Biblia Todo Logo
Online Bible

- Advertisements -


ఫిలిప్పీయులకు 3 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం


శరీరం మీద నమ్మకం ఉంచకండి

1 చివరిగా, నా సహోదరీ సహోదరులారా, ప్రభువులో ఆనందించండి! మరల అవే సంగతులను మీకు వ్రాయడం నాకు కష్టం కలిగించదు, అది మీకు రక్షణ కవచము.

2 ఆ కుక్కల గురించి, ఆ కీడుచేసేవారు, శరీరాన్ని ముక్కలు చేసేవారి గురించి జాగ్రత్త.

3 ఎందుకంటే, మనం సున్నతి పొందినవారం, దేవుని ఆత్మ చేత ఆయనను ఆరాధిస్తాం, క్రీస్తు యేసులో అతిశయపడతాం, శరీరంపై నమ్మకం ఉంచండి.

4 కావాలంటే నేను శరీరంపై అలాంటి నమ్మకాన్ని కలిగి ఉండవచ్చు. ఎవరైనా శరీరంపై నమ్మకం ఉంచడానికి తమ దగ్గర కారణాలు ఉన్నాయని అనుకుంటే, వారికంటే నా దగ్గర ఎక్కువ ఉన్నాయి.

5 నేను ఎనిమిదవ రోజున సున్నతి పొందాను, ఇశ్రాయేలు వంశానికి చెందినవాన్ని, బెన్యామీను గోత్రంలో పుట్టాను, హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడను; ధర్మశాస్త్ర విషయంలో పరిసయ్యుడను.

6 అత్యాసక్తితో సంఘాన్ని హింసించాను; ధర్మశాస్త్రం ఆధారం చేసుకుని నీతి విషయంలో నిరపరాధిని.

7 అయితే, ఏవైతే నాకు లాభదాయకంగా ఉన్నాయో, నేను ఇప్పుడు వాటిని క్రీస్తు నిమిత్తం నష్టంగా భావించాను.

8 నిశ్చయంగా నా ప్రభువైన క్రీస్తు యేసును తెలుసుకోవడం విలువైనది కాబట్టి నేను ప్రతిదీ నష్టంగా భావిస్తున్నాను. నేను క్రీస్తును సంపాదించుకోడానికి సమస్తాన్ని వ్యర్థంగా భావిస్తున్నాను.

9 క్రీస్తును సంపాదించుకుని, ధర్మశాస్త్రం వలన కలిగే నా నీతిని కాకుండా, క్రీస్తులోని విశ్వాసాన్నిబట్టి దేవుడు దయ చేసిన నీతిని కలిగి ఆయనలో కనబడాలని,

10 నేను క్రీస్తును తెలుసుకోవాలని కోరుతున్నాను, అవును, ఆయన పునరుత్థాన శక్తిని తెలుసుకోవాలని, ఆయన శ్రమలలో పాలుపంచుకోవడం, ఆయన మరణంలో ఆయనలా కావడం,

11 అలా, ఏదో ఒక విధంగా, మృతులలో నుండి పునరుత్థానం పొందడము.

12 నేను ఇప్పటికే ఇవన్నీ పొందానని గాని, నా లక్ష్యాన్ని చేరుకున్నానని గాని నేను భావించడంలేదు, కాని దేనికోసం క్రీస్తు యేసు నన్ను పట్టుకున్నారో దానిని పట్టుకోవాలని పరుగెడుతున్నాను.

13 సహోదరీ సహోదరులారా, నేను ఇంతకుముందే దానిని పట్టుకున్నానని భావించను, అయితే నేను చేస్తున్నది ఒకటే, వెనుక ఉన్నవాటిని మరచిపోయి ముందున్న వాటికోసం ప్రయాసపడుతున్నాను,

14 క్రీస్తు యేసులో దేవుని ఉన్నత పిలుపు వలన కలిగే బహుమానాన్ని గెలవడానికి, లక్ష్యం వైపే పరుగెడుతున్నాను.


పౌలు మాదిరిని అనుసరించుట

15 కాబట్టి మనలో సంపూర్ణులమైన వారందరం ఇదే భావాన్ని కలిగి ఉందాము. అప్పుడు దేని గురించైనా మీరు వేరుగా ఆలోచిస్తే, దాన్ని కూడా దేవుడు మీకు స్పష్టం చేస్తారు.

16 అయినా ఇప్పటివరకు మనం పొందుకున్న దానిని బట్టే క్రమంగా జీవిద్దాము.

17 సహోదరీ సహోదరులారా, మీరు నా మాదిరిని అనుసరించండి. మేము మీకు మాదిరిగా ఉన్నట్లే, ఎవరైతే మాలా జీవిస్తారో వారిపై మీ దృష్టిని ఉంచండి.

18 అనేకమంది క్రీస్తు సిలువకు శత్రువులుగా జీవిస్తున్నారు, గతంలో వీరిని గురించి మీతో అనేకసార్లు చెప్పినా, మరల ఇప్పుడు కన్నీటితో చెప్తున్నాను.

19 వారి గమ్యం నాశనం, వారి కడుపే వారికి దేవుడు, తాము సిగ్గుపడవలసిన వాటిలో వారు గర్వపడుతున్నారు. భూసంబంధమైన వాటిపైనే తమ మనస్సు ఉంచుతున్నారు.

20 అయితే మన పౌరసత్వం పరలోకంలో ఉంది, కాబట్టి అక్కడినుండి వచ్చే మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తు గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము.

21 సమస్తాన్ని తన ఆధీనంలోనికి తీసుకురాగల తన శక్తినిబట్టి, ఆయన మన నీచమైన శరీరాలను తన మహిమగల శరీరాన్ని పోలి ఉండేలా మార్చగలరు.

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Follow us:



Advertisements