Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

1 దిన 20 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం


రబ్బాను పట్టుకొనుట

1 వసంతకాలంలో, రాజులు యుద్ధానికి బయలుదేరే కాలంలో, యోవాబు సైన్యాన్ని సమకూర్చుకున్నాడు. అతడు అమ్మోనీయుల దేశాన్ని నాశనం చేసి రబ్బా పట్టణాన్ని ముట్టడించాడు. అయితే దావీదు యెరూషలేములోనే ఉండిపోయాడు. యోవాబు రబ్బాపై దాడి చేసి దానిని నాశనం చేశాడు.

2 దావీదు వారి రాజు తలమీద నుండి కిరీటాన్ని తీసుకున్నాడు, అది ఒక తలాంతు బరువు కలిగి ఉండి, ప్రశస్తమైన రాళ్లతో పొదిగించబడి ఉంది. దాన్ని దావీదు తలమీద పెట్టుకున్నాడు. అతడు ఆ పట్టణం నుండి పెద్ద మొత్తంలో దోపుడుసొమ్ము తీసుకెళ్లాడు.

3 అక్కడి ప్రజలను బయటకు తీసుకువచ్చి రంపతో, పదునైన ఇనుప పనిముట్లతో, గొడ్డళ్ళతో కఠినమైన పని చేయించాడు. దావీదు అమ్మోనీయుల పట్టణాలన్నిటికి ఈ విధంగా చేశాడు. తర్వాత దావీదు అతని సైన్యమంతా యెరూషలేముకు తిరిగి వచ్చారు.


ఫిలిష్తీయులతో యుద్ధము

4 కొంతకాలం తర్వాత, గెజెరు దగ్గర ఫిలిష్తీయులతో యుద్ధం జరిగింది. ఆ సమయంలో హుషాతీయుడైన సిబ్బెకై, రెఫాయీయుల వారసుడైన సిప్పయి అనే వాన్ని చంపగా ఫిలిష్తీయులు లొంగిపోయారు.

5 ఫిలిష్తీయులతో జరిగిన మరో యుద్ధంలో యాయీరు కుమారుడు ఎల్హానాను, గిత్తీయుడైన గొల్యాతు సోదరుడైన లహ్మీని చంపాడు. అతని ఈటె నేతపనివాని అడ్డకర్రంత పెద్దది.

6 గాతు దగ్గర జరిగిన మరో యుద్ధంలో చాలా పొడవైన వాడొకడు ఉన్నాడు. అతని రెండు చేతులకు కాళ్లకు ఆరు వ్రేళ్ళ చొప్పున మొత్తం ఇరవైనాలుగు వ్రేళ్ళు ఉన్నాయి. అతడు కూడా రాఫా సంతతివాడు.

7 అతడు ఇశ్రాయేలీయులను దూషించినప్పుడు, దావీదు సోదరుడు, షిమ్యా కుమారుడైన యోనాతాను అతన్ని చంపాడు.

8 వీరు గాతుకు చెందిన రాఫా సంతతివారు, వీరు దావీదు అతని సైనికుల చేతిలో చనిపోయారు.

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica® Open Telugu Contemporary Version™

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Biblica, Inc.
Lean sinn:



Sanasan