Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

మార్కు 12 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019


కౌలు దారుల వద్ద వసూలుకై వచ్చిన తోట యజమాని ఉపమానం
మత్తయి 21:33-46 ; లూకా 20:9-19 ; యెష 5:1-7

1 ఆ తరువాత ఆయన వారితో ఉదాహరణలతో మాట్లాడసాగాడు. “ఒకడు ద్రాక్షతోట వేసి చుట్టూ గోడ కట్టాడు. ద్రాక్షపళ్ళు తొక్కడానికి గానుగ తొట్టి కట్టించి, అక్కడే ఒక కావలి గోపురం కూడా కట్టించాడు. ఆ తరువాత ఆ ద్రాక్షతోటను రైతులకు కౌలుకిచ్చి ప్రయాణమై దూర దేశానికి వెళ్ళాడు.

2 పంటకాలం వచ్చినప్పుడు ఆ ద్రాక్షపండ్లలో తనకు రావలసిన భాగం తీసుకురమ్మని ఒక సేవకుణ్ణి వారి దగ్గరికి పంపాడు.

3 అయితే ఆ రైతులు ఆ సేవకుణ్ణి పట్టుకుని కొట్టి, వట్టి చేతులతో పంపివేశారు.

4 అతడు మళ్ళీ ఇంకొక సేవకుణ్ణి పంపాడు. వారు అతని తలపై గాయపరచి, అవమానించి పంపివేశారు.

5 అతడు ఇంకొక సేవకుణ్ణి కూడా పంపాడు. వారు అతణ్ణి చంపేశారు. అతడింకా చాలా మందిని పంపాడు. కాని, ఆ రైతులు వారిలో కొందరిని కొట్టి, ఇంకొందరిని చంపారు.

6 వారి దగ్గరికి పంపడానికి ఇక తన ప్రియ కుమారుడు ఒక్కడే మిగిలాడు. వారు తన కుమారుణ్ణి గౌరవిస్తారనుకుని చివరిగా అతడు తన కుమారుణ్ణి పంపాడు.

7 కాని ఆ కౌలుదారులు ‘ఇతడే వారసుడు! ఇతన్ని చంపుదాం. అప్పుడు వారసత్వం మనది అవుతుంది’ అని తమలో తాము మాట్లాడుకున్నారు.

8 వారు అతన్ని పట్టుకుని, చంపి ఆ ద్రాక్షతోట అవతల పారవేశారు.

9 అప్పుడు ఆ ద్రాక్షతోట యజమాని ఏం చేస్తాడు? వచ్చి ఆ రైతులను చంపి, ఆ ద్రాక్షతోటను ఇతరులకు కౌలుకిస్తాడు.

10 మీరు ఈ లేఖనం చదవలేదా? ‘ఇల్లు కట్టేవారు పనికి రాదని పారవేసిన రాయి తలరాయిగా మారింది.

11 అది ప్రభువు మూలంగా జరిగింది. ఇది మా దృష్టిలో అద్భుతంగా ఉంది.’”

12 ఈ ఉపమానం తమ గురించే చెప్పాడని వారు గ్రహించారు. కనుక ఆయనను బంధించాలని చూశారు కాని, ప్రజల గుంపును చూసి జంకారు. అందువల్ల ఆయనను వదిలి వెళ్ళిపోయారు.


పన్ను విషయం ప్రశ్న
మత్తయి 22:15-22 ; లూకా 20:19-26

13 యేసును ఆయన మాటల్లోనే పట్టుకోవాలని వారు పరిసయ్యుల, హేరోదీయుల అనుచరులు కొందరిని ఆయన దగ్గరికి పంపారు.

14 వారు వచ్చి ఇలా అన్నారు, “బోధకా! నీవు నిజం మాట్లాడేవాడివని మాకు తెలుసు. ఎవరినీ లెక్కచేయవని మాకు తెలుసు. నీవు మనుషులను పక్షపాతంతో చూడకుండా, సత్యమార్గాన్ని ఉన్నది ఉన్నట్టు బోధిస్తావు. సీజరు చక్రవర్తికి పన్నులు కట్టడం న్యాయమా కాదా?

15 మనం పన్నులు కట్టాలా? మానాలా?” అని అడిగారు. అయితే యేసుకు వారి కుయుక్తి తెలిసి వారితో, “నన్నెందుకు పరీక్షిస్తున్నారు? ఒక దేనారం తీసుకు రండి” అన్నాడు.

16 వారు ఒక నాణాన్ని తీసుకు వచ్చారు. “దీని మీద ఎవరి బొమ్మ ఉంది? ఎవరి శాసనం ఉంది?” అని ఆయన అడిగాడు. వారాయనతో, “సీజరుది” అన్నారు.

17 అప్పుడు యేసు వారితో, “సీజరుకు చెందింది సీజరుకు ఇవ్వండి, దేవునికి చెందింది దేవునికి ఇవ్వండి” అన్నాడు. ఆయన సమాధానం విని వాళ్ళు ఆశ్చర్యపోయారు.


సద్దూకయ్యులకు యేసు జవాబు
మత్తయి 22:23-33 ; లూకా 20:27-38

18 అప్పుడు చనిపోయిన వారు తిరిగి బతకరు అని బోధించే సద్దూకయ్యులు కొందరు ఆయన దగ్గరికి వచ్చి ఆయనకు ఒక ప్రశ్న వేశారు.

19 “బోధకా, ఒకడి సోదరుడు చనిపోతే, ఆ చనిపోయిన సోదరుని భార్యను అతడి సోదరుడు పెళ్ళి చేసుకుని, చనిపోయిన సోదరునికి సంతానం కలిగేలా చెయ్యాలని మోషే మనకోసం ధర్మశాస్త్రంలో రాశాడు.

20 ఏడుగురు అన్నదమ్ములున్నారు. మొదటి వాడు ఒక స్త్రీని పెళ్ళి చేసుకుని సంతానం లేకుండా చనిపోయాడు.

21 రెండవవాడు ఆమెను పెళ్ళిచేసుకున్నాడు. అతడు కూడా సంతానం లేకుండా చనిపోయాడు. మూడవ వాడికి కూడా అలాగే జరిగింది.

22 ఆ ఏడుగురూ ఆమెను పెళ్ళిచేసుకుని సంతానం లేకుండా చనిపోయారు. చివరికి ఆ స్త్రీ కూడా చనిపోయింది.

23 చనిపోయిన వారు తిరిగి బ్రతికినపుడు ఆమె ఎవరి భార్యగా ఉంటుంది? ఆమెను ఆ ఏడుగురూ పెళ్ళి చేసుకున్నారు కదా!” అని అడిగారు.

24 యేసు వారికి జవాబిస్తూ, “మీకు లేఖనాలు, దేవుని శక్తి తెలియవు గనుక పొరబడుతున్నారు.

25 చనిపోయిన వారు తిరిగి బ్రతికిన తరువాత వివాహం చేసుకోరు. వారు పరలోకంలో ఉన్న దేవదూతల్లా ఉంటారు.

26 ఇక చనిపోయిన వారు బ్రతకడం విషయమైతే, మోషే తాను రాసిన గ్రంథంలో ‘పొదను గురించిన భాగం’ రాసినప్పుడు దేవుడతనితో, ‘నేను అబ్రాహాముకు దేవుణ్ణి, ఇస్సాకుకు దేవుణ్ణి, యాకోబుకు దేవుణ్ణి’ అని అతనితో చెప్పాడు.

27 తాను వారికి దేవుణ్ణి అని అన్నప్పుడు ఆయన చనిపోయిన వారి దేవుడు కాదు, బ్రతికి ఉన్నవారికి మాత్రమే దేవుడు. మీరు చాలా పొరబడుతున్నారు” అన్నాడు.


గొప్ప ఆజ్ఞలు
మత్తయి 22:34-40 ; లూకా 10:25-37

28 ధర్మశాస్త్ర పండితుల్లో ఒకడు వచ్చి వారి వాదన విన్నాడు. యేసు చక్కని సమాధానం చెప్పాడని గ్రహించి, “ఆజ్ఞలన్నిటిలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది?” అని ఆయనను అడిగాడు.

29 అప్పుడు యేసు, “ఆజ్ఞలన్నిటిలో ముఖ్యమైనది ఇది, ‘ఇశ్రాయేలు ప్రజలారా వినండి, ప్రభువైన మన దేవుడు, ఆ ప్రభువు ఒక్కడే.

30 పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలంతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి.’ ఇది ప్రధాన ఆజ్ఞ.

31 రెండవది, ‘నిన్ను నీవెంతగా ప్రేమించుకుంటావో నీ పొరుగువాణ్ణి అంతగా ప్రేమించాలి.’ వీటికి మించిన ఆజ్ఞ మరొకటి లేదు” అని జవాబిచ్చాడు.

32 ఆ ధర్మశాస్త్ర పండితుడు, “అయ్యా, మీరు బాగా చెప్పారు. దేవుడొక్కడే అనీ, ఆయన తప్ప వేరే దేవుడు లేడనీ మీరు చెప్పింది నిజమే.

33 పూర్ణ హృదయంతో, పూర్ణ బుద్ధితో, పూర్ణ బలంతో ఆయనను ప్రేమించడం, మనలను ప్రేమించుకున్నట్టే మన పొరుగు వాణ్ణి ప్రేమించడం అన్ని హోమాల కన్నా, బలుల కన్నా ముఖ్యం” అన్నాడు.

34 అతడు వివేకంగా జవాబు చెప్పాడని యేసు గ్రహించి అతనితో, “నీవు దేవుని రాజ్యానికి దూరంగా లేవు” అన్నాడు. ఆ తరువాత ఆయనను ప్రశ్నలు అడగడానికి ఎవ్వరికీ ధైర్యం లేకపోయింది.


పరిసయ్యులకు యేసు ప్రశ్నలు
మత్తయి 22:41-46 ; లూకా 20:41-44

35 యేసు దేవాలయంలో ఉపదేశం చేస్తూ, “క్రీస్తు దావీదు కుమారుడని ధర్మశాస్త్ర పండితులు ఎలా అంటున్నారు?

36 దావీదు, తానే పరిశుద్ధాత్మ మూలంగా మాట్లాడుతూ, ‘ప్రభువు నా ప్రభువుతో పలికిన వాక్కు, నీ శత్రువులను నీ పాదాల కింద ఉంచే వరకూ నా కుడి పక్కన కూర్చో’ అన్నాడు.

37 దావీదు స్వయంగా ఆయనను ‘ప్రభువు’ అని పిలిచాడు కదా! అలాంటప్పుడు క్రీస్తు అతనికి కుమారుడు ఎలా అవుతాడు?” అన్నాడు. అక్కడున్న ప్రజలు ఎంతో సంతోషంతో ఆయన మాటలు విన్నారు.

38 ఆయన ఇంకా ఎన్నో విషయాలు బోధిస్తూ ఈ విధంగా అన్నాడు, “ధర్మశాస్త్ర పండితుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వారు పొడవాటి దుస్తులు ధరించి, సంత వీధుల్లో తిరుగుతూ ప్రజలు తమకు నమస్కరించాలని కోరుతూ,

39 సమాజ మందిరాల్లో అగ్రస్థానాలను, విందుల్లో గౌరవప్రదమైన స్థానాలను కోరుకుంటారు.

40 వారు విధవరాళ్ళ ఇళ్ళను దోచుకుంటూ పైకి మాత్రం నటనగా గంటల తరబడి ప్రార్థనలు చేస్తారు. అలాంటి వారిని దేవుడు తీవ్రంగా శిక్షిస్తాడు.”


వితంతువు వేసిన కానుక
లూకా 21:1-4

41 యేసు, దేవాలయంలో కానుకలు వేసే పెట్టెలో మనుషులు డబ్బు వేయడం గమనిస్తూ ఉన్నాడు. ధనవంతులు చాలా మంది పెద్ద మొత్తాలను ఆ పెట్టెలో వేశారు.

42 అప్పుడు ఒక పేద వితంతువు వచ్చి రెండు నాణాలు ఆ పెట్టెలో వేసింది.

43 ఆయన తన శిష్యులను దగ్గరికి పిలిచి, “నేను మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ పేద వితంతువు ఎక్కువ వేసింది.

44 మిగతావారు తాము దాచుకున్న ధనంలో కొంత మాత్రమే వేశారు కాని, ఈమె పేదదైనా తన దగ్గర ఉన్నదంతా వేసింది” అన్నాడు.

TEL-IRV

Creative Commons License

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.

Bridge Connectivity Solutions Pvt. Ltd.
Lean sinn:



Sanasan