Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

యిర్మీయా 2 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019


ఇశ్రాయేలు దేవుణ్ణి విడిచిపెట్టడం

1 యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు.

2 “యెరూషలేము నివాసులకు ఇలా ప్రకటించు. యెహోవా చెప్పేదేమిటంటే, నువ్వు అరణ్యంలో, పంటలు పండని ప్రాంతాల్లో నా వెంట నడుస్తూ నీ యవ్వనకాలంలో నీవు నాపై చూపిన నిబంధన నమ్మకత్వం, నీ వైవాహిక ప్రేమ, నేను గుర్తు చేసుకుంటున్నాను.

3 అప్పుడు ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠిత జనంగా, ఆయన పంటలో ప్రథమ ఫలంగా ఉంది. వారిని బాధించే వారందరూ శిక్షకు పాత్రులు. వారిపైకి కీడు దిగి వస్తుంది.” ఇదే యెహోవా వాక్కు.

4 యాకోబు సంతానమా, ఇశ్రాయేలు ప్రజలారా, మీరంతా యెహోవా మాట వినండి.

5 యెహోవా ఇలా సెలవిస్తున్నాడు. “నాలో ఏ తప్పిదం చూసి మీ పూర్వికులు నాకు దూరమై వ్యర్థమైన విగ్రహాలను పూజించి వారూ వ్యర్థులుగా మారిపోయారు?

6 ‘ఐగుప్తు దేశంలో నుండి మమ్మల్ని తెచ్చిన యెహోవా ఏడీ’ అని అడగలేదు. అంటే ‘అరణ్యంలో, చవిటి నేలలతో, గోతులతో నిండిన ప్రదేశంలో, అనావృష్టీ చీకటీ నిండిన, ఎవరూ తిరగని, నివసించని దేశంలో మమ్మల్ని నడిపించిన యెహోవా ఎక్కడ ఉన్నాడు?’ అని ప్రజలు అడగడం లేదు.

7 ఫలవంతమైన దేశంలోకి మిమ్మల్ని తీసుకువచ్చి దాని పంటను, దానిలోని శ్రేష్ఠమైన పదార్థాలను తినేలా చేశాను. అయితే మీరు నా దేశాన్ని అపవిత్రం చేసి నా వారసత్వాన్ని హేయపరిచారు.”

8 “యెహోవా ఎక్కడ ఉన్నాడు?” అని యాజకులు వెతకడం లేదు. ధర్మశాస్త్ర బోధకులకు నేనెవరో తెలియదు. ప్రజల నాయకులు నా మీద తిరుగుబాటు చేశారు. ప్రవక్తలు బయలు దేవుడి పేరట ప్రవచించి, వ్యర్ధమైన వాటిని అనుసరించారు.

9 కాబట్టి నేనికనుండి మీపైనా మీ పిల్లల పైనా వారి పిల్లల పైనా నేరం మోపుతాను. ఇది యెహోవా వాక్కు.

10 కిత్తీయుల ద్వీపాలకు వెళ్లి చూడండి, కేదారుకు దూతలను పంపి విచారించండి. మీలో జరుగుతున్న ప్రకారం ఇంకెక్కడైనా జరుగుతున్నదా?

11 దేవుళ్ళు కాని వారితో తమ దేవుళ్ళను ఏ ప్రజలైనా ఎప్పుడైనా మార్చుకున్నారా? కానీ నా ప్రజలు ప్రయోజనం లేని దాని కోసం తమ మహిమను మార్చుకున్నారు.

12 ఆకాశమా, దీని గురించి విస్మయం చెందు. భయపడి వణుకు. ఇదే యెహోవా వాక్కు.

13 నా ప్రజలు రెండు తప్పులు చేశారు. జీవజలాల ఊటనైన నన్ను విడిచి పెట్టేశారు. తమకోసం తొట్లు, అంటే నీటిని నిలపలేక బద్దలైపోయే తొట్లను తొలిపించుకున్నారు.

14 ఇశ్రాయేలు ఒక బానిసా? అతడు ఇంటిలో జన్మించిన వాడే కదా? మరెందుకు అతడు దోపుడు సొమ్ముగా మారాడు?

15 కొదమ సింహాలు అతనిపై గర్జించాయి, అతనిపై పెద్దగా అరుస్తూ అతని దేశాన్ని భయకంపితం చేశాయి. అతని పట్టణాలు ప్రజలు నివసించలేనంతగా నాశనం అయ్యాయి.

16 నోపు, తహపనేసు అనే పట్టణాల ప్రజలు నీకు బోడిగుండు చేసి నిన్ను బానిసగా చేసుకున్నారు.

17 నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపిస్తున్నప్పుడు నువ్వు ఆయన్ని విడిచి వేరైపోయి నీకు నీవే ఈ బాధ తెచ్చిపెట్టుకున్నావు గదా?

18 ఐగుప్తు దారిలో వెళ్లి షీహోరు నీళ్లు తాగడానికి నీకేం పని? అష్షూరు దారిలో వెళ్లి యూఫ్రటీసు నది నీళ్లు తాగడానికి నీకేం పని?

19 నీ చెడుతనం నీ శిక్షకు కారణమౌతుంది. నువ్వు చేసిన ద్రోహం నిన్ను దండిస్తుంది అని ప్రభువు, సేనల ప్రభువు అయిన యెహోవా సెలవిస్తున్నాడు. ఎందుకంటే నీ దేవుడైన యెహోవాను నీవు విడిచిపెట్టావు. నేనంటే నీకెంత మాత్రం భయం లేదు.

20 పూర్వకాలం నుండి ఉన్న నీ కాడిని విరగగొట్టి, నీ బంధకాలను తెంపివేశాను. అయినా “నేను నిన్ను పూజించను” అని చెబుతున్నావు. ఎత్తయిన ప్రతి కొండ మీదా పచ్చని ప్రతి చెట్టు కిందా వేశ్యలాగా వ్యభిచారం చేశావు.

21 శ్రేష్ఠమైన ద్రాక్షావల్లిగా నేను నిన్ను నాటాను. నిక్కచ్చి విత్తనం గల చెట్టులాగా నిన్ను నాటాను. అయినా నా పట్ల ఎందుకు నువ్వు పిచ్చి ద్రాక్షాతీగెలాగా నిష్ప్రయోజనం అయిపోయావు?

22 నువ్వు నదిలో కడుక్కున్నా, ఎక్కువ సబ్బు రాసుకున్నా నీ దోషం నాకు గొప్ప మరకలాగా కనిపిస్తున్నది. ఇది ప్రభువైన యెహోవా వాక్కు.

23 “నాలో అపవిత్రత లేదు, బయలు దేవుళ్ళ వెనక నేను వెళ్ళడం లేదు” అని నువ్వు ఎలా అనుకుంటున్నావు? లోయల్లో నీవెలా ప్రవర్తించావో చూడు. నువ్వు చేసిన దాన్ని గమనించు. నువ్వు విచ్చలవిడిగా తిరిగే ఒంటెవి.

24 అరణ్యానికి అలవాటు పడిన అడవి గాడిదవు. అది కామంతో దీర్ఘంగా శ్వాస తీసుకుంటుంది. మగ గాడిదను కలిసినప్పుడు దాన్ని ఆపగల వాడెవడు? దాని వెంటబడే గాడిదలకు అలుపు రాదు. తన జత కోసం వెదికే కాలంలో అది తేలికగా కనిపిస్తుంది.

25 నీ పాదాలకు చెప్పులు తొడుక్కుని జాగ్రత్త పడు, నీ గొంతు ఆరిపోకుండా జాగ్రత్తపడు, అని నేను చెప్పాను. కాని “నీ మాట వినను, కొత్తవారిని మోహించాను, వారి వెంట వెళ్తాను” అని చెబుతున్నావు.

26 దొంగ దొరికిపోయినప్పుడు సిగ్గుపడే విధంగా ఇశ్రాయేలు కుటుంబం సిగ్గుపడుతుంది. చెట్టుతో “నువ్వు మా తండ్రివి” అనీ, రాయితో “నువ్వే నన్ను పుట్టించావు” అనీ చెబుతూ, ఇశ్రాయేలు ప్రజలు, వారి రాజులు, అధిపతులు, యాజకులు, ప్రవక్తలు అవమానం పొందుతారు.

27 వారు నా వైపు నేరుగా చూడకుండా తమ వీపు తిప్పుకున్నారు. అయినా ఆపద సమయంలో మాత్రం, “వచ్చి మమ్మల్ని రక్షించు” అని నన్ను వేడుకుంటారు.

28 నీ కోసం చేసుకున్న దేవుళ్ళు ఎక్కడ ఉన్నారు? నీ ఆపదలో వాళ్ళు వచ్చి నిన్ను రక్షిస్తారేమో. యూదా, నీ పట్టణాలెన్ని ఉన్నాయో నీ దేవతా విగ్రహాలు కూడా అన్ని ఉన్నాయి కదా.

29 మీరంతా నా మీద తిరగబడి పాపం చేశారు. ఇంకా ఎందుకు నాతో వాదిస్తారు? అని యెహోవా అడుగుతున్నాడు.

30 నేను మీ ప్రజలను శిక్షించడం వ్యర్థమే. ఎందుకంటే వారు శిక్షకు లోబడరు. నాశనవాంఛ గల సింహంలాగా మీ ఖడ్గం మీ ప్రవక్తలను చంపుతూ ఉంది.

31 ఇప్పటి తరం ప్రజలు యెహోవా చెప్పే మాట వినండి, నేను ఇశ్రాయేలుకు ఒక అరణ్యం లాగా అయ్యానా? గాఢాంధకారంతో నిండిన దేశంలా అయ్యానా? “మాకు స్వేచ్ఛ లభించింది, ఇంక నీ దగ్గరికి రాము” అని నా ప్రజలెందుకు చెబుతున్నారు?

32 ఒక కన్య తన ఆభరణాలు మర్చిపోతుందా? పెళ్ళికూతురు తన మేలిముసుగులు మర్చిపోతుందా? అయితే నా ప్రజలు లెక్కలేనన్ని దినాలు నన్ను మర్చిపోయారు.

33 కామం తీర్చుకోడానికి నీవెంత తెలివిగా నటిస్తున్నావు? కులటలకు కూడా నువ్వు ఇలాటివి నేర్పించగలవు.

34 నిర్దోషులైన దీనుల ప్రాణరక్తం నీ బట్ట చెంగుల మీద కనబడుతూ ఉంది. వారేమీ నిన్ను దోచుకోడానికి వచ్చినవారు కాదు.

35 ఇంతా చేసినా నువ్వు “నేను నిర్దోషిని, యెహోవా కోపం నా మీదికి రాదులే” అని చెప్పుకుంటున్నావు. ఇదిగో చూడు, “నేను పాపం చేయలేదు” అని నువ్వు చెప్పిన దాన్నిబట్టి నిన్ను శిక్షిస్తాను.

36 నీ ప్రవర్తనలో మార్పును అంత తేలికగా ఎలా తీసుకోగలుగుతున్నావు? నువ్వు అష్షూరుపై ఆధారపడి సిగ్గుపడినట్టు ఐగుప్తు విషయంలో కూడా సిగ్గుపడతావు.

37 ఆ జనం దగ్గర నుండి నిరాశతో చేతులు తలపై పెట్టుకుని తిరిగి వెళ్తావు. నువ్వు నమ్ముకున్న వారిని యెహోవా తోసిపుచ్చాడు. వారు నీకు ఏ విధంగానూ సహాయం చేయలేరు.

TEL-IRV

Creative Commons License

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.

Bridge Connectivity Solutions Pvt. Ltd.
Lean sinn:



Sanasan