Online Bible

- Reklamy -

1 రాజులు 17 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 అంతట గిలాదు కాపురస్థుల సంబంధియును తిష్బీ యుడునైన ఏలీయా అహాబునొద్దకు వచ్చి–ఎవని సన్నిధిని నేను నిలువబడియున్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవాజీవముతోడు నా మాట ప్రకారముగాక, యీ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను.

2 పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై

3 –నీవు ఇచ్చటనుండి తూర్పువైపునకు పోయి యొర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగుదగ్గర దాగియుండుము;

4 ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చునట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితినని అతనికి తెలియజేయగా

5 అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యొర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను.

6 అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతనియొద్దకు తీసికొనివచ్చుచుండెను; అతడు వాగు నీరు త్రాగుచు వచ్చెను.

7 కొంతకాలమైన తరువాత దేశములో వర్షము లేక ఆ నీరు ఎండిపోయెను.

8 అంతట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను–నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము;

9 నిన్ను పోషించుటకు అచ్చటనున్న యొక విధవరాలికి నేను సెలవిచ్చితిని.

10 అందుకతడు లేచి సారెపతునకు పోయి పట్టణపు గవినియొద్దకు రాగా, ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి–త్రాగుటకై పాత్రతో కొంచెము నీళ్లు నాకు తీసికొనిరమ్మని వేడుకొనెను.

11 ఆమె నీళ్లు తేబోవుచుండగా అతడామెను మరల పిలిచి–నాకొక రొట్టెముక్కను నీ చేతిలో తీసికొని రమ్మని చెప్పెను.

12 అందుకామె–నీ దేవుడైన యెహోవా జీవముతోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నాయొద్దనున్నవేగాని అప్పమొకటైనలేదు, మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసికొనవలెనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చితిననెను.

13 అప్పుడు ఏలీయా ఆమెతో ఇట్లనెను–భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము; అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదటచేసి నాయొద్దకు తీసికొనిరమ్ము, తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసికొనుము.

14 భూమి మీద యెహోవా వర్షము కురిపించువరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువకాదు, బుడ్డిలో నూనె అయిపోదని

15 ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా సెలవిచ్చియున్నాడు అనెను. అంతట ఆమె వెళ్లి ఏలీయా చెప్పిన మాటచొప్పునచేయగా అతడును ఆమెయు ఆమె యింటివారును అనేకదినములు భోజనముచేయుచు వచ్చిరి.

16 యెహోవా ఏలీయా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు.

17 అటుతరువాత ఆ యింటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగియై ప్రాణము నిలువ జాలనంత వ్యాధిగలవాడాయెను.

18 ఆమె ఏలీయాతో –దైవజనుడా, నాయొద్దకు నీవు రానిమిత్తమేమి? నా పాపమును నాకు జ్ఞాపకముచేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనవిచేయగా

19 అతడు–నీ బిడ్డను నా చేతికిమ్మని చెప్పి, ఆమె కౌగిటిలోనుండి వానిని తీసికొని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచముమీద వాని పరుండబెట్టి

20 –యెహోవా నా దేవా, నన్ను చేర్చుకొనిన యీ విధవరాలి కుమారుని చంపునంతగా ఆమెమీదికి కీడు రాజేసితివా అని యెహోవాకు మొఱ్ఱపెట్టి

21 ఆ చిన్నవానిమీద ముమ్మారు తాను పారచాచుకొని–యెహోవా నా దేవా, నా మొఱ్ఱ ఆలకించి యీ చిన్నవానికి ప్రాణము మరల రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా

22 యెహోవా ఏలీయా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరల రానిచ్చినప్పుడు వాడు బ్రదికెను.

23 ఏలీయా ఆ చిన్నవాని తీసికొని గదిలోనుండి దిగి యింట ప్రవేశించి వాని తల్లికి అప్పగించి–ఇదిగో నీ కుమారుడు; వాడు బ్రదుకుచున్నాడని చెప్పగా

24 ఆ స్త్రీ ఏలీయాతో–నీవు దైవజనుడవై యున్నావనియు నీవు పలుకుచున్న యెహోవామాట నిజమనియు ఇందుచేత నేనెరుగుదుననెను.

Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible

Copyright © 2016 by The Bible Society of India

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Následuj nás:



Reklamy