Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

1 కొరింథీ 4 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019


క్రీస్తు సేవకుల తీర్పు మానవమాత్రుల చేతుల్లో లేదు

1 కాబట్టి ప్రతి ఒక్కరూ మమ్మల్ని క్రీస్తు సేవకులమనీ, దేవుని మర్మాల విషయంలో నిర్వాహకులమనీ పరిగణించాలి.

2 నిర్వాహకుల్లో ప్రతి ఒక్కడూ నమ్మకంగా ఉండడం చాలా అవసరం.

3 మీరు గానీ, ఇతరులు గానీ నాకు తీర్పు తీర్చడమనేది నాకు చాలా చిన్న విషయం. నన్ను నేనే తీర్పు తీర్చుకోను.

4 నాలో నాకు ఏ దోషమూ కనిపించదు. అంత మాత్రం చేత నేను నీతిమంతుడిని అని కాదు. అయితే, ప్రభువే నాకు తీర్పు తీర్చేవాడు.

5 కాబట్టి ఆ కాలం రాకముందే, అంటే ప్రభువు వచ్చేంత వరకూ, దేనిని గూర్చీ తీర్పు తీర్చవద్దు. ఆయన చీకటిలో ఉన్న రహస్యాలను వెలుగులోకి తెచ్చి మనుషుల అంతరంగంలో ఉన్న ఉద్దేశ్యాలను బట్టబయలు చేస్తాడు. అప్పుడు ప్రతి ఒక్కరికీ తగిన ప్రశంస దేవుని నుండి కలుగుతుంది.

6 సోదరీ సోదరులారా, “రాసి ఉన్నవాటిని మించి వెళ్లవద్దు” అనే మాట అర్థం మీరు గ్రహించాలని ఈ మాటలు మీ మేలు కోసం నాకూ అపొల్లోకూ ఆపాదించుకుని ఉదాహరణగా చెప్పాను. మీరు ఒకరి మీద ఒకరు విర్రవీగ కూడదని ఈ విధంగా వివరించాను.

7 ఎందుకంటే నీకొక్కడికే ఉన్న గొప్పతనం ఏమిటి? నీకు ఉన్నదానిలో నువ్వు ఉచితంగా పొందనిది ఏమిటి? ఇతరుల నుండి పొంది కూడా అది నీ సొంతమే అన్నట్టు గొప్పలు చెప్పుకోవడమెందుకు?

8 ఇప్పటికే మీకు అవసరమైనవన్నీ మీరు సంపాదించుకున్నారంటనే! ఇప్పటికే ధనవంతులయ్యారంటనే! మా ప్రమేయం లేకుండానే మీరు రాజులైపోయారంటనే! అయినా, మీరు రాజులు కావడం మంచిదేగా, మేము కూడా మీతో కలిసి ఏలవచ్చు!


వినయభావం, సహనం విషయంలో పౌలు ఆదర్శం

9 దేవుడు క్రీస్తు అపొస్తలులమైన మమ్మల్ని ఊరేగింపులో చివరి వరసలో ఉంచి మరణశిక్ష పొందిన వారిలా ఉంచాడని నాకనిపిస్తున్నది. మేము లోకమంతటికీ, అంటే దేవదూతలకూ మనుషులకూ ఒక వింత ప్రదర్శనలాగా ఉన్నాం.

10 క్రీస్తు కోసం మేము బుద్ధిహీనులం, మీరు తెలివైనవారు! మేము బలం లేని వాళ్ళం, మీరు బలమైనవారు, ఘనత పొందినవారు! మేమైతే అవమానం పాలైన వాళ్ళం.

11 ఈ గంట వరకూ మేము ఆకలిదప్పులతో అలమటిస్తున్నాం, సరైన బట్టలు లేవు. క్రూరంగా దెబ్బలు తింటున్నాం, నిలువ నీడ లేని వాళ్ళం.

12 మా చేతులతో కష్టపడి పని చేసుకుంటున్నాం. ప్రజలు మమ్మల్ని నిందించినా ప్రతిగా దీవిస్తున్నాం. ఎన్ని బాధలు పెట్టినా ఓర్చుకుంటున్నాం.

13 మమ్మల్ని తిట్టిన వారితో దయగానే మాట్లాడుతున్నాం. ఇప్పటికీ మమ్మల్ని అందరూ ఈ లోకంలోని మురికిగా, పారేసిన కసువులాగా ఎంచుతున్నారు.

14 నేను ఈ మాటలు రాస్తున్నది మీరు నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పడానికే గానీ మిమ్మల్ని సిగ్గు పరచాలని కాదు.

15-16 ఎందుకంటే క్రీస్తులో మీకు సంరక్షకులు పదివేల మంది ఉన్నా, అనేకమంది తండ్రులు లేరు. క్రీస్తు యేసులో సువార్త ద్వారా నేను మిమ్మల్ని కన్నాను. కాబట్టి నన్ను పోలి నడుచుకోమని మిమ్మల్ని వేడుకుంటున్నాను.

17 అందుకే ప్రభువులో నాకు ప్రియమైన, నమ్మకమైన నా కుమారుడు తిమోతిని మీ దగ్గరికి పంపాను. అతడు నేను ఏ విధంగా ప్రతి స్థలంలో, ప్రతి సంఘంలో ఏమి బోధిస్తున్నానో, వాటిని క్రీస్తులో ఏ విధంగా అనుసరిస్తున్నానో, మీకు జ్ఞాపకం చేస్తాడు.


అపొస్తలిక అధికారం

18 నేను మీ దగ్గరికి రాననుకుని కొందరు మిడిసిపడుతున్నారు.

19 ప్రభువు చిత్తమైతే త్వరలోనే మీ దగ్గరికి వచ్చి, అలా మిడిసి పడేవారి మాటలు కాదు, వారి బలమేమిటో తెలుసుకుంటాను.

20 దేవుని రాజ్యం అంటే ఒట్టి మాటలు కాదు, అది బలప్రభావాలతో కూడినది.

21 మీకేం కావాలి? మీ దగ్గరికి నేను బెత్తంతో రావాలా, ప్రేమతో, మృదువైన మనసుతో రావాలా?

TEL-IRV

Creative Commons License

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.

Bridge Connectivity Solutions Pvt. Ltd.
Lean sinn:



Sanasan