Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

అపొస్తలుల 26 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019


అగ్రిప్ప ఎదుట పౌలు

1 అగ్రిప్ప పౌలుతో, “నీ వాదన వినిపించడానికి నీకు అనుమతి నిచ్చాను” అన్నాడు. అప్పుడు పౌలు తాను మాట్లాడబోతున్నట్టు సూచిస్తూ చెయ్యి చాచి ఈ విధంగా జవాబు చెప్పాడు.

2 “అగ్రిప్ప రాజా, మీరు యూదుల ఆచారాలనూ వివాదాలనూ బాగా ఎరిగిన వారు.

3 యూదులు నామీద ఆరోపించిన నేరాలను గూర్చి ఈ రోజు మీ ముందు జవాబు చెప్పుకోవడం నా అదృష్టం అని నేను భావిస్తున్నాను. దయచేసి ఓపికతో నా మనవి వినండి.

4 మొదట నా ప్రజల మధ్య తరువాత యెరూషలేములో బాల్యం నుండి నేను గడిపిన జీవితం ఎలాటిదో యూదులందరికీ తెలుసు.

5 వారు మొదటినుండీ నన్ను ఎరిగినవారు కాబట్టి వారు నా గురించి చెప్పాలంటే నేను మన మతంలోని బహునిష్ఠగల తెగను అనుసరించి, పరిసయ్యుడిగా జీవించినట్టు చెప్పగలరు.

6 అయితే ఇప్పుడు దేవుడు మన పూర్వీకులకు చేసిన వాగ్దాన సంబంధమైన నిరీక్షణను బట్టి నన్నిక్కడ విమర్శకు గురి చేస్తూ నిలబెట్టారు.

7 మన పన్నెండు గోత్రాల ప్రజలు రాత్రింబగళ్ళు దేవుణ్ణి సేవిస్తూ ఆ వాగ్దానం నెరవేర్పు కోసం ఎదురు చూస్తున్నారు. రాజా, ఈ నిరీక్షణ గురించే యూదులు నాపై నేరం మోపారు.

8 దేవుడు మృతులను లేపుతాడన్న సంగతి నమ్మశక్యం కానిదని మీరెందుకు భావిస్తున్నారు?

9 నజరేయుడైన యేసు అనే పేరుకి విరోధంగా అనేక కార్యాలు చేయాలని నేను అనుకొన్నాను.

10 యెరూషలేములో నేనలాగే చేశాను. ప్రధాన యాజకుల వలన అధికారం పొంది, అనేకమంది పవిత్రులను చెరసాలల్లో వేశాను. వారిని చంపినప్పుడు సమ్మతించాను.

11 చాలాసార్లు సమాజ మందిరాల్లో వారిని దండించి వారు దేవదూషణ చేసేలా బలవంతపెట్టాను. అంతేగాక వారిమీద తీవ్రమైన కోపంతో ఇతర పట్టణాలకు సైతం వెళ్ళి వారిని హింసించాను.

12 “అందుకోసం నేను ప్రధాన యాజకుల చేత అధికారాన్నీ ఆజ్ఞలనూ పొంది దమస్కు పట్టణానికి వెళుతున్నపుడు

13 రాజా, మధ్యాహ్నం నా చుట్టూ, నాతో కూడ వచ్చినవారి చుట్టూ ఆకాశం నుండి సూర్య తేజస్సుకంటే ఎక్కువ దేదీప్యమానమైన ఒక వెలుగు ప్రకాశించడం చూశాను.

14 మేమందరమూ నేల మీద పడినప్పుడు, ‘సౌలూ, సౌలూ, నన్నెందుకు హింసిస్తున్నావు? మునికోలలకు ఎదురు తన్నడం నీకు కష్టం’ అని హెబ్రీ భాషలో ఒక స్వరం నాతో పలకడం విన్నాను.

15 అప్పుడు నేను ‘ప్రభూ, నీవు ఎవరివి?’ అని అడిగినపుడు ప్రభువు, ‘నీవు హింసిస్తున్న యేసుని.

16 నీవు నన్ను చూసిన సంగతిని గురించీ, నీకు ఇకముందు వెల్లడి కాబోయే సంగతులను గురించీ నిన్ను నా పరిచారకునిగా, సాక్షిగా నియమించడానికే నీకు ప్రత్యక్షమయ్యాను. నీవు లేచి నిలబడు,

17-18 నేను ఈ ప్రజల వల్లా యూదేతరుల వల్లా నీకు హాని కలగకుండా కాపాడతాను. వారు చీకటి నుండి వెలుగులోకీ సాతాను అధికారం నుండి దేవుని వైపుకూ తిరిగి, నాపై విశ్వాసముంచడం ద్వారా పాప క్షమాపణనూ, పరిశుద్ధుల్లో వారసత్వాన్నీ పొందడం కోసం వారి కళ్ళు తెరవడానికి నేను నిన్ను వారి దగ్గరికి పంపిస్తాను’ అని చెప్పాడు.

19 “కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనానికి నేను లోబడి

20 మొదట దమస్కులో, యెరూషలేములో, యూదయ దేశమంతటా, ఆ తరువాత యూదేతరులకూ, వారు మారుమనస్సు పొంది దేవుని వైపు తిరిగి మారుమనస్సుకు తగిన క్రియలు చేయాలని ప్రకటిస్తున్నాను.

21 ఈ కారణంగానే యూదులు నన్ను దేవాలయంలో పట్టుకుని చంపడానికి ప్రయత్నం చేశారు.

22-23 అయినప్పటికీ నేను దేవుని సహాయం వలన ఈ రోజు వరకూ నిలిచి ఉన్నాను. క్రీస్తు హింసలు పొంది మృతుల పునరుత్థానం పొందేవారిలో మొదటివాడు కావడంచేత, యూదులకూ యూదేతరులకూ వెలుగు ప్రసరిస్తుందని ప్రవక్తలు, మోషే, ముందుగా చెప్పిన దానికి మరేమీ కలపకుండా, అల్పులకూ ఘనులకూ సాక్ష్యమిస్తున్నాను.”

24 అతడు ఈ విధంగా సమాధానం చెబుతుండగా ఫేస్తు, “పౌలూ, నీవు వెర్రివాడివి, మితిమీరిన విద్య వలన నీకు పిచ్చి పట్టింది” అని గట్టిగా అరిచాడు.

25 అందుకు పౌలు ఇలా అన్నాడు, “మహా ఘనులైన ఫేస్తూ, నేను వెర్రివాణ్ణి కాదు. సత్యం, వివేకం గల మాటలే చెబుతున్నాను.

26 రాజుకు ఈ సంగతులు తెలుసు కాబట్టి వారి ముందు నేను ధైర్యంగా మాట్లాడుతున్నాను. వాటిలో ప్రతి ఒక్క విషయమూ వారికి తెలుసు అని రూఢిగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఇది ఏదో ఒక మూలన జరిగిన విషయం కాదు.

27 అగ్రిప్ప రాజా, మీరు ప్రవక్తలను నమ్ముతున్నారా? నమ్ముతున్నారని నాకు తెలుసు.” అన్నాడు.

28 అందుకు అగ్రిప్ప, “ఇంత తేలికగా నన్ను క్రైస్తవుడుగా మార్చాలని చూస్తున్నావే” అని పౌలుతో అన్నాడు.

29 అందుకు పౌలు, “తేలికగానో కష్టంగానో, మీరు మాత్రమే కాదు, ఈ రోజు నా మాట వింటున్న వారంతా ఈ సంకెళ్ళు తప్ప నాలాగానే ఉండేలా దేవుడు అనుగ్రహిస్తాడు గాక” అన్నాడు.

30 అప్పుడు రాజు, ఫేస్తూ, బెర్నీకే, వారితో కూడ కూర్చున్నవారు లేచి అవతలకు పోయి

31 “ఈ వ్యక్తి మరణానికి గాని, బంధకాలకు గాని తగిన నేరమేమీ చేయలేదు” అని తమలో తాము మాట్లాడుకున్నారు.

32 అప్పుడు అగ్రిప్ప, “ఈ మనిషి సీజరు ముందు చెప్పుకొంటానని అనకపోయి ఉంటే ఇతణ్ణి విడుదల చేసేవాళ్ళమే” అని ఫేస్తుతో చెప్పాడు.

TEL-IRV

Creative Commons License

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.

Bridge Connectivity Solutions Pvt. Ltd.
Lean sinn:



Sanasan