Online Bible

- Reklamy -

యెహెజ్కేలు 34 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

2 –నరపుత్రుడా, ఇశ్రాయేలీయుల కాపరులనుగూర్చి ఈ మాట ప్రవచింపుము, ఆ కాపరులతో ఇట్లనుము–ప్రభువగు యెహోవా సెలవిచ్చున దేమనగా–తమ కడుపు నింపుకొను ఇశ్రాయేలీయుల కాపరులకు శ్రమ; కాపరులు గొఱ్ఱెలను మేపవలెను గదా.

3 మీరు క్రొవ్విన గొఱ్ఱెలను వధించి క్రొవ్వును తిని బొచ్చును కప్పుకొందురు గాని గొఱ్ఱెలను మేపరు,

4 బలహీనమైనవాటిని మీరు బలపరచరు, రోగముగలవాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటికి కట్టుకట్టరు, తోలివేసిన వాటిని మరల తోలుకొనిరారు, తప్పిపోయినవాటిని వెదకరు, అది మాత్రమేగాక మీరు కఠినమనస్కులై బలాత్కారముతో వాటిని ఏలుదురు.

5 కాబట్టి కాపరులు లేకయే అవి చెదరిపోయెను, చెదరిపోయి సకల అడవి మృగములకు ఆహారమాయెను.

6 నా గొఱ్ఱెలు పర్వతములన్నిటిమీదను ఎత్తయిన ప్రతి కొండమీదను తిరుగులాడుచున్నవి, నా గొఱ్ఱెలు భూమియందంతట చెదరిపోయినను వాటినిగూర్చి విచారించువాడొకడును లేడు, వెదకువాడొకడును లేడు.

7 కాబట్టి కాపరులారా, యెహోవా మాట ఆలకించుడి

8 –కాపరులులేకుండ నా గొఱ్ఱెలు దోపుడుసొమ్మయి సకలమైన అడవిమృగములకు ఆహార మాయెను; కాపరులు నా గొఱ్ఱెలను విచారింపరు, తమ కడుపు మాత్రమే నింపుకొందురు గాని గొఱ్ఱెలను మేపరు; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.

9 కాబట్టి కాపరులారా యెహోవా మాట ఆలకించుడి.

10 –ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–నా జీవముతోడు నేను ఆ కాపరులకు విరోధినైతిని, నా గొఱ్ఱెలనుగూర్చి వారియొద్ద విచారించెదను, వారు గొఱ్ఱెలు మేపుట మాన్పించెదను, ఇకను కాపరులు తమ కడుపు నింపుకొనజాలక యుందురు; నా గొఱ్ఱెలు వారికి తిండికాకుండ వారి నోటనుండి వాటిని తప్పించెదను, ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.

11 ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–ఇదిగో నేను నేనే నా గొఱ్ఱెలను వెదకి వాటిని కనుగొందును.

12 తమ గొఱ్ఱెలు చెదరిపోయి నప్పుడు కాపరులు వాటిని వెదకునట్లు నేను నా గొఱ్ఱెలను వెదకి, చీకటిగల మబ్బుదినమందు ఎక్కడెక్కడికి అవి చెదరిపోయెనో అక్కడనుండి నేను వాటిని తప్పించి

13 ఆయా జనులలోనుండి వాటిని తోడుకొని వచ్చి, ఆయా దేశములలోనుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశములోనికి వాటిని తెచ్చి పర్వతములమీదను వాగులయొద్దను దేశమందున్న సకలమైన కాపురపు స్థలములందును వాటిని మేపెదను.

14 నేను మంచి మేతగలచోట వాటిని మేపెదను, ఇశ్రాయేలుయొక్క ఉన్నతస్థలములమీద వాటికి దొడ్డి యేర్పడును, అక్కడ అవి మంచి దొడ్డిలో పండు కొనును, ఇశ్రాయేలు పర్వతములమీద బలమైన మేతగల స్థలమందు అవి మేయును,

15 నేనే నా గొఱ్ఱెలను మేపి పరుండబెట్టుదును; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.

16 తప్పిపోయిన దానిని నేను వెదకుదును, తోలివేసిన దానిని మరల తోలుకొని వచ్చెదను, గాయపడినదానికి కట్టు కట్టుదును, దుర్బలముగా ఉన్నదానిని బలపరచుదును; అయితే క్రొవ్వినవాటికిని బలముగలవాటికిని శిక్షయను మేతపెట్టి లయపరచెదను.

17 నా మందా, మీ విషయమై దేవుడనైన యెహోవానగు నేను సెలవిచ్చునదేమనగా– గొఱ్ఱెకును గొఱ్ఱెకును మధ్యను, గొఱ్ఱెలకును పొట్టేళ్లకును మధ్యను, గొఱ్ఱెలకును మేకపోతులకునుమధ్యను భేదము కనుగొని నేను తీర్పుతీర్చెదను.

18 విశేషముగా మేతమేసి మిగిలిన దానిని కాళ్లతో త్రొక్కుట మీకు చాలదా?

19 మీరు స్వచ్ఛమైన నీరుత్రాగి మిగిలినదానిని కాళ్లతో కలకలు చేయుట మీకు చాలదా? మీరు కాళ్లతో త్రొక్కినదానిని నా గొఱ్ఱెలు మేయవలెనా? కాళ్లతో మీరు బురదగా కలిపినదానిని అవి త్రాగవలెనా?

20 కాబట్టి ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు–ఇదిగో నేను నేనే క్రొవ్విన గొఱ్ఱెలకును చిక్కిపోయిన గొఱ్ఱెలకును మధ్య భేదము కనుగొని తీర్పు తీర్చుదును.

21 మీరు భుజముతోను ప్రక్కతోను త్రోసి, కొమ్ములతో రోగముగల వాటినన్నిటిని పొడిచి చెదర గొట్టెదరు.

22 నా గొఱ్ఱెలు ఇక దోపుడు కాకుండ గొఱ్ఱెకును గొఱ్ఱెకును మధ్య తీర్పుతీర్చి నేను వాటిని రక్షించెదను.

23 వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును వాటిమీద కాపరినిగా నియమించెదను, అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును.

24 యెహోవానైన నేను వారికి దేవుడనై యుందును, నా సేవకుడైన దావీదు వారిమధ్య అధిపతిగా ఉండును, యెహోవానైన నేను మాటయిచ్చియున్నాను.

25 మరియు అవి అరణ్యములో నిర్భయముగా నివసించునట్లును, అడవిలో నిర్భయముగా పండుకొనునట్లును నేను వారితో సమాధానార్థ నిబంధన చేయుదును, దుష్టమృగములు దేశములోలేకుండచేయుదును.

26 వారిని నా పర్వతము చుట్టుపెట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును. ఋతువుల ప్రకారము వర్షము కురిపించెదను, దీవెనకరమగు వర్షములు కురియును,

27 ఫలవృక్షములు ఫలములిచ్చును, భూమి పంట పండును, వారు దేశములో నిర్భయముగా నివసింతురు, నేను వారి కాడికట్లను తెంపి వారిని దాసులుగా చేసినవారి చేతిలోనుండి వారిని విడిపింపగా నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు.

28 ఇక వారు అన్యజనులకు దోపుడు సొమ్ముగా ఉండరు, దుష్టమృగములు వారినిక భక్షింపవు, ఎవరివలనను భయములేకుండ వారు సురక్షితముగా నివసించెదరు.

29 మరియు వారు ఇక దేశములో కరవు కలిగి నశించిపోకుండను అన్యజనులవలన వారి కవమానము ప్రాప్తించకుండను వారి ప్రఖ్యాతికొరకై తోట యొకటి నే నేర్పరచెదను.

30 అప్పుడు తమ దేవుడైన యెహోవానగు నేను తమకు తోడుగా ఉన్నాననియు, ఇశ్రాయేలీయులైన తాము నా జనులైయున్నారనియు వారు తెలిసికొందురు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.

31 నా గొఱ్ఱెలును నేను మేపుచున్న గొఱ్ఱెలునగు మీరు మనుష్యులు, నేను మీ దేవుడను; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.

Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible

Copyright © 2016 by The Bible Society of India

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Následuj nás:



Reklamy