కీర్తన 3 - పవిత్ర బైబిల్దావీదు తన కుమారుడైన అబ్షాలోము నుండి పారిపోతున్న సమయంలో వ్రాసిన కీర్తన 1 యెహోవా, నాకు ఎందరెందరో శత్రువులు ఉన్నారు అనేకమంది ప్రజలు నాకు విరోధంగా తిరిగారు. 2 చాలామంది మనుష్యులు నా విషయమై మాట్లాడుతున్నారు. “అతన్ని దేవుడు తప్పించడు!” అని ఆ మనుష్యులు అంటారు. 3 అయితే, యెహోవా, నీవు నాకు కేడెము. నీవే నా అతిశయం. యెహోవా, నీవు నన్ను ప్రముఖునిగా చేస్తావు. 4 యెహోవాకు నేను ప్రార్థిస్తాను. ఆయన తన పవిత్ర పర్వతం నుండి నాకు జవాబు ఇస్తాడు! 5 నేను పడుకొని విశ్రాంతి తీసుకోగలను, మరి నేను మేల్కొందును. ఇది నాకు ఎలా తెలుస్తుంది? ఎందుచేతనంటే యెహోవా నన్ను ఆవరించి, కాపాడును గనుక! 6 వేలకు వేలుగా సైనికులు నా చుట్టూ మోహరించి ఉండవచ్చును. కాని ఆ శత్రువులకు నేను భయపడను. 7 యెహోవా, లెమ్ము నా దేవా, వచ్చి నన్ను రక్షించుము! నీవు చాలా బలవంతుడవు! నా దుష్ట శత్రువుల దవడమీద నీవు కొట్టి, వారి పళ్లన్నీ నీవు విరుగగొడతావు. 8 యెహోవా తన ప్రజలను రక్షించగలడు. యెహోవా, దయచేసి నీ ప్రజలకు నీవు మంచి సంగతులను జరిగించుము. |
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International
Bible League International