Online Bible

- Reklamy -

2 దిన 11 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 రెహబాము యెరూషలేమునకు వచ్చినప్పుడు ఇశ్రాయేలువారితో యుద్ధము చేయుటకును, రాజ్యమును తనకు మరల రప్పించుకొనుటకును అతడు యూదావారిలోనుండియు బెన్యామీనీయులలోనుండియు ఏర్పరచబడిన యుద్ధ శాలులను లక్షయెనుబదివేలమందిని సమకూర్చగా

2 దైవజనుడైన షెమయాకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

3 –నీవు యూదారాజును సొలొమోను కుమారుడునగు రెహబాముతోను, యూదాయందును బెన్యామీనీయుల ప్రదేశమందునుఉండు ఇశ్రాయేలు వారందరితోను ఈ మాట ప్రకటించుము

4 –ఈ కార్యము నావలన జరుగుచున్నదని యెహోవా సెలవిచ్చుచున్నాడు గనుక, బయలుదేరకుండను మీ సహోదరులతో యుద్ధము చేయకుండను మీరందరును మీ మీ యిండ్లకు తిరిగి పోవుడి అని చెప్పెను. కావునవారు యెహోవా మాటలు విని యరొబాముతో యుద్ధము చేయుట మాని వెళ్లిపోయిరి.

5 రెహబాము యెరూషలేమునందు కాపురముండి యూదా ప్రదేశమందు ప్రాకారపురములను కట్టించెను.

6-9 అతడు బేత్లెహేము, ఏతాము, తెకోవ, బేత్సూరు, శోకో, అదుల్లాము, గాతు, మారేషా, జీఫు, అదోరయీము, లాకీషు, అజేకా,

10 జొర్యా, అయ్యాలోను, హెబ్రోను అను యూదా బెన్యామీను ప్రదేశములందుండు ప్రాకారపురములను కట్టించి

11 దుర్గములను బల పరచి, వాటిలో అధిపతులను ఉంచి, ఆహారమును నూనెను ద్రాక్షారసమును సమకూర్చెను.

12 మరియు వాటిలో డాళ్లను బల్లెములను ఉంచి ఆ పట్టణములను బహుబలవంతమైన వాటిగా చేసెను. యూదావారును బెన్యామీనీయులును అతని పక్షముననుండిరి.

13 ఇశ్రాయేలువారి మధ్యనుండు యాజకులును లేవీయులును తామున్న ప్రదేశముల సరిహద్దులను దాటి అతని యొద్దకు వచ్చి చేరిరి.

14 యరొబామును అతని కుమారులును యెహోవాకు యాజకసేవ జరుగకుండ లేవీయులను త్రోసి వేయగా, వారు తమ గ్రామములను స్వాస్థ్యములను విడచి, యూదా దేశమునకును యెరూషలేమునకును వచ్చిరి.

15 యరొబాము బలిపీఠములకును దయ్యములకును తాను చేయించిన దూడలకును యాజకులను ఏర్పరచుకొనెను.

16 వారి చర్యలట్లుండగా ఇశ్రాయేలీయుల గోత్రములయం దంతటను ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవాను వెదకుటకు మనస్సు నిలుపుకొనినవారు తమపితరుల దేవుడైన యెహోవాకు బలులనర్పించుటకై యెరూషలేమునకు వచ్చిరి.

17 దావీదును సొలొమోనును నడచిన మార్గమందు మూడు సంవత్సరములువారు నడచి, యూదా రాజ్యమును బలపరచి మూడు సంవత్సరములు సొలొమోను కుమారుడైన రెహబామునకు సహాయకులైరి.

18 రెహబాము, దావీదు కుమారుడైన యెరీమోతు కుమార్తెయగు మహలతును యెష్షయి కుమారుడైన ఏలీయాబు కుమార్తెయగు అబీహాయిలును వివాహము చేసికొనెను.

19 అతనికి యూషు షెమర్యా జహము అను కుమారులు కలిగిరి.

20 పిమ్మట అతడు అబ్షాలోము కుమార్తెయైన మయ కాను వివాహము చేసికొనగా ఆమె అతనికి అబీయాను అత్తయిని జీజాను షెలోమీతును కనెను.

21 రెహబాము పదునెనిమిదిమంది భార్యలను పెండ్లిచేసికొని అరువదిమంది ఉపపత్నులను తెచ్చుకొని యిరువది యెనిమిదిమంది కుమారులను అరువదిమంది కుమార్తెలను కనెను; అయితే తన భార్యలందరికంటెను ఉపపత్నులందరికంటెను అబ్షాలోము కుమార్తెయైన మయకాను అతడు ఎక్కువగా ప్రేమించెను.

22 రెహబాము మయకాకు పుట్టిన కుమారుడైన అబీయాను రాజును చేయతలచి, అతని సహోదరులమీద ప్రధానునిగాను అధిపతినిగాను అతని నియమించెను.

23 అతడు మంచి మెలకువగలవాడై తన కుమారులలో శేషించిన వారిని యూదా బెన్యామీను సంబంధములైన ఆయా ప్రదేశములలోని ఆయా ప్రాకారపురములయందు అధిపతులుగా నియమించి వారికి విస్తారమైన సొత్తు ఇచ్చి వారికి పెండ్లిండ్లు చేసెను.

Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible

Copyright © 2016 by The Bible Society of India

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Následuj nás:



Reklamy