యిర్మీయా 31 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 యెహోవా వాక్కు ఇదే. “ఆ కాలంలో నేను ఇశ్రాయేలు వంశం వారందరికీ దేవుడుగా ఉంటాను. వాళ్ళు నాకు ప్రజలుగా ఉంటారు.” 2 యెహోవా ఇలా అంటున్నాడు, “ఇశ్రాయేలును వధించడానికి వచ్చిన ఖడ్గం బారినుంచి తప్పించుకున్న ప్రజలకు అరణ్యంలో దయ దొరికింది. 3 గతంలో యెహోవా నాకు ప్రత్యక్షమై ఇలా అన్నాడు, ‘ఇశ్రాయేలూ, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించాను. కాబట్టి, నిబంధనా నమ్మకత్వంతో నేను నిన్ను ఆకర్షించుకున్నాను. 4 ఇశ్రాయేలు కన్యా, నువ్వు నిర్మాణం అయ్యేలా నేను నిన్ను మళ్ళీ కడతాను. నువ్వు మళ్ళీ తంబురలు వాయిస్తావు. సంతోష నాట్యాలతో బయటకు వెళ్తావు. 5 నువ్వు షోమ్రోను కొండల మీద ద్రాక్షావల్లులు మళ్ళీ నాటుతావు. రైతులు వ్యవసాయం చేసి వాటి ఫలాలు అనుభవిస్తారు. 6 ఎఫ్రాయిము పర్వతాల మీద కాపలావాళ్ళు మన దేవుడైన యెహోవా దగ్గరికి, సీయోనుకు ఎక్కి వెళ్దాం రండి’ అని ప్రకటించే రోజు ఒకటి రాబోతుంది.” 7 యెహోవా ఇలా అంటున్నాడు. “యాకోబునుబట్టి సంతోషంతో కేక పెట్టండి! రాజ్యాల్లో ప్రధానమైన జాతిని బట్టి ఉత్సాహధ్వని చెయ్యండి! స్తుతి వినిపించనివ్వండి. ‘యెహోవా ఇశ్రాయేలులో మిగిలిన తన ప్రజలను రక్షించాడు’ అని పలకండి. 8 చూడు, ఉత్తరదేశంలో నుంచి నేను వాళ్ళను తీసుకురాబోతున్నాను. గుడ్డివాళ్ళను, కుంటివాళ్ళను, గర్భిణులను, ప్రసవించడానికి సిద్ధంగా ఉన్న స్త్రీలను భూమి సుదూర ప్రాంతాలనుంచి అందరినీ సమకూరుస్తాను. మహా సమూహమై వారిక్కడికి తిరిగి వస్తారు. 9 వాళ్ళు ఏడుస్తూ వస్తారు. వాళ్ళు తమ విన్నపాలు చెప్తూ ఉండగా నేను వాళ్ళను నడిపిస్తాను. తిన్ననైన రహదారిలో, సెలయేళ్ల దగ్గరికి వాళ్ళను ప్రయాణం చేయిస్తాను. ఆ మార్గంలో వాళ్ళు తొట్రిల్లరు. ఎందుకంటే ఇశ్రాయేలుకు నేను తండ్రిగా ఉంటాను. ఎఫ్రాయిము నా జ్యేష్ఠసంతానంగా ఉంటాడు.” 10 ప్రజలారా, యెహోవా మాట వినండి. దూరంగా తీరం వెంబడి ఉన్న ప్రాంతాలకు నివేదిక అందించండి. “ఇశ్రాయేలును చెదరగొట్టినవాడు దాన్ని సమకూర్చి, గొర్రెల కాపరి తన మందను కాపాడేలా కాపాడుతున్నాడు” అని చెప్పండి. 11 ఎందుకంటే, మూల్యం చెల్లించి, తనకు మించిన బలం ఉన్న వాడి చేతిలోనుంచి యెహోవా యాకోబును విమోచించాడు. 12 వాళ్ళు వచ్చి సీయోను కొండ మీద ఉత్సాహధ్వని చేస్తారు. యెహోవా మంచితనాన్నిబట్టి, మొక్కజొన్నలను బట్టి, ద్రాక్షామధురసాన్నిబట్టి, తైలాన్ని బట్టి, గొర్రెలకూ, పశువులకూ పుట్టే పిల్లలను బట్టి, వాళ్ళు ఆనందిస్తారు. వాళ్ళ జీవితాలు నీళ్ళు పారే తోటలా ఉంటాయి. వాళ్ళు ఇంకెన్నడూ దుఃఖం అనుభవించరు. 13 అప్పుడు కన్యలు నాట్యమాడి ఆనందిస్తారు. యువకులూ వృద్ధులూ కలిసి ఉంటారు. “ఎందుకంటే, వాళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాను. వాళ్ళ మీద కనికరం చూపించి దుఃఖానికి బదులుగా వాళ్ళు ఆనందించేలా చేస్తాను. 14 సమృద్ధితో యాజకుల జీవితాలను నింపుతాను. నా ప్రజలు నా మంచితనంతో తమను తాము నింపుకుంటారు.” ఇదే యెహోవా వాక్కు. 15 యెహోవా ఇలా అంటున్నాడు. “రమాలో ఏడుపు, మహా రోదన స్వరం వినిపిస్తూ ఉంది. రాహేలు తన పిల్లల గురించి ఏడుస్తూ ఉంది. ఆమె పిల్లలు చనిపోయిన కారణంగా ఆదరణ పొందడానికి నిరాకరిస్తూ ఉంది.” 16 యెహోవా ఇలా అంటున్నాడు. “ఏడవకుండా నీ స్వరాన్ని, కన్నీళ్లు కార్చకుండా నీ కళ్ళను ఆపుకో, ఎందుకంటే నీ బాధలు ముగిసాయి. నీ పిల్లలు శత్రువు దేశంలోనుంచి తిరిగి వస్తారు,” ఇదే యెహోవా వాక్కు. 17 “భవిష్యత్తు కోసం నీకు ఒక ఆశ ఉంది. నీ సంతానం తిరిగి తమ సరిహద్దుల్లోకి వస్తారు,” ఇది యెహోవా వాక్కు. 18 “నేను కచ్చితంగా ఎఫ్రాయిము దుఃఖించడం విన్నాను, ‘నువ్వు నన్ను శిక్షించావు, నేను శిక్షకు లోనయ్యాను. కాడి మోసే శిక్షణలేని దూడలా ఉన్న నన్ను మళ్ళీ తీసుకురా, అప్పుడు నేను వస్తాను. నువ్వు నా దేవుడవైన యెహోవావు. 19 నేను నీ వైపు తిరిగిన తరువాత పశ్చాత్తాపం చెందాను. నేను కాడి మోసే శిక్షణ పొందిన తరువాత విచారంతో చాతిని చరుచుకున్నాను. నా చిన్నతనంలో కలిగిన నిందను భరించి నేను అవమానం పొంది సిగ్గుపడ్డాను.’ 20 ఎఫ్రాయిము నా విలువైన బిడ్డ కాదా? అతడు నాకు ప్రియమైన ముద్దు బిడ్డ కాదా? నేనతనికి విరోధంగా మాట్లాడిన ప్రతిసారీ అతన్ని నా ప్రేమపూర్వకమైన మనస్సుకు జ్ఞాపకం తెచ్చుకుంటాను. ఈ రకంగా అతనికోసం నా హృదయం తపిస్తూ ఉంది. కచ్చితంగా నేను అతనిమీద కనికరం చూపిస్తాను.” ఇది యెహోవా వాక్కు. 21 ఇశ్రాయేలు కుమారీ, రహదారిలో గుర్తులు పెట్టించుకో. దోవ చూపే స్థంభాలు పాతించుకో. నువ్వు వెళ్ళాల్సిన సరైన దారివైపు నీ మనస్సు నిలుపుకో. తిరిగి రా, నీ పట్టణాలకు తిరిగిరా. 22 నమ్మకద్రోహం చేసే అమ్మాయీ, నువ్వు ఎన్నాళ్లు ఇటు అటు తిరుగులాడుతావు? యెహోవా భూమి మీద కొత్త సృష్టి చేశాడు. బలవంతులైన పురుషులను సంరక్షించడానికి స్త్రీలు వారి చుట్టూ ఆవరిస్తున్నారు. 23 ఇశ్రాయేలు దేవుడూ, సేనల ప్రభువు అయిన యెహోవా ఇలా అంటున్నాడు, “ప్రజలను నేను తమ దేశానికి తిరిగి తీసుకొచ్చిన తరువాత, యూదా దేశంలో, దాని పట్టణాల్లో ప్రజలు ఇలా అంటారు, ‘పవిత్ర పర్వతమా, న్యాయశీలి నివసించే ప్రదేశమా, యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు గాక,’ 24 యూదా, అతని ఇతర పట్టాణాలన్నీ దానిపై సహజీవనం చేస్తారు. రైతులు, గొర్రెల కాపరులు తమ మందలతో సహా అక్కడ ఉంటారు. 25 ఎందుకంటే అలసినవాళ్ళు తాగడానికి నీళ్ళిస్తాను. దప్పికతో బాధపడుతున్న వాళ్ళందరి కడుపు నింపుతాను.” 26 అటు తరువాత నాకు మెలుకువ వచ్చి లేచాను, అప్పుడు, నా నిద్ర నాకు హాయిగా ఉన్నట్టు గమనించాను. 27 ఇది యెహోవా వాక్కు. “చూడు, ఇశ్రాయేలు గృహాల్లో, యూదా గృహాల్లో మనుషుల, మృగాల సంతానపు విత్తనాలు చల్లే రోజులు వస్తున్నాయి. 28 వాళ్ళను పెల్లగించడానికి, విరగగొట్టడానికి, పడద్రోయడానికి, నాశనం చెయ్యడానికి, హింసించడానికి, నేనెలా కనిపెట్టుకుని ఉన్నానో, అలాగే వాళ్ళను స్థాపించడానికి, నాటడానికి కనిపెట్టుకుని ఉంటాను.” ఇది యెహోవా వాక్కు. 29 “ఆ రోజుల్లో, ‘తండ్రులు ద్రాక్షపళ్ళు తిన్నప్పుడు పిల్లల పళ్లు పులిశాయి’ అన్న మాట ఇంక ఎవరూ అనరు. 30 ప్రతి వాడూ తన దోషం కారణంగానే చనిపోతాడు. ఎవడు ద్రాక్షపళ్ళు తింటాడో వాడి పళ్లే పులుస్తాయి. 31 చూడు, నేను ఇశ్రాయేలు వాళ్ళతో, యూదా వాళ్ళతో, ఒక కొత్త ఒప్పందం స్థిరం చేసే రోజులు వస్తున్నాయి,” ఇది యెహోవా వాక్కు. 32 “అది ఐగుప్తులోనుంచి నేను వాళ్ళ చెయ్యి పట్టుకుని బయటకు తీసుకొచ్చిన రోజుల్లో వాళ్ళ పితరులతో నేను చేసిన ఒప్పందం లాంటిది కాదు. నేను వాళ్ళకు ఒక భర్తగా ఉన్నా, ఆ రోజుల్లో వాళ్ళు ఆ ఒప్పందం ఉల్లంఘించారు.” ఇది యెహోవా వాక్కు. 33 “కానీ, ఈ రోజుల తరువాత నేను ఇశ్రాయేలు వాళ్ళతో, యూదా వాళ్ళతో స్థిరం చేసే ఒప్పందం ఇదే, వాళ్ళల్లో నా ధర్మశాస్త్రం ఉంచుతాను. వాళ్ళ హృదయం మీద దాన్ని రాస్తాను. నేను వాళ్లకు దేవుడుగా ఉంటాను, వాళ్ళు నాకు ప్రజలుగా ఉంటారు,” ఇది యెహోవా వాక్కు. 34 “అప్పుడు ప్రతివాడూ తన పొరుగువాడికి, తన సహోదరునికి బోధిస్తూ, ‘యెహోవాను తెలుసుకో!’ అని ఇక చెప్పడు. ఎందుకంటే, వాళ్ళల్లో చిన్నవాడి నుంచి పెద్దవాడి వరకు అందరూ నన్ను తెలుసుకుంటారు. నేను వాళ్ళ దోషాలు క్షమించి, వాళ్ళ పాపాలు ఇంక ఎన్నడూ మనసులో పెట్టుకోను.” ఇది యెహోవా వాక్కు. 35 యెహోవా ఇలా అంటున్నాడు, పగటి వెలుగు కోసం సూర్యుణ్ణి, రాత్రి వెలుగుకోసం చంద్ర నక్షత్రాలను నియమించేవాడు, దాని తరంగాలు ఘోషించేలా సముద్రాన్ని రేపే వాడైన యెహోవా ఆ మాట అంటున్నాడు, సేనల ప్రభువు అయిన యెహోవా అని ఆయనకు పేరు, 36 “ఈ శాశ్వతమైన సంగతులు నాకు కనుమరుగైపోయినప్పుడు మాత్రమే తప్ప, ఇశ్రాయేలు సంతతివాళ్ళు నా ఎదుట ఒక శాశ్వత రాజ్యంగా ఉండకుండా ఉండడం జరగదు.” ఇది యెహోవా వాక్కు. 37 యెహోవా ఇలా అంటున్నాడు. “పైనున్న ఆకాశ వైశాల్యం కొలవడం, కిందున్న భూమి పునాదులు కనుగొనడం సాధ్యం ఐతే తప్ప, ఇశ్రాయేలు సంతానం చేసిన వాటన్నిటిని బట్టి నేను వాళ్ళందరినీ తోసివేయడం జరగదు.” ఇది యెహోవా వాక్కు. 38 యెహోవా ఇలా అంటున్నాడు, “హనన్యేలు గోపురం మొదలుకుని మూలగుమ్మం వరకూ నా కోసం ఆ పట్టణం పునర్నిర్మాణం అయ్యే రోజులు వస్తున్నాయి. 39 అప్పుడు కొలత దారం దానికి ఎదురుగా ఉన్న గారేబు కొండ వరకూ వెళ్ళి గోయా వరకూ తిరిగి వస్తుంది. 40 శవాలు, బూడిద వేసే లోయ అంతా, కిద్రోను వాగు వరకూ, గుర్రాల గుమ్మం వరకూ, తూర్పువైపు ఉన్న పొలాలన్నీ యెహోవానైన నా కోసం ప్రతిష్ఠితం అవుతాయి. దాన్ని ఇంక ఎన్నడూ పెల్లగించడం, పడదోయడం జరగదు.” |
TEL-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Bridge Connectivity Solutions Pvt. Ltd.