Online Bible

- Reklamy -

2 దిన 27 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం


యూదా రాజైన యోతాము

1 యోతాము రాజైనప్పుడు అతని వయస్సు ఇరవై అయిదు సంవత్సరాలు. అతడు యెరూషలేములో పదహారు సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు యెరూష. ఆమె సాదోకు కుమార్తె.

2 అతడు తన తండ్రి ఉజ్జియా చేసినట్లే యెహోవా దృష్టిలో సరియైనది చేశాడు, కానీ అతనిలా యెహోవా మందిరంలోకి ప్రవేశించలేదు. ప్రజలు మాత్రం తమ అవినీతి అక్రమాలను కొనసాగించారు.

3 యోతాము యెహోవా ఆలయానికి పై ద్వారాన్ని తిరిగి కట్టించాడు. ఓఫెలు కొండ దగ్గర గోడను చాలా వరకు కట్టించాడు.

4 అతడు యూదా కొండ ప్రాంతంలో పట్టణాలు అడవుల్లో కోటలు బురుజులు నిర్మించాడు.

5 యోతాము అమ్మోనీయుల రాజుతో యుద్ధం చేసి వారిని జయించాడు. ఆ సంవత్సరం అమ్మోనీయులు అతనికి నూరు తలాంతుల వెండి, పదివేల కోరుల గోధుమలు, పదివేల కోరుల యవలు చెల్లించారు. అమ్మోనీయులు రెండవ మూడవ సంవత్సరాల్లో కూడా అదే మొత్తాన్ని అతనికి తీసుకువచ్చారు.

6 యోతాము తన దేవుడు యెహోవా దృష్టిలో యధార్థంగా ప్రవర్తించినందుచేత అతడు బలాభివృద్ధి చెందాడు.

7 యోతాము పరిపాలనకు సంబంధించిన ఇతర విషయాలు అతడు చేసిన యుద్ధాలన్నీ, అతడు చేసిన ఇతర కార్యాలన్ని ఇశ్రాయేలు, యూదారాజు చర్రిత గ్రంథంలో వ్రాసి ఉన్నాయి.

8 అతడు రాజైనప్పుడు అతని వయస్సు ఇరవై అయిదు సంవత్సరాలు. అతడు యెరూషలేములో పదహారు సంవత్సరాలు పరిపాలించాడు.

9 యోతాము చనిపోయి అతని పూర్వికుల దగ్గరకు చేరాడు. ప్రజలు దావీదు పట్టణంలో అతన్ని సమాధి చేశారు. అతని తర్వాత అతని కుమారుడైన ఆహాజు రాజయ్యాడు.

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Následuj nás:



Reklamy