన యెహోవా పరిశుద్ధాలయాన్ని కట్టడం మొదలుపెట్టండి.”

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica® Open Telugu Contemporary Version™

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica, Inc.
Lean sinn:



Sanasan