1 దిన 16 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019దావీదు కృతజ్ఞత పాట 16:34-36 ; కీర్త 106:1 , 47-48 1 ఈ విధంగా వాళ్ళు దేవుని మందసాన్ని తీసుకొచ్చి, దావీదు దాని కోసం వేయించిన గుడారం మధ్యలో దాన్ని ఉంచి, దేవుని సన్నిధిలో దహన బలులు, సమాధాన బలులు అర్పించారు. 2 దహన బలులు, సమాధాన బలులు దావీదు అర్పించడం ముగించిన తరువాత అతడు యెహోవా పేరట ప్రజలను దీవించాడు. 3 పురుషులైనా, స్త్రీలైనా ఇశ్రాయేలీయులందరిలో ఒక్కొక్కరికీ ఒక రొట్టె, ఒక మాంసపు ముద్ద, ఒక ఎండిన ద్రాక్షపళ్ళ గుత్తిని పంచిపెట్టాడు. 4 అతడు యెహోవా మందసం ముందు సేవ చేస్తూ, ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవాను ఘనపరచడానికీ, కృతజ్ఞత చెల్లించడానికీ, ఆయనకు స్తోత్రాలు చెల్లించడానికీ లేవీయుల్లో కొందరిని నియమించాడు. 5 వాళ్ళల్లో అధిపతి అయిన ఆసాపు, అతని తరువాతి వాడు జెకర్యా, యెహీయేలు, షెమీరామోతు, యెహీయేలు, మత్తిత్యా, ఏలీయాబు, బెనాయా, ఓబేదెదోము, యెహీయేలు అనే వాళ్ళు స్వరమండలాలు, తీగ వాద్యాలు వాయించడానికి నిర్ణయంయామకం జరిగింది. ఆసాపు కంచు తాళాలు వాయించేవాడు. 6 బెనాయా, యహజీయేలు అనే యాజకులు ఎప్పుడూ దేవుని నిబంధన మందసం ముందు బాకాలు ఊదడానికి నియామకం అయ్యారు. 7 ఆ రోజు దావీదు మొదటిగా ఆసాపునూ, అతని బంధువులనూ, యెహోవాను స్తుతిస్తూ కృతజ్ఞత అర్పించడానికి ఈ పాట పాడాలని నియమించాడు. 8 యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన పేరును ప్రకటన చెయ్యండి. ఆయన కార్యాలను ప్రజల్లో తెలియజెయ్యండి. 9 ఆయనను గూర్చి పాడండి. ఆయనను కీర్తించండి. ఆయన అద్భుత క్రియలన్నిటిని గూర్చి సంభాషణ చేయండి. 10 ఆయన పరిశుద్ధ నామాన్ని బట్టి అతిశయించండి. యెహోవాను కోరుకునే వాళ్ళు హృదయంలో సంతోషిస్తారు గాక. 11 యెహోవాను ఆశ్రయించండి. ఆయన బలాన్ని ఆశ్రయించండి. ఆయన సన్నిధిని నిత్యం వెదకండి. 12 ఆయన దాసులైన ఇశ్రాయేలు వంశస్థులారా, ఆయన ఏర్పరచుకొన్న యాకోబు సంతతి వారలారా, 13 ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం చేసుకోండి. ఆయన సూచక క్రియలను ఆయన నోట పలికిన తీర్పులను జ్ఞాపకం చేసుకోండి. 14 ఆయన మన దేవుడు యెహోవా. ఆయన తీర్పులు లోకమంతటా జరుగుతున్నాయి. 15 ఆయన తను చేసిన నిబంధనను తాను పలికిన ఆజ్ఞలను వెయ్యి తరాలు జ్ఞాపకం ఉంచుకుంటాడు. 16 ఆయన అబ్రాహాముతో చేసిన నిబంధనను ఇస్సాకుతో చేసిన ప్రమాణాన్ని మనస్సుకు తెచ్చుకుంటాడు. 17 యాకోబుకు కట్టడగా ఇశ్రాయేలుకు నిత్య నిబంధనగా ఆయన స్థిరపరిచింది దీనినే. 18 ఆయన మాట ఇచ్చాడు. “నేను కనాను భూమిని మీకు వారసత్వంగా ఇస్తాను.” 19 మీరు లెక్కకు కొద్ది మందిగా ఉన్నప్పుడే, అల్ప సంఖ్యాకులుగా, దేశంలో పరాయివారుగా ఉన్నపుడే ఇలా చెప్పాను. 20 వాళ్ళు జనం నుంచి జనానికి, రాజ్యం నుంచి రాజ్యానికి తిరుగుతున్నప్పుడు, 21 ఆయన ఎవరినీ వాళ్లకు హాని చేయనివ్వలేదు. వారి నిమిత్తం రాజులను గద్దించాడు. 22 నేను అభిషేకించిన వాళ్ళను ముట్టవద్దనీ, నా ప్రవక్తలకు కీడు చేయవద్దనీ చెప్పాడు. 23 సర్వలోక నివాసులారా, యెహోవాను సన్నుతించండి ప్రతిరోజూ ఆయన రక్షణను ప్రకటించండి. 24 అన్యజనుల్లో ఆయన మహిమను ప్రచురించండి. సమస్త జనాల్లో ఆయన ఆశ్చర్యకార్యాలను ప్రచురించండి. 25 యెహోవా మహా ఘనత వహించినవాడు. ఆయన ఎంతో స్తుతి పొందదగినవాడు. సమస్త దేవుళ్ళకంటే ఆయన పూజార్హుడు. 26 జాతుల దేవుళ్ళన్నీ వట్టి విగ్రహాలే. యెహోవా ఆకాశ వైశాల్యాన్ని సృష్టించినవాడు. 27 ఘనతా ప్రభావాలు ఆయన సన్నిధిలో ఉన్నాయి. బలం, సంతోషం ఆయన దగ్గర ఉన్నాయి. 28 జనాల వంశాల్లారా, యెహోవాకు చెల్లించండి. మహిమను బలాన్నీ యెహోవాకు ఆపాదించండి. 29 యెహోవా నామానికి తగిన మహిమను ఆయనకు చెల్లించండి. నైవేద్యాలు చేత పట్టుకుని ఆయన సన్నిధిలో చేరండి. పవిత్రత అనే ఆభరణాలు ధరించుకుని ఆయన ముందు సాగిలపడండి. 30 భూజనులారా, ఆయన సన్నిధిలో వణకండి. అప్పుడు భూలోకం కదలకుండా ఉంటుంది. అప్పుడది స్థిరంగా ఉంటుంది. 31 యెహోవా ఏలుతున్నాడని జనాల్లో చాటించండి. ఆకాశాలు ఆనందించు గాక. భూమి సంతోషించు గాక 32 సముద్రం, దాని సంపూర్ణత ఘోషిస్తుంది గాక. పొలాలు వాటిలో ఉన్న సమస్తం సంతోషిస్తాయి గాక. యెహోవా వస్తున్నాడు. 33 భూజనులకు తీర్పు చెప్పడానికి యెహోవా వస్తున్నాడు. వనవృక్షాలు ఆయన సన్నిధిలో ఆనందంతో కేకలు వేస్తాయి. 34 యెహోవా మంచివాడు, ఆయన కృప శాశ్వతంగా ఉంటుంది. ఆయనను స్తుతించండి. 35 దేవా మా రక్షకా, మమ్మల్ని రక్షించు. మమ్మల్ని సమకూర్చు. 36 మేము నీ పరిశుద్ధ నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేలా నిన్ను స్తుతిస్తూ అతిశయించేలా అన్యజనుల వశంలో నుంచి మమ్మల్ని విడిపించు అని ఆయన్ను బతిమాలుకోండి. ఇశ్రాయేలీయులకు దేవుడు యెహోవా యుగాలన్నిట్లో స్తోత్రం పొందుతాడు గాక. ఈ విధంగా వాళ్ళు పాడినప్పుడు ప్రజలందరూ ఆమేన్ అని చెప్పి యెహోవాను స్తుతించారు. 37 అప్పుడు మందసం ముందు నిత్యమూ జరగవలసిన అనుదిన సేవ జరిగించడానికి దావీదు అక్కడ యెహోవా నిబంధన మందసం దగ్గర ఆసాపునూ అతని బంధువులనూ నియమించాడు. ఓబేదెదోమునూ, వాళ్ళ బంధువులైన అరవై ఎనిమిదిమందినీ, 38 యెదూతూను కొడుకు ఓబేదెదోమునూ, హోసానూ ద్వారపాలకులుగా నియమించాడు. 39 గిబియోనులోని ఉన్నత స్థలం లో ఉన్న యెహోవా గుడారం మీద, అక్కడ ఉన్న బలిపీఠం మీద, యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన ధర్మవిధుల్లో రాసి ఉన్న ప్రకారం, 40 ఉదయం, సాయంత్రాల్లో ప్రతిరోజూ నిత్యమైన దహనబలిని ఆయనకు అర్పించడానికి అక్కడ అతడు యాజకుడైన సాదోకును, అతని బంధువులైన యాజకులను నియమించాడు. 41 యెహోవా కృప నిత్యమూ ఉంటుందని ఆయనను స్తుతించడానికి వీళ్ళతోపాటు హేమానునూ, యెదూతూనునూ, పేర్ల క్రమంలో ఉదాహరించిన మరి కొందరిని నియమించాడు. 42 బాకాలు ఊదడానికి, కంచు తాళాలను వాయించడానికి, దేవుని గూర్చి పాడదగిన పాటలను వాద్యాలతో వినిపించడానికి వీళ్ళల్లో ఉండే హేమానునూ, యెదూతూనునూ అతడు నియమించాడు. ఇంకా యెదూతూను కొడుకులను అతడు ద్వారపాలకులుగా నియమించాడు. 43 తరువాత ప్రజలందరూ తమతమ ఇళ్ళకు వెళ్లిపోయారు. దావీదు తన ఇంటివాళ్ళను దీవించడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. |
TEL-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Bridge Connectivity Solutions Pvt. Ltd.