Online Bible

- Reklamy -

న్యాయాధి 8 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 అప్పుడు ఎఫ్రాయిమీయులు గిద్యోనుతో–నీవు మా యెడల చూపిన మర్యాద యెట్టిది? మిద్యానీయులతో యుద్ధము చేయుటకు నీవు పోయినప్పుడు మమ్ము నేల పిలువలేదని చెప్పి అతనితో కఠినముగా కలహించిరి.

2 అందుకతడు–మీరు చేసినదెక్కడ నేను చేసినదెక్కడ? అబీ యెజెరు ద్రాక్షపండ్ల కోతకంటె ఎఫ్రాయిమీయుల పరిగె మంచిదికాదా? దేవుడు మిద్యానీయుల అధిపతులైన ఓర బును జెయేబును మీచేతికి అప్పగించెను; మీరు చేసినట్లు నేను చేయగలనా? అనెను.

3 అతడు ఆ మాట అన్నప్పుడు అతని మీది వారి కోపము తగ్గెను.

4 గిద్యోనును అతనితోనున్న మూడువందలమందియును అలసటగానున్నను, శత్రువులను తరుముచు యొర్దానునొద్దకు వచ్చి దాటిరి.

5 అతడు–నా వెంటనున్న జనులు అలసియున్నారు, ఆహారమునకు రొట్టెలు వారికి దయచేయుడి; మేము మిద్యాను రాజులైన జెబహును సల్మున్నాను తరుముచున్నామని సుక్కోతువారితో చెప్పగా

6 సుక్కోతు అధిపతులు– జెబహు సల్మున్నా అను వారి చేతులు ఇప్పుడు నీ చేతికి చిక్కినవి గనుకనా మేము నీ సేనకు ఆహారము ఇయ్యవలెనని యడిగిరి.

7 అందుకు గిద్యోను –ఈ హేతువు చేతను జెబహును సల్మున్నాను యెహోవా నా చేతికప్పగించిన తరువాత నూర్చు కొయ్యలతోను కంపలతోను మీ దేహములను నూర్చి వేయుదునని చెప్పెను.

8 అక్కడనుండి అతడు పెనూయేలునకు పోయి ఆలాగుననే వారితోను చెప్పగా సుక్కోతువారు ఉత్తరమిచ్చినట్లు పెనూయేలువారును అతని కుత్తరమిచ్చిరి గనుక అతడు

9 –నేను క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు ఈ గోపురమును పడగొట్టెదనని పెనూ యేలువారితో చెప్పెను.

10 అప్పుడు జెబహును సల్ము న్నాయు వారితోకూడ వారి సేనలును, అనగా తూర్పు జనుల సేనలన్నిటిలో మిగిలినయించుమించు పదునైదు వేలమంది మనుష్యులందరును కర్కోరులోనుండిరి. కత్తి దూయు నూట ఇరువదివేలమంది మనుష్యులు పడిపోయిరి.

11 అప్పుడు గిద్యోను నోబహుకును యొగేబ్బెహకును తూర్పున గుడారములలో నివసించిన వారి మార్గమున పోయి సేన నిర్భయముగా నున్నందున ఆ సేనను హతముచేసెను.

12 జెబహు సల్మున్నాయు పారిపోయినప్పుడు అతడు వారిని తరిమి మిద్యాను ఇద్దరు రాజులైన జెబహును సల్మున్నాను పట్టుకొని ఆ సేననంతను చెదరగొట్టెను.

13 యుద్ధము తీరిన తరువాత యోవాషు కుమారుడైన గిద్యోను

14 హెరెసు ఎగువనుండి తిరిగి వచ్చి, సుక్కోతువారిలో ఒక యౌవనుని పట్టుకొని విచారింపగా అతడు సుక్కోతు అధిపతులను పెద్దలలో డెబ్బదియేడుగురు మనుష్యులను పేరు పేరుగా వివరించి చెప్పెను.

15 అప్పుడతడు సుక్కోతువారి యొద్దకు వచ్చి–జెబహు సల్మున్నా అను వారిచేతులు నీ చేతికి చిక్కినవి గనుకనా అలసియున్న నీ సేనకు మేము ఆహారము ఇయ్యవలెను అని మీరు ఎవరివిషయము నన్ను దూషించితిరో ఆ జెబహును సల్మున్నాను చూడుడి అని చెప్పి

16 ఆ ఊరిపెద్దలను పట్టుకొని నూర్చుకొయ్యలను బొమ్మజెముడును తీసికొని వాటివలన సుక్కోతువారికి బుద్ధిచెప్పెను.

17 మరియు నతడు పెనూయేలు గోపురమును పడగొట్టి ఆ ఊరివారిని చంపెను.

18 అతడు–మీరు తాబోరులో చంపిన మనుష్యులు ఎట్టివారని జెబహును సల్మున్నాను అడుగగా వారు–నీవంటివారే, వారందరును రాజకుమారులను పోలియుండిరనగా

19 అతడు–వారు నా తల్లి కుమారులు నా సహోదరులు; మీరు వారిని బ్రదుకనిచ్చినయెడల

20 యెహోవా జీవముతోడు, మిమ్మును చంపకుందునని చెప్పి తన పెద్దకుమారుడైన యెతెరును చూచి–నీవు లేచి వారిని చంపుమని చెప్పెను. అతడు చిన్నవాడు గనుక భయపడి కత్తిని దూయలేదు.

21 అప్పుడు జెబహు సల్మున్నాలు–ప్రాయముకొలది నరునికి శక్తియున్నది గనుక నీవు లేచి మామీద పడుమని చెప్పగా గిద్యోను లేచి జెబ హును సల్మున్నాను చంపి వారి ఒంటెల మెడలమీదనున్న చంద్రహారములను తీసికొనెను.

22 అప్పుడు ఇశ్రాయేలీయులు గిద్యోనుతో–నీవు మిద్యానీయుల చేతిలోనుండి మమ్మును రక్షించితివి గనుక నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును మమ్మును ఏల వలెనని చెప్పిరి.

23 అందుకు గిద్యోను–నేను మిమ్మును ఏలను, నా కుమారుడును మిమ్మును ఏలరాదు, యెహోవా మిమ్మును ఏలునని చెప్పెను.

24 మరియు గిద్యోను–మీలో ప్రతివాడు తన దోపుడు సొమ్ములోనున్న పోగులను నాకియ్య వలెనని మనవిచేయుచున్నాననెను. వారు ఇష్మాయేలీయులు గనుక వారికి పోగులుండెను.

25 అందుకు వారు–సంతోషముగా మేము వాటి నిచ్చెదమని చెప్పి యొక బట్టను పరచి ప్రతివాడును తన దోపుడుసొమ్ములోనుండిన పోగులను దానిమీద వేసెను.

26 మిద్యాను రాజుల ఒంటి మీదనున్న చంద్రహారములు కర్ణభూషణములు ధూమ్ర వర్ణపు బట్టలు గాకను, ఒంటెల మెడలనున్న గొలుసులు గాకను, అతడు అడిగిన బంగారు పోగుల యెత్తు వెయ్యిన్ని ఏడువందల తులముల బంగారము. గిద్యోను దానితో ఒక ఏఫోదును చేయించుకొని తన పట్టణమైన ఒఫ్రాలో దాని ఉంచెను.

27 కావున ఇశ్రాయేలీయులందరు అక్కడికి పోయి దాని ననుసరించి వ్యభిచారులైరి. అది గిద్యోనుకును అతని యింటివారికిని ఉరిగానుండెను.

28 మిద్యానీయులు ఇశ్రాయేలీయుల యెదుట అణపబడి అటుతరువాత తమ తలలను ఎత్తికొనలేకపోయిరి. గిద్యోను దినములలో దేశము నలువది సంవత్సరములు నిమ్మళముగా నుండెను.

29 తరువాత యోవాషు కుమారుడైన యెరుబ్బయలు తన యింట నివసించుటకు పోయెను.

30 గిద్యోనుకు అనేక భార్యలున్నందున కడుపున కనిన డెబ్బదిమంది కుమారులు అతనికుండిరి.

31 షెకెములోనున్న అతని ఉపపత్నియు అతని కొక కుమారుని కనగా గిద్యోను వానికి అబీమెలెకను పేరు పెట్టెను.

32 యోవాషు కుమారుడైన గిద్యోను మహా వృద్ధుడై చనిపోయి అబీయెజ్రీయుల ఒఫ్రాలోనున్న తన తండ్రియైన యోవాషు సమాధిలో పాతిపెట్టబడెను.

33 గిద్యోను చనిపోయిన తరువాత ఇశ్రాయేలీయులు చుట్టునుండు తమ శత్రువులచేతిలోనుండి తమ్మును విడి పించిన తమ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసికొనక

34 మరల బయలుల ననుసరించి వ్యభిచారులై బయల్బెరీతును తమకు దేవతగా చేసికొనిరి.

35 మరియు వారు గిద్యోనను యెరుబ్బయలు ఇశ్రాయేలీయులకు చేసిన ఉపకార మంతయు మరచి అతని యింటివారికి ఉపకారము చేయక పోయిరి.

Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible

Copyright © 2016 by The Bible Society of India

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Následuj nás:



Reklamy