నిర్గమ 12 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019మొదటి పస్కా 1 మోషే అహరోనులతో ఐగుప్తు దేశంలో యెహోవా ఇలా చెప్పాడు. 2 “నెలల్లో ఈ నెల మీకు మొదటిది. ఇది మీ సంవత్సరానికి మొదటి నెలన్న మాట. 3 ఇశ్రాయేలు సమాజంతో ఇలా చెప్పు. మీరు ఇశ్రాయేలు ప్రజల సమాజమంతటితో కలసి ఈ నెల పదవ రోజున తమ కుటుంబాల ప్రకారం ప్రతి ఒక్కడూ, అంటే ప్రతి ఇంటి లెక్క చొప్పున ఒక గొర్రెపిల్లను గానీ, మేకపిల్లను గానీ తీసుకోవాలి. 4 ఒక కుటుంబం ఆ గొర్రెపిల్లను తినడానికి చిన్నదైతే ఆ కుటుంబ పెద్ద ఒక గొర్రె పిల్ల, లేక మేక పిల్ల సరిగ్గా సరిపోయే విధంగా తన పొరుగింటి కుటుంబ సభ్యులను కలుపుకుని ఆ ప్రకారం వారిని లెక్కగట్టాలి. 5 మీరు ఎన్నుకొనే గొర్రె లేదా మేక పిల్ల ఒక సంవత్సరం వయసు గల మగదై ఉండాలి. అది ఎలాంటి లోపం లేకుండా ఉండాలి. 6 ఈ నెల 14 వ రోజు వరకూ దాన్ని ఉంచాలి. తరువాత ఇశ్రాయేలు ప్రజలంతా సాయంకాల సమయంలో దాన్ని చంపాలి. 7 కొంచెం రక్తం తీసుకుని ఆ మాంసం ఏ ఇంట్లో తింటారో ఈ ఇంటి గుమ్మం రెండు నిలువు కమ్ముల మీద, పై కమ్మీ మీద చల్లాలి. 8 ఆ రాత్రివేళ నిప్పులతో మాంసాన్ని కాల్చి తినాలి. పొంగకుండా చేసిన రొట్టెలతో, చేదు కూరలతో కలిపి దాన్ని తినాలి. 9 దాన్ని పచ్చిగా గానీ ఉడికించిగానీ తినకూడదు. దాని తల, కాళ్ళు, లోపలి భాగాలను నిప్పుతో కాల్చి తినాలి. 10 తెల్లవారే పాటికి దానిలో ఏమీ మిగల్చకూడదు. ఒకవేళ ఏమైనా మిగిలితే దాన్ని పూర్తిగా కాల్చివెయ్యాలి. 11 మీరు దాన్ని తినవలసిన విధానం ఇది. మీ నడుముకు నడికట్టు కట్టుకుని, కాళ్ళకు చెప్పులు వేసుకుని, మీ కర్రలు చేతబట్టుకుని త్వరత్వరగా తినాలి. ఎందుకంటే అది యెహోవాకు పస్కా బలి. 12 నేను ఆ రాత్రి వేళ ఐగుప్తు దేశమంతా తిరుగుతూ ఆ దేశంలోని మనుషుల్లో, జంతువుల్లో మొదటి సంతానం మొత్తాన్ని చంపివేస్తాను. ఐగుప్తు దేవుళ్ళ విషయంలో తీర్పు తీరుస్తాను. నేను యెహోవాను. 13 మీరు నివసించే ఇళ్ళపై ఉన్న ఆ రక్తం యెహోవా రాక విషయంలో మీకు ఆనవాలుగా ఉంటుంది. నేను ఐగుప్తు జాతి మొదటి సంతానాన్ని నాశనం చేస్తూ ఉన్న సమయంలో ఆ రక్తాన్ని చూసి మిమ్మల్ని చంపకుండా దాటి వెళ్ళిపోతాను. ఈ విపత్తు మీ మీదికి వచ్చి మిమ్మల్ని నాశనం చేయదు. పొంగని రొట్టెల పండగ 14 కాబట్టి ఈ రోజు మీకు స్మారక దినంగా ఉంటుంది. ఈ రోజును యెహోవా పండగ దినంగా తరతరాలుగా మీరు ఆచరించాలి. ఎందుకంటే ఇది యెహోవా నియమించిన శాశ్వతమైన కట్టుబాటు. 15 ఏడు రోజులపాటు మీరు పొంగకుండా కాల్చిన రొట్టెలు తినాలి. మొదటి రోజున మీ ఇళ్ళలో పొంగ జేసే పదార్ధమంటూ ఏదీ లేకుండా చెయ్యాలి. మొదటి రోజు నుంచి ఏడవ రోజు వరకూ పొంగ జేసే పిండితో చేసిన రొట్టెలు తింటే ఆ వ్యక్తిని ఇశ్రాయేలు ప్రజల్లో లేకుండా చేయాలి. 16 ఆ మొదటి రోజు మీరు నా కోసం పరిశుద్ధ సమాజంగా సమకూడాలి. ఏడవ రోజున అలాటి సమావేశమే జరగాలి. ఆ రెండు రోజుల్లో అందరూ తినడానికి భోజనం సిద్ధం చేసుకోవడం తప్ప ఏ పనీ చేయకూడదు. మీరు చేయగలిగిన పని అదొక్కటే. 17 ఈ పొంగని రొట్టెల పండగను మీరు ఆచరించాలి. ఎందుకంటే నేను మిమ్మల్నందరినీ ఐగుప్తు దేశం నుండి బయటకు తీసుకు వచ్చే రోజు అదే. కాబట్టి మీరు, మీ రాబోయే తరాలన్నీ ఈ రోజును ఆచరించాలి. ఇది మీకు శాశ్వతమైన కట్టుబాటుగా ఉంటుంది. 18 మొదటి నెల 14 వ రోజు సాయంత్రం మొదలు అదే నెల 21 వ రోజు సాయంత్రం దాకా మీరు పొంగని పిండితో చేసిన రొట్టెలు తినాలి. 19 ఏడు రోజులపాటు మీ ఇళ్ళలో పొంగజేసే పదార్ధమేదీ కనబడ కూడదు. పొంగజేసే పదార్ధంతో చేసిన దాన్ని మీలో ఎవరైనా తింటే అతడు విదేశీయుడైనా దేశంలో పుట్టిన వాడైనా ఇశ్రాయేలు ప్రజల సమాజంలో లేకుండా చేయాలి. 20 మీరు పొంగజేసే పదార్థంతో చేసిన దేనినీ తినకూడదు. మీకు చెందిన అన్ని ఇళ్ళలో పొంగకుండా కాల్చిన రొట్టెలు మాత్రమే తినాలి.” మొదటి పస్కా పండగ ఆచరణ 21 అప్పుడు మోషే ఇశ్రాయేలు ప్రజల పెద్దలను పిలిపించాడు. వాళ్ళతో ఇలా చెప్పాడు. “మీరు మీ కుటుంబాల కోసం మందలోనుండి మేకపిల్లను గానీ గొర్రెపిల్లను గానీ తీసుకుని పస్కా బలి అర్పించండి. 22 తరువాత హిస్సోపు కుంచె తీసుకుని పళ్ళెంలో ఉన్న రక్తంలో దాన్ని ముంచి, గుమ్మాల పైకమ్మికీ రెండు నిలువు కమ్ములకూ పూయాలి. మీలో ఎవ్వరూ తెల్లవారే వరకూ మీ ఇళ్ళ గుమ్మాల గుండా బయటకు వెళ్ళకండి. 23 యెహోవా ఐగుప్తీయులను హతమార్చడానికి తిరుగుతూ ఇంటి గుమ్మం పైకమ్మి మీదా రెండు నిలువు కమ్ముల మీదా ఉన్న రక్తాన్ని చూసి ఆ ఇంటిని దాటిపోతాడు. సంహారం చేసే దూతను మీ ఇళ్ళలోకి ప్రవేశించడానికి మిమ్మల్ని సంహరించడానికి ఆయన అనుమతి ఇయ్యడు. 24 అందుచేత మీరు దీన్ని ఆచరించాలి. ఇది మీకు, మీ సంతతికి శాశ్వతమైన చట్టంగా ఉంటుంది. 25 యెహోవా వాగ్దానం చేసినట్టు ఆయన మీకు ఇస్తున్న దేశంలో ప్రవేశించిన తరువాత మీరు దీన్ని ఒక ఆచార క్రియగా పాటించాలి. 26 మీ కొడుకులు ‘మీరు జరిగిస్తున్న ఈ ఆచారం ఎందుకోసం?’ అని మిమ్మల్ని అడిగితే, 27 ‘ఇది యెహోవాకు పస్కా బలి. ఆయన ఐగుప్తీయులను సంహరించే సమయంలో వారి మధ్య నుండి ఇశ్రాయేలు ప్రజల ఇళ్ళను దాటి ఐగుప్తులో మనల్ని కాపాడాడు’ అని చెప్పాలి” అన్నాడు. అప్పుడు సమకూడిన ప్రజలంతా అది విని తమ తలలు వంచి దేవుణ్ణి ఆరాధించారు. 28 అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు విధేయులై యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్టు చేశారు. పదవ తెగులు-ఐగుప్తు వారి ప్రథమ సంతానం మరణం 29 ఆ అర్థరాత్రి సమయంలో ఏం జరిగిందంటే, ఐగుప్తు దేశంలో ఉన్న మొదటి సంతానమంతటినీ యెహోవా హతమార్చాడు. సింహాసనం మీద కూర్చున్న రాజు మొదలుకుని, చెరసాలలోని ఖైదీల వరకూ వాళ్ళకు పుట్టిన మొదటి పిల్లలు మరణించారు. పశువుల తొలిచూలు పిల్లలు చనిపోయాయి. 30 ఆ రాత్రి గడిచిన తరువాత మరణం సంభవించని ఇల్లు ఒక్కటి కూడా లేదు. ఐగుప్తు దేశంలో తీవ్రమైన మరణ రోదన చెలరేగింది. 31 ఫరో మోషే అహరోనులను పిలిపించాడు. వాళ్ళతో “మీరూ ఇశ్రాయేలు ప్రజలూ త్వరగా నా దేశం నుండి, నా ప్రజల మధ్యనుండి వెళ్ళిపొండి. మీరు కోరుకున్నట్టు వెళ్లి యెహోవాను ఆరాధించండి. 32 మీ ఇష్టప్రకారం మీ మందలనూ పశువులనూ తోలుకు వెళ్ళండి. నన్ను దీవించండి కూడా” అన్నాడు. 33 ఐగుప్తీయులు మేము కూడా చనిపోతాం అనుకుని ఆత్రంగా ఇశ్రాయేల్ ప్రజను తమ దేశం నుండి వెళ్ళిపొమ్మని తొందర పెట్టారు. ఇశ్రాయేలీయుల నిర్గమనం-రామెసేసునుండి సుక్కోతుకు 34 ఇశ్రాయేలు ప్రజలు పొంగజేసే పదార్థం కలపని తమ పిండి ముద్దలు, పిండి పిసికే గిన్నెలు మూటగట్టుకుని భుజాలపై మోసుకు పోయారు. 35 అంతకుముందు ఇశ్రాయేలు ప్రజలు మోషే చెప్పిన మాట ప్రకారం ఐగుప్తీయుల దగ్గర నుండి వెండి, బంగారం నగలు, దుస్తులు అడిగి తీసుకున్నారు. 36 ఐగుప్తీయులకు ఇశ్రాయేలు ప్రజల పట్ల యెహోవా జాలి గుణం కలిగించడం వల్ల వారు ఇశ్రాయేలు ప్రజలు అడిగినవన్నీ ఇచ్చారు. ఆ విధంగా వారు ఐగుప్తీయులను దోచుకున్నారు. 37 తరువాత ఇశ్రాయేలు ప్రజలు రామెసేసు నుండి సుక్కోతు వరకూ ప్రయాణం సాగించారు. వారిలో పిల్లలు కాక, కాలి నడకన బయలుదేరిన పురుషులు ఆరు లక్షల మంది. 38 అంతేకాక వేరువేరు జాతుల మనుషులు చాలా మంది వారితో వచ్చారు. గొర్రెలు, ఎద్దులు మొదలైన పశువులతో కూడిన గొప్ప మందలు కూడా వాళ్ళతో కలసి బయలుదేరాయి. 39 తరువాత వాళ్ళు ఐగుప్తు నుండి తెచ్చిన పిండి ముద్దలతో పొంగని రొట్టెలు కాల్చారు. ఆ పిండి ముద్ద పులియలేదు. వాళ్ళు ఐగుప్తునుండి బయలు దేరే ముందు సమయం లేకపోవడం వల్ల తమ కోసం వేరే ఆహారం సిద్ధం చేసుకోలేక పోయారు. 40 ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలం 430 సంవత్సరాలు. 41 ఆ 430 సంవత్సరాలు ముగిసిన రోజునే యెహోవా సేనలన్నీ ఐగుప్తు దేశం నుండి తరలి వెళ్లాయి. 42 ఆయన ఐగుప్తు దేశం నుండి వారిని బయటికి రప్పించిన ఆ రాత్రి యెహోవా కోసం కేటాయించి ఇశ్రాయేలు ప్రజలంతా తరతరాలకూ ఆ రాత్రి యెహోవా కోసం జాగారం చెయ్యాలి. పస్కా గురించిన ఆదేశాలు 43 తరువాత యెహోవా మోషే అహరోనులతో ఇలా అన్నాడు. “ఇది పస్కా పండగను గూర్చిన నియమం. వేరే జాతికి చెందిన వాడెవడూ దాన్ని తినకూడదు. 44 మీలో ఎవరైనా డబ్బిచ్చి కొనుక్కున్న దాసుడు సున్నతి పొందితే అలాంటి వాడు దాన్ని తినవచ్చు. 45 వేరే దేశాలకు చెందిన వాళ్ళు, కూలి పనికి వచ్చిన సేవకులు దాన్ని తినకూడదు. 46 ఏ ఇంట్లో వారు ఆ ఇంట్లో మాత్రమే దాన్ని తినాలి. దాని మాంసంలో కొంచెం కూడా ఇంట్లో నుండి బయటికి తీసుకు వెళ్ళకూడదు. వధించిన జంతువులోని ఒక్క ఎముకను కూడా మీరు విరగ్గొట్టకూడదు. 47 ఇశ్రాయేలు ప్రజల సమాజం అంతా పండగ ఆచరించాలి. 48 మీ దగ్గర నివసించే ఎవరైనా విదేశీయులు యెహోవా పస్కాను ఆచరించాలని కోరుకుంటే వాళ్ళ కుటుంబంలోని ప్రతి మగవాడూ సున్నతి పొందాలి. అప్పుడు వాళ్ళు సమాజంతో కలసి పస్కా ఆచరింపవచ్చు. వాళ్ళు మీ దేశంలో పుట్టిన వాళ్ళతో సమానం అవుతారు. సున్నతి పొందనివాడు దాన్ని తినకూడదు. 49 స్వదేశీయుడికీ మీతో కలసి నివసించే విదేశీయుడికీ ఈ విషయంలో ఒకే నియమం ఉండాలి.” 50 యెహోవా మోషే అహరోనులకు ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం ఇశ్రాయేలు ప్రజలందరూ చేశారు. 51 ఆ రోజే యెహోవా ఇశ్రాయేలు ప్రజలను వారి వారి సేనల క్రమం ప్రకారం ఐగుప్తు దేశం నుండి బయటకు నడిపించాడు. |
TEL-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Bridge Connectivity Solutions Pvt. Ltd.