1 దిన 18 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదందావీదు విజయాలు 1 కాలక్రమేణా దావీదు ఫిలిష్తీయులను ఓడించి లోబరచుకున్నాడు, వారి ఆధీనంలో నుండి గాతును, దాని చుట్టూ ఉన్న గ్రామాలను స్వాధీనం చేసుకున్నాడు. 2 దావీదు మోయాబీయులను కూడా ఓడించాడు, వారు లొంగిపోయి అతనికి కప్పం చెల్లించారు. 3 అంతేకాక, సోబా రాజైన హదదెజెరు యూఫ్రటీసు నది వరకు తన స్థూపాన్ని నిలబెట్టడానికి బయలుదేరినప్పుడు హమాతు పరిసరాల్లో దావీదు అతన్ని ఓడించాడు. 4 దావీదు అతని దగ్గర నుండి 1,000 రథాలను, 7,000 రథసారధులను, 20,000 మంది సైనికులను పట్టుకున్నాడు. వాటిలో వంద రథాలకు సరిపడా గుర్రాలను ఉంచుకుని మిగతా వాటికి చీలమండల నరాలు తెగగొట్టాడు. 5 సోబా రాజైన హదదెజెరుకు సహాయం చేయడానికి దమస్కులో ఉన్న అరామీయులు వచ్చినప్పుడు, దావీదు వారిలో 22,000 మందిని చంపాడు. 6 దమస్కులో ఉన్న అరామీయుల దేశంలో అతడు తన సైనిక దళాలను ఉంచగా అరామీయులు అతనికి దాసులై, అతనికి కప్పం చెల్లించారు. దావీదు ఎక్కడికి వెళ్లినా యెహోవా అతనికి విజయాన్ని ఇచ్చారు. 7 దావీదు హదదెజెరు సైన్యాధిపతులు ధరించిన బంగారు డాళ్లను తీసుకుని, వాటిని యెరూషలేముకు తెచ్చాడు. 8 హదదెజెరుకు చెందిన తెబా కూను అనే పట్టణాల నుండి దావీదు చాలా మొత్తంలో ఇత్తడిని స్వాధీనం చేసుకున్నాడు. ఆ ఇత్తడితో సొలొమోను ఇత్తడి నీళ్ల తొట్టెను, స్తంభాలను, ఇతర ఇత్తడి వస్తువులను చేయించాడు. 9 సోబా రాజైన హదదెజెరు సైన్యమంతటిని దావీదు ఓడించిన సంగతి హమాతు రాజైన తోయు విన్నప్పుడు, 10 అతడు తన కుమారుడైన హదోరామును రాజైన దావీదు దగ్గరకు అతని క్షేమం గురించి తెలుసుకుని అతనికి శుభాకాంక్షలు చెప్పడానికి పంపాడు, ఎందుకంటే హదదెజెరుకు తోయుకు మధ్య విరోధం ఉంది. హదోరాము బంగారం వెండి ఇత్తడితో చేసిన అన్ని రకాల వస్తువులను తెచ్చాడు. 11 రాజైన దావీదు ఈ వస్తువులను, ఎదోమీయులు, మోయాబీయులు, అమ్మోనీయులు, ఫిలిష్తీయులు, అమాలేకీయుల దేశాల నుండి స్వాధీనం చేసుకున్న వెండి బంగారాలను ప్రతిష్ఠించిన విధంగానే యెహోవాకు ప్రతిష్ఠించాడు. 12 సెరూయా కుమారుడైన అబీషై ఉప్పు లోయలో 18,000 మంది ఎదోమీయులను చంపాడు. 13 అతడు ఎదోము దేశంలో సైనిక దళాలను ఉంచాడు. ఎదోమీయులంతా దావీదుకు లొంగిపోయారు. దావీదు ఎక్కడికి వెళ్లినా యెహోవా అతనికి విజయమిచ్చారు. దావీదు అధికారులు 14 దావీదు ఇశ్రాయేలంతటిని పరిపాలిస్తూ తన ప్రజలందరికి న్యాయాన్ని ధర్మాన్ని జరిగించాడు. 15 సెరూయా కుమారుడైన యోవాబు సైన్యాధిపతి; అహీలూదు కుమారుడైన యెహోషాపాతు రాజ్య దస్తావేజుల మీద అధికారి; 16 అహీటూబు కుమారుడైన సాదోకు, అబ్యాతారు కుమారుడైన అహీమెలెకు యాజకులు; షవ్షా కార్యదర్శి; 17 యెహోయాదా కుమారుడైన బెనాయా కెరేతీయులకు, పెలేతీయులకు అధిపతి; దావీదు కుమారులు రాజు ప్రధాన అధికారులు. |
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica, Inc.