Online Bible

- Reklamy -

2 దిన 14 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 అబీయా తన పితరులతోకూడ నిద్రింపగా జనులు అతనిని దావీదు పట్టణమందు పాతిపెట్టిరి; అతనికి బదులుగా అతని కుమారుడైన ఆసా రాజాయెను. ఇతని దినములలో దేశము పది సంవత్సరములు నెమ్మది పొందెను.

2 ఆసా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడచినవాడై

3 అన్యదేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నతస్థలములను పాడుచేసి ప్రతిమలను పగుల గొట్టి దేవతాస్తంభములను కొట్టివేయించి

4 వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును, ధర్మశాస్త్రమునుబట్టియు విధినిబట్టియు క్రియలు జరిగించుటకును, యూదావారికి ఆజ్ఞాపించి

5 ఉన్నతస్థలములను సూర్య దేవతాస్తంభములను యూదావారి పట్టణములన్నిటిలోనుండి తీసివేసెను. అతని యేలుబడియందు రాజ్యము నెమ్మదిగా ఉండెను.

6 ఆ సంవత్సరములలో అతనికి యుద్ధములు లేకపోవుటచేత దేశములో నెమ్మదికలిగియుండెను; యెహోవా అతనికి విశ్రాంతి దయచేసియుండగా అతడు యూదా దేశమున ప్రాకారములుగల పట్టణములను కట్టించెను.

7 అతడు యూదావారికి ఈలాగు ప్రకటనచేసెను–మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించితిమి, ఆశ్ర యించినందున ఆయన మన చుట్టును నెమ్మది కలుగజేసి యున్నాడు; దేశమందు మనము నిరభ్యంతరముగా తిరుగ వచ్చును, మనము ఈ పట్టణములను కట్టించి, వాటికి ప్రాకారములను గోపురములను గుమ్మములను ద్వారబంధములను అమర్చుదము. కాగా వారు పట్టణములను కట్టి వృద్ధినొందిరి.

8 ఆ కాలమున డాళ్లను ఈటెలను పట్టుకొను మూడు లక్షలమంది యూదావారును, కేడెములు ధరించి విల్లువేయు రెండులక్షల ఎనుబదివేల మంది బెన్యామీనీయులును కూడిన సైన్యము ఆసాకు ఉండెను; వీరందరును పరాక్రమశాలులై యుండిరి.

9 కూషీయుడైన జెరహు వారిమీద దండెత్తి వేయి వేల సైన్యమును మూడువందల రథములను కూర్చుకొని బయలుదేరి మారేషావరకు రాగా ఆసా అతనికి ఎదురుబోయెను.

10 వారు మారేషానొద్ద జెపాతా అను పల్లపుస్థలమందు పంక్తులు తీర్చి యుద్ధము కలుపగా

11 ఆసా తన దేవుడైన యెహోవాకు మొఱ్ఱపెట్టి – యెహోవా, విస్తారమైన సైన్యముచేతిలో ఓడిపోకుండ బలములేనివారికి సహాయము చేయుటకు నీకన్న ఎవరును లేరు; మా దేవా యెహోవా, మాకు సహాయముచేయుము, నిన్నే నమ్ముకొనియున్నాము, నీ నామమునుబట్టియే యీ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరియున్నాము. యెహోవా నీవే మా దేవుడవు, నరమాత్రులను నీ పైని జయమొందనియ్యకుము అని ప్రార్థింపగా

12 యెహోవా ఆ కూషీయులను ఆసాయెదుటను యూదావారి యెదుటను నిలువనియ్యక వారిని మొత్తినందునవారు పారిపోయిరి.

13 ఆసాయును అతనితోకూడనున్నవారును గెరారువరకు వారిని తరుమగా కూషీయులు మరల పంక్తులు తీర్చలేక యెహోవా భయముచేతను ఆయన సైన్యపు భయముచేతను పారిపోయిరి. యూదావారు విశేషమైన కొల్లసొమ్ము పట్టుకొనిరి.

14 గెరారు చుట్టునున్న పట్టణములలోని వారందరిమీదికి యెహోవా భయము వచ్చెను గనుక ఆ పట్టణములన్నిటిని కొల్లపెట్టి, వాటిలోనున్న మిక్కుటమైన కొల్లసొమ్మంతయు దోచుకొనిరి.

15 మరియు వారు పసులసాలలను పడగొట్టి విస్తారమైన గొఱ్ఱెలను ఒంటెలను సమకూర్చుకొని యెరూషలేమునకు తిరిగి వచ్చిరి.

Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible

Copyright © 2016 by The Bible Society of India

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Následuj nás:



Reklamy