Online Bible

- Reklamy -

1 దిన 5 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం


రూబేను

1 ఇశ్రాయేలు మొదటి కుమారుడైన రూబేను కుమారులు. (అతడు మొదటి కుమారుడు, కాని అతడు తన తండ్రి పడక ఎక్కి దాన్ని అపవిత్రం చేశాడు కాబట్టి, అతని జ్యేష్ఠత్వపు హక్కులు ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకు ఇవ్వబడ్డాయి; కాబట్టి జన్మహక్కుల ప్రకారం వంశావళిలో అతడు నమోదు కాలేదు.

2 యూదా తన అన్నదమ్ములకంటే బలవంతుడు, అతని వంశంలో నుండి పరిపాలకుడు వచ్చాడు, అయినా కూడా జ్యేష్ఠత్వపు హక్కులు యోసేపుకు వచ్చాయి.)

3 ఇశ్రాయేలు మొదటి కుమారుడైన రూబేను కుమారులు వీరు: హనోకు, పల్లు, హెస్రోను, కర్మీ.

4 యోవేలు సంతానం: అతని కుమారుడు షెమయా, అతని కుమారుడు గోగు, అతని కుమారుడు షిమీ,

5 అతని కుమారుడు మీకా, అతని కుమారుడు రెవాయా, అతని కుమారుడు బయలు,

6 అతని కుమారుడు బెయేర, ఇతన్ని అష్షూరు రాజైన తిగ్లత్-పిలేసెరు బందీగా తీసుకెళ్లాడు. బెయేర రూబేనీయులకు నాయకుడు.

7 వారి వంశావళిలో పేర్కొన్న కుటుంబాల ప్రకారం వారి బంధువులు: నాయకుడైన యెహీయేలు, జెకర్యా,

8 యోవేలు కుమారుడైన షెమ కుమారుడైన ఆజాజు కుమారుడైన బేల. వారు అరోయేరు నుండి నెబో వరకు, బయల్-మెయోను వరకు నివసించారు.

9 వారి పశువులు గిలాదులో విస్తారంగా వృద్ధిచెందడంతో, తూర్పున యూఫ్రటీసు నది దగ్గర నుండి ఎడారి సరిహద్దు వరకు వారు నివసించారు.

10 సౌలు పాలిస్తున్నప్పుడు వారు హగ్రీయీలతో యుద్ధం చేసి వారిని ఓడించారు. వారు గిలాదుకు తూర్పుగా ఉన్న ప్రాంతమంతటిలో ఉన్న హగ్రీయీల నివాస స్థలాలను స్వాధీనం చేసుకున్నారు.


గాదు

11 గాదీయులు వారికి ఎదురుగా బాషానులో సలేకా వరకు నివసించారు.

12 వారికి యోవేలు నాయకుడు. అతని తర్వాత షాపాము, తర్వాత యహనై, షాపాతు, వీరు బాషానులో ఉండేవారు.

13 వారి కుటుంబాల ప్రకారం వారి బంధువులు: మిఖాయేలు, మెషుల్లాము, షేబ, యోరై, యకాను, జీయ, ఏబెరు మొత్తం ఏడుగురు.

14 వీరు హూరీ కుమారుడైన అబీహయిలు కుమారులు: హూరీ యరోయ కుమారుడు, యరోయ గిలాదు కుమారుడు, గిలాదు మిఖాయేలు కుమారుడు, మిఖాయేలు యెషీషై కుమారుడు, యెషీషై యహదో కుమారుడు, యహదో బూజు కుమారుడు.

15 గూనీ కుమారుడైన అబ్దీయేలుకు పుట్టిన అహీ వారి కుటుంబ పెద్ద.

16 గాదు వంశస్థులు బాషానులో గిలాదులో, చుట్టుప్రక్కల గ్రామాల్లో, షారోను సరిహద్దుల వరకు ఉన్న పచ్చని మైదానాల్లో నివసించారు.

17 వీరందరు యూదా రాజైన యోతాము రోజుల్లో ఇశ్రాయేలు రాజైన యరొబాము రోజుల్లో వంశావళి పత్రాలలో నమోదయ్యారు.

18 రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్థగోత్రం వారిలో డాలు కత్తి పట్టుకోవడంలో నేర్పుగలవారు, విల్లు ఉపయోగించగలవారు, యుద్ధశిక్షణ తీసుకున్నవారు 44,760 మంది ఉన్నారు.

19 వారు హగ్రీయీలతో, యెతూరువారితో, నాపీషువారితో, నోదాబువారితో యుద్ధం చేశారు.

20 వారు యుద్ధ సమయంలో దేవునికి మొరపెట్టారు కాబట్టి దేవుడు వారికి సహాయం చేసి ఆ హగ్రీయీలను, వారితో ఉన్నవారందరిని వారి చేతికి అప్పగించారు. వారు ఆయన మీద నమ్మకముంచారు కాబట్టి ఆయన వారి ప్రార్థన అంగీకరించారు.

21 వారు హగ్రీయీలకు చెందిన యాభైవేల ఒంటెలు, రెండు లక్షల యాభైవేల గొర్రెలు, రెండువేల గాడిదలను పట్టుకున్నారు. అలాగే లక్ష మంది మనుష్యులను బందీలుగా తీసుకెళ్లారు.

22 ఇంకా చాలామంది శత్రువులను చంపారు ఎందుకంటే ఆ యుద్ధం దేవునిది. చెరకు వెళ్లేవరకు వారు అక్కడే నివసించారు.


మనష్షే అర్థగోత్రం

23 మనష్షే అర్థగోత్రీకులు చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు; వారు బాషాను నుండి, బయల్-హెర్మోను వరకు, అంటే శెనీరు వరకు (హెర్మోను పర్వతం) నివసించారు.

24 వారి కుటుంబ పెద్దలు వీరే: ఏఫెరు, ఇషీ, ఎలీయేలు, అజ్రీయేలు, యిర్మీయా, హోదవ్యా, యహదీయేలు. వీరు ధైర్యవంతులైన వీరులు, ప్రసిద్ధి చెందినవారు వారి కుటుంబ పెద్దలు.

25 అయితే వారు తమ పూర్వికుల దేవుని పట్ల నమ్మకద్రోహులుగా ఉన్నారు, దేవుడు తమ ఎదుట నాశనం చేసిన దేశ ప్రజల దేవుళ్ళను పూజిస్తూ, వాటితో వ్యభిచారులగా ప్రవర్తించారు.

26 కాబట్టి ఇశ్రాయేలీయుల దేవుడు అష్షూరు రాజైన పూలు మనస్సును (అష్షూరు రాజైన తిగ్లత్-పిలేసెరు) పురికొల్పగా, అతడు రూబేనీయులను, గాదీయులను, మనష్షే అర్థగోత్రీకులను బందీలుగా తీసుకెళ్లాడు. అతడు వారిని హాలహు, హాబోరు, హారా, గోజాను అనే నదీ ప్రాంతాలకు తీసుకెళ్లాడు. ఈ రోజు వరకు వారు అక్కడే ఉన్నారు.

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Následuj nás:



Reklamy