Online Bible

- Reklamy -

పరమగీతము 4 - పవిత్ర బైబిల్


అతను ఆమెతో అంటున్నాడు

1 నా ప్రియురాలా, నువ్వెంతో అందంగా ఉన్నావు! ఆహా, నువ్వు సుందరంగా ఉన్నావు! నీ మేలి ముసుగు క్రింద నీ కళ్లు పావురాల కళ్లలా ఉన్నాయి. నీ శిరోజాలు పొడుగ్గా గిలాదు పర్వత సానువుల కింద నృత్యం చేసే మేకపిల్లల్లా జారుతున్నాయి.

2 గొడ్డువి కాక, కవలపిల్లల్ని కలిగి, కత్తరించబడి, కడుగబడి, పైకి వస్తున్న తెల్ల గొర్రె మందల్ని పోలినవి నీ పళ్లు.

3 నీ పెదవులు ఎర్ర పట్టు దారంలా ఉన్నాయి. నీ నోరు అందంగా ఉంది నీ మేలి ముసుగు క్రింద నీ చెక్కిళ్లు రెండు దానిమ్మపండు చెక్కల్లా ఉన్నాయి.

4 నీ మెడ పొడుగ్గా సన్నగా జయ సూచకాల్ని ఉంచే దావీదు గోపురంలా ఉంది శక్తిమంతులైన సైనికుల డాళ్లు వెయ్యి డాళ్ళు దాని గోడల మీద అలంకరించడం కోసం ఆ గోపురాన్ని కట్టారు.

5 నీ స్తనాలు, తెల్ల కలువల్లో మేస్తున్న కవల జింక పిల్లల్లా ఉన్నాయి కవల దుప్పి పిల్లల్లా ఉన్నాయి.

6 సూర్యాస్తమయ వేళ, నీడలు కనుమరుగయ్యే వేళ నేను ఆ గోపరస పర్వతానికి వెళ్తాను ఆ సాంబ్రాణి కొండకు వెళ్తాను.

7 నా ప్రియురాలా! నీ శరీరమంతా అందంగానే ఉంది. నీకెక్కడా వికారమైన గుర్తుల్లేవు!

8 నా వధువా! లెబానోను నుండి నాతోరా! లెబానోనునుండి నాతోరా. అమాన పర్వత శిఖరాన్నుండి శెనీరు హెర్మోనుల కొండకొనల నుండి సింహపు గుహల నుండి చిరుత పులుల పర్వతాలనుండి రమ్ము!

9 నా ప్రియురాలా! నా ప్రియ వధువా, నీవు నన్ను ఉద్రేక పరుస్తావు. ఒకే ఒక చూపుతో నీ హారంలోని ఒకే ఒక రత్నంతో నా హృదయాన్ని దోచుకున్నావు.

10 నా ప్రియురాలా! నా ప్రియ వధువా, నీ ప్రేమ చాలా సుందరమైనది ద్రాక్షారసంకన్నా నీ ప్రేమ మధురమైంది, నీ పరిమళ ద్రవ్యపు సువాసన ఏ రకమైన సుగంధ ద్రవ్యంకన్నా గొప్పది!

11 నా ప్రియవధువా, నీ పెదవులు తేనె లూరుతున్నాయి నీ నాలుక (కింద) నుంచి తేనే, పాలూ జాలువారుతున్నాయి నీ దుస్తులు మధుర పరిమళాన్ని గుబాళిస్తున్నాయి.

12 నా నా ప్రియురాలా! నా ప్రియ వధువా, నీవు నిష్కళంకురాలివి. మూయబడిన ఉద్యానవనం వలె, మూయబడిన జలాశయంవలె, మూయబడిన జలధారలవలె స్వచ్ఛమైనదానవు.

13 నీ శరీరమొక తోటను పోలినది దానిమ్మ వృక్షాలతో తదితర మధుర ఫల వృక్షాలతో గోరింట, జటా మాంసి,

14 కుంకుమ పువ్వు, నిమ్మగడ్డి, లవంగ, సాంబ్రాణి బోళం, అగరు యిత్యాది అతి శ్రేష్ట సుగంధ ద్రవ్యాలనిచ్చే తరులతాదులతో నిండిన సుందర వనాన్ని పోలినది.

15 నీవు ఉద్యాన జలాశయం వంటిదానివి, మంచినీటి ఊటల బావిలాంటిదానివి, లెబానోను పర్వతం నుంచి జాలువారే సెలయేరు వంటిదానివి.


ఆమె అంటుంది

16 ఉత్తర పవనమా లే! దక్షిణ పవనమా రా! నా ఉద్యానవనంపై వీచి, దాని మధుర సౌరభాన్ని వెద జల్లండి. నా ప్రియుడు తన ఉద్యానవనానికి రావాలి అందలి మధుర ఫలాలు ఆరగించాలి.

Telugu Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 1997 Bible League International

Bible League International
Následuj nás:



Reklamy