ద్వితీ 32 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 ఆకాశమా! నేను చెప్పేది విను! నన్ను మాట్లాడనియ్యి. భూగోళమా, నా నోటి మాటలు ఆలకించు. 2 నా ఉపదేశం వానలా కురుస్తుంది. నా మాటలు మంచు బిందువుల్లా, లేతగడ్డిపై పడే చినుకుల్లా, పచ్చికపై కురిసే చిరుజల్లులా, మొక్కలపై కురిసే జల్లులా ఉంటాయి. 3 నేను యెహోవా పేరును ప్రకటిస్తాను. మన దేవునికి ఘనత ఆపాదించండి. 4 ఆయన మనకు ఆశ్రయ దుర్గం. ఆయన పని పరిపూర్ణం. ఆయన మార్గాలన్నీ న్యాయమైనవి. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన పక్షపాతం చూపని దేవుడు. ఆయన న్యాయవంతుడు, యథార్థవంతుడు. 5 వారు తమను తాము చెడగొట్టుకున్నారు. వారు ఆయన సంతానం కారు. వారు దోషులు, మూర్ఖులైన వక్రతరం. 6 బుద్ధి, ఇంగితం లేని మనుషులారా, యెహోవాకు ఇదా మీరిచ్చే కానుక? ఆయన మీ తండ్రి కాడా? ఆయనే గదా మిమ్మల్ని పుట్టించి స్థిరపరచింది? 7 గతించిన కాలాన్ని గుర్తుకు తెచ్చుకోండి. తరతరాల సంవత్సరాల సంగతులను తలపోయండి. మీ తండ్రిని అడుగు, అతడు నీకు చూపిస్తాడు. పెద్దలను అడుగు, వాళ్ళు నీకు చెబుతారు. 8 మహోన్నతుడు ప్రజలకు వారి వారి వారసత్వాలను పంచి ఇచ్చినప్పుడు, మానవ జాతులను వేరు పరచినపుడు, ఇశ్రాయేలు ప్రజల లెక్క ప్రకారం ప్రజలకు హద్దులు నియమించాడు. 9 యెహోవా వంతు ఆయన ప్రజలే. ఆయన వారసత్వం యాకోబు సంతానమే. 10 ఆయన ఆ ప్రజను ఎడారి ప్రదేశంలో కనుగొన్నాడు. బీడు భూమిలో, భీకరమైన శబ్దాలు ఉన్న నిర్జన ప్రదేశంలో అతణ్ణి రక్షించి ఆదుకున్నాడు. తన కనుపాపలా అతణ్ణి కాపాడాడు. 11 గద్ద తన గూడు రేపి తన పిల్లలపై ఎగురుతూ రెక్కలు చాపుకుని ఆ పిల్లలను రెక్కల మీద మోసినట్టు యెహోవా చేశాడు. 12 యెహోవా ఒక్కడే ఆ ప్రజలకు దారి చూపుతున్నాడు. వేరే దేవుళ్ళెవరూ ఆయనకు సాటిరారు. 13 లోకంలో ఉన్నత స్థలాలపై ఆ ప్రజలను ఎక్కించాడు. పొలాల పంటలు వారికి తినిపించాడు. కొండబండల తేనెతో, చెకుముకి రాతిబండ నూనెతో వారిని తృప్తిపరిచాడు. 14 ఆవు మజ్జిగను, గొర్రెల, మేకల పాలనూ, గొర్రెపిల్లల కొవ్వునూ, బాషాను పొట్టేళ్లను, మేకపోతులనూ, శ్రేష్ఠమైన గోదుమ పిండినీ మీకిచ్చాడు. మంచి ద్రాక్షరసంతో చేసిన మద్యం మీరు తాగారు. 15 యెషూరూను కొవ్వి కాలు దువ్వాడు, మీరు కొవ్వుతో బలిసి మొద్దులాగా అయ్యారు. యెషూరూను తనను పుట్టించిన దేవుణ్ణి వదిలేశాడు. తన రక్షణ శిలను నిరాకరించాడు. 16 వారు ఇతర దేవుళ్ళను అనుసరించి ఆయనకు రోషం పుట్టించారు. అసహ్యమైన విగ్రహాలు పెట్టుకుని ఆయనకు కోపం తెప్పించారు. 17 వారు దేవత్వం లేని దయ్యాలకు బలులు అర్పించారు. తమకు తెలియని దేవుళ్ళకూ, కొత్తగా పుట్టుకొచ్చిన దేవుళ్ళకూ, మీ పితరులు భయపడని దేవుళ్ళకూ బలులర్పించారు. 18 నీకు తండ్రి లాంటి బండను వదిలేశావు, నిన్ను కన్న దేవుణ్ణి మరిచావు. 19 యెహోవా దీన్ని చూసి వాళ్ళని వదిలేశాడు, తన కొడుకులూ కూతుర్లూ ఆయన్నలా రేపారు. 20 ఆయనిలా అన్నాడు. “వారికి నా ముఖాన్ని దాచు కుంటాను. వాళ్ళ అంతం ఎలా ఉంటుందో చూస్తాను. వాళ్ళు మొండి తరం, విశ్వసనీయత లేని పిల్లలు. 21 దేవుడు కాని దానితో వాళ్ళు నాకు రోషం తెప్పించారు. తమ పనికిమాలిన విగ్రహాలతో నాకు కోపం తెప్పించారు. ప్రజలు కాని వారిని చూసి వారు అసూయ పడేలా చేస్తాను. తెలివిలేని రాజ్యాన్ని చూసి వారికి కోపం వచ్చేలా చేస్తాను. 22 నా కోపాగ్ని రగులుకుంది. పాతాళ అగాధం వరకూ అది మండుతుంది. భూమినీ దాని పంటనూ అది కాల్చేస్తుంది. పర్వతాల పునాదులను రగులబెడుతుంది. 23 వారిపై విపత్తుల సమూహం తెప్పిస్తాను. వారి మీదికి నా బాణాలు వదులుతాను. 24 వారు కరువుతో అల్లాడతారు. ఒళ్ళు కాలే మంటతో, పెను నాశనంతో క్షీణిస్తారు. దుమ్ములో పాకే వాటి విషాన్నీ అడివి జంతువుల కోరలనూ వారిమీదికి రప్పిస్తాను. 25 బయట కత్తి చావు తెస్తుంది. పడక గదుల్లో భయం పీడిస్తుంది. యువకులూ, కన్యలూ, పసికందులూ, నెరిసిన వెంట్రుకలున్నవారూ నాశనం అవుతారు. 26 వాళ్ళను చాలా దూరం విసిరేస్తాను. వాళ్ళ జ్ఞాపకాలు మానవ జాతిలో లేకుండా తుడిచేస్తాను. 27 కానీ అలా ఎందుకు చెయ్యలేదంటే, వాళ్ళ విరోధులు రెచ్చిపోతారేమో, వాళ్ళ విరోధులు అపార్థం చేసుకుని, ‘పైచెయ్యి మనదే, ఇది చేసింది యెహోవా కాదు’ అంటారేమో.” 28 ఇశ్రాయేలు తెలివిలేని ప్రజ. వాళ్ళలో వివేకమే లేదు. 29 వారికి జ్ఞానముంటే, దీన్ని వాళ్ళు అర్థం చేసుకుంటే, వాళ్లకు రాబోయే ఆపద గమనించుకుంటే, 30 వారి ఆశ్రయదుర్గం వారిని అమ్మి వేయకపోతే, యెహోవా వారిపై మనకు విజయాన్నివ్వకపోతే, ఒకడు వేయి మందిని ఎలా తరుముతాడు? పదివేల మందిని ఇద్దరు ఎలా పారదోలతారు? 31 మన శత్రువుల బండ మన ఆశ్రయదుర్గం లాంటిది కాదు. మన శత్రువులే దీనికి సాక్షులు. 32 వారి ద్రాక్షచెట్టు సొదొమ ద్రాక్ష చెట్టు నుంచి వచ్చింది. అది గొమొర్రా పొలాల్లోనిది. వారి ద్రాక్షపళ్ళు విషపు ద్రాక్షపళ్ళు. వాటి గెలలు చేదు. 33 వారి ద్రాక్షారసం పాము విషం. నాగుపాముల క్రూర విషం. 34 ఇది నా రహస్య ఆలోచన కాదా? నా ఖజానాల్లో భద్రంగా లేదా? 35 వారి కాలు జారే కాలంలో పగ తీర్చే పని నాదే. ప్రతిఫలమిచ్చేది నేనే. వారి ఆపద్దినం దగ్గర పడింది. వారి అంతం త్వరగా వస్తుంది. 36 బానిస గానీ, స్వతంత్రుడు గానీ, మరెవరూ మిగలకపోతే, వారికి ఆధారం లేనప్పుడు చూసి, తన సేవకులకు జాలి చూపిస్తాడు, తన ప్రజలకు యెహోవా నిర్ణయం చేస్తాడు. 37 అప్పుడాయన వారి దేవుళ్ళు ఎక్కడ? వాళ్ళు నమ్ముకున్న బండ ఏది? 38 వారికి ఆధారం లేనప్పుడు చూసి, వారి నైవేద్యాల కొవ్వు తిని, వారి పానీయార్పణ ద్రాక్షారసాన్ని తాగిన వారి దేవుళ్ళు ఎక్కడ? వారు లేచి మీకు సాయపడనివ్వండి. వారినే మిమ్మల్ని కాపాడనివ్వండి. 39 చూడండి. నేనే, నేను మాత్రమే దేవుణ్ణి. నేను తప్ప మరో దేవుడు లేడు. చంపేది నేనే, బతికించేది నేనే. దెబ్బ కొట్టేది నేనే, బాగు చేసేది నేనే. నా చేతిలో నుంచి విడిపించేవాడెవడూ లేడు. 40 ఆకాశం వైపు నా చెయ్యెత్తి నేనెప్పటికీ జీవిస్తున్నట్టుగా పని చేస్తాను. 41 నేను తళతళలాడే నా కత్తి నూరి, నా చెయ్యి న్యాయం తీర్చడం మొదలెడితే, నా శత్రువులకు ప్రతీకారం చేస్తాను. నన్ను ద్వేషించే వారికి ప్రతిఫలమిస్తాను. 42 నా బాణాలు రక్తంతో మత్తెక్కి పోయేలా చేస్తాను. నా కత్తి, మాంసం భక్షిస్తుంది! చచ్చిన వారి రక్తాన్నీ, బందీల రక్తాన్నీ, శత్రువు అధికారులనూ అవి తింటాయి. 43 ఇతర రాజ్యాల ప్రజలారా, దేవుని ప్రజలతో ఆనందించండి. వధకు గురి అయిన తన సేవకుల రక్తానికి ఆయన పగ తీరుస్తాడు. తన విరోధులకు ప్రతీకారం చేస్తాడు. తన దేశం కోసం, తన ప్రజల కోసం ప్రాయశ్చిత్తం చేస్తాడు. 44 మోషే, నూను కొడుకు యెహోషువ ఈ పాటలోని పదాలన్నీ ప్రజలకు పాడి వినిపించారు. 45 మోషే ఈ పాట ఇశ్రాయేలు ప్రజల కోసం పాడి ముగించాడు. 46 తరువాత అతడు వారితో ఇలా చెప్పాడు, దీనికి మీరే సాక్ష్యం. ఈ రోజు నేను పలికిన మాటలన్నీ మీ మనస్సుల్లో నింపుకుని, ఈ ధర్మశాస్త్ర ప్రమాణాలన్నీ అనుసరించి నడుచుకోవాలని మీ సంతానానికి ఆజ్ఞాపించాలి. 47 ఇవి మీకు నిష్ఫలమైన మాటలు కావు, ఇవి మీకు జీవదాయకమైనవి. మీరు యొర్దాను దాటి స్వాధీనం చేసుకోబోతున్న దేశంలో దీన్ని బట్టి మీరు దీర్ఘాయుష్మంతులవుతారు. 48 అదే రోజు యెహోవా మోషేతో ఇలా చెప్పాడు, యెరికో ఎదుట ఉన్న మోయాబు దేశంలోని అబారీం అనే ఈ పర్వతం, 49 అంటే నెబో కొండ ఎక్కు. నేను ఇశ్రాయేలీయులకు వారసత్వంగా ఇస్తున్న కనాను దేశాన్ని నువ్వు చూస్తావు. 50 నీ సోదరుడు అహరోను, హోరు కొండ మీద చనిపోయి తమ పితరుల దగ్గరికి చేరినట్టు, నువ్వు ఎక్కబోతున్న కొండ మీద చనిపోయి, నీ పితరుల దగ్గరికి వెళ్తావు. 51 ఎందుకంటే, మీరు సీను ఎడారిలో కాదేషు మెరీబా నీళ్ల దగ్గర ఇశ్రాయేలు ప్రజల మధ్య నన్ను ఘనపరచక ఇశ్రాయేలు ప్రజల మధ్య నా మీద తిరుగుబాటు చేశారు. 52 నువ్వు ఆ దేశాన్ని దూరం నుంచి చూస్తావు. నేను ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తున్న ఆ దేశంలో నువ్వు అడుగుపెట్టవు. |
TEL-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Bridge Connectivity Solutions Pvt. Ltd.