Online Bible

- Reklamy -

1 రాజులు 16 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 యెహోవా వాక్కు హనానీ కుమారుడైన యెహూకు ప్రత్యక్షమై బయెషానుగూర్చి యీలాగు సెలవిచ్చెను

2 –నేను నిన్ను మంటిలోనుండి తీసి హెచ్చింప జేసి ఇశ్రాయేలువారను నా జనులమీద నిన్ను అధికారిగా చేసితిని, అయినను యరొబాము ప్రవర్తించిన ప్రకారముగా నీవు ప్రవర్తించుచు, ఇశ్రాయేలువారగు నా జనులు పాపము చేయుటకు కారకుడవై, వారి పాపములచేత నాకు కోపము పుట్టించియున్నావు.

3 కాబట్టి బయెషా సంతతివారిని అతని కుటుంబికులను నేను సమూల ధ్వంసముచేసి, నెబాతు కుమారుడైన యరొబాము సంతతి వారికి నేను చేసినట్లు నీ సంతతివారికిని చేయబోవుచున్నాను.

4 పట్టణమందు చనిపోవు బయెషా సంబంధికులను కుక్కలు తినును; బీడుభూములలో చనిపోవు వాని సంబంధికులను ఆకాశపక్షులు తినును అనెను.

5 బయెషా చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసిన వాటన్నిటిని గూర్చియు, అతని బలమునుగూర్చియు ఇశ్రాయేలురాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయ బడియున్నది.

6 బయెషా తన పితరులతోకూడ నిద్రించి తిర్సాలో సమాధిచేయబడెను; అతనికి మారుగా అతని కుమారుడైన ఏలా రాజాయెను.

7 మరియు బయెషా యరొబాము సంతతి వారివలెనేయుండి తన కార్యములచేత యెహోవా దృష్టికి కీడుచేసి ఆయనకు కోపము పుట్టించిన దానినంతటినిబట్టియు, అతడు తన రాజును చంపుటనుబట్టియు, అతనికిని అతని సంతతివారికిని విరోధముగ యెహోవా వాక్కు హనానీ కుమారుడును ప్రవక్తయునగు యెహూకు ప్రత్యక్షమాయెను.

8 యూదారాజైన ఆసా యేలుబడిలో ఇరువదియారవ సంవత్సరమున బయెషా కుమారుడైన ఏలా తిర్సాయందు ఇశ్రాయేలువారినందరిని ఏలనారంభించి రెండు సంవత్సరములు ఏలెను.

9 తిర్సాలో తనకు గృహనిర్వాహకుడగు అర్సాయింట అతడు త్రాగి మత్తుడై యుండగా, యుద్ధ రథముల అర్ధభాగముమీద అధికారియైన జిమ్రీ అతని మీద కుట్రచేసి లోపలికి చొచ్చి

10 అతని కొట్టి చంపి అతనికి మారుగా రాజాయెను. ఇది యూదారాజైన ఆసా యేలుబడిలో ఇరువది యేడవ సంవత్సరమున సంభవించెను.

11 అతడు సింహాసనాసీనుడై యేలనారంభించిన తోడనే బయెషా సంతతివారందరిలో ఏ పురుషునేగాని అతని బంధువులలోను మిత్రులలోను ఎవరినేగాని మిగుల నియ్యక అందరిని హతముచేసెను.

12 బయెషాయును అతని కుమారుడగు ఏలాయును తామే పాపముచేసి, ఇశ్రాయేలువారు పాపము చేయుటకు కారకులై, తాము పెట్టుకొనిన దేవతలచేత ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవాకు కోపము పుట్టించిరి గనుక

13 వారు చేసిన పాపములనుబట్టి ప్రవక్తయైన యెహూద్వారా బయెషానుగూర్చి యెహోవా సెలవిచ్చిన మాట నెరవేరుటకై జిమ్రీ బయెషా సంతతివారినందరిని నాశనముచేసెను.

14 ఏలా చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసిన క్రియలన్నిటిని గూర్చియు ఇశ్రాయేలురాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి యున్నది.

15 యూదారాజైన ఆసా యేలుబడిలో ఇరువదియేడవ సంవత్సరమున జిమ్రీ తిర్సాలో ఏడు దినములు ఏలెను. జనులు ఫిలిష్తీయుల సంబంధమైన గిబ్బెతోను మీదికి వచ్చి అక్కడ దిగియుండగా

16 జిమ్రీ కుట్రచేసి రాజును చంపించెనను వార్త అక్కడ దిగియున్న జనులకు వినబడెను గనుక ఇశ్రాయేలువారందరును ఆ దినమున సైన్యాధిపతియైన ఒమ్రీని దండుపేటలో ఇశ్రాయేలు వారిమీద రాజుగా పట్టాభిషేకము చేసిరి.

17 వెంటనే ఒమ్రీ గిబ్బెతోనును విడిచి అతడును ఇశ్రాయేలు వారందరును తిర్సాకు వచ్చి దాని ముట్టడి వేసిరి.

18 పట్టణము పట్టుబడెనని జిమ్రీ తెలిసికొని, తాను రాజనగరునందు జొచ్చి తనతోకూడ రాజనగరును తగలబెట్టుకొని చనిపోయెను.

19 యరొబాము చేసినట్లు ఇతడును యెహోవా దృష్టికి చెడు తనము చేయువాడైయుండి తానే పాపముచేయుచు, ఇశ్రాయేలువారు పాపము చేయుటకు కారకుడైనందున ఈలాగున జరిగెను.

20 జిమ్రీచేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసిన రాజద్రోహమునుగూర్చియు ఇశ్రాయేలురాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయ బడియున్నది.

21 అప్పుడు ఇశ్రాయేలువారు రెండు జట్లుగా విడి పోయి, జనులలో సగముమంది గీనతు కుమారుడైన తిబ్నీని రాజుగా చేయవలెనని అతని పక్షమునను, సగముమంది ఒమ్రీ పక్షమునను చేరిరి.

22 ఒమ్రీ పక్షపు వారు గీనతు కుమారుడైన తిబ్నీ పక్షపువారిని జయింపగా తిబ్నీ చంప బడెను; ఒమ్రీ రాజాయెను.

23 యూదారాజైన ఆసా యేలుబడిలో ముప్పదియొకటవ సంవత్సరమున ఒమ్రీ ఇశ్రాయేలువారికి రాజై పండ్రెండు సంవత్సరములు ఏలెను; ఆ పండ్రెండింటిలో ఆరుసంవత్సరములు అతడు తిర్సాలో ఏలెను.

24 అతడు షెమెరునొద్ద షోమ్రోను కొండను నాలుగు మణుగుల వెండికి కొనుక్కొని ఆ కొండమీద పట్టణ మొకటి కట్టించి, ఆ కొండ యజమానుడైన షెమెరు అనునతని పేరునుబట్టి తాను కట్టించిన పట్టణమునకు షోమ్రోను అను పేరు పెట్టెను.

25 ఒమ్రీ యెహోవా దృష్టికి చెడుతనము జరిగించి, తన పూర్వికులందరికంటె మరి దుర్మార్గముగా ప్రవర్తించెను.

26 అతడు నెబాతు కుమారుడైన యరొబాము దేనిచేత ఇశ్రాయేలువారు పాపము చేయుటకు కారకుడై దేవతలను పెట్టుకొని, ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవాకు కోపము పుట్టించెనో, దానిని అనుసరించి ప్రవర్తించెను.

27 ఒమ్రీ చేసిన యితర కార్యములనుగూర్చియు అతడు అగుపరచిన బలమునుగూర్చియు ఇశ్రాయేలురాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది.

28 ఒమ్రీ తన పితరులతోకూడ నిద్రించి షోమ్రోనులో సమాధియందు పాతిపెట్టబడెను, అతని కుమారుడైన అహాబు అతనికి మారుగా రాజాయెను.

29 యూదారాజైన ఆసా యేలుబడిలో ముప్పదియెనిమిదవ సంవత్సరమున ఒమ్రీ కుమారుడైన అహాబు ఇశ్రాయేలువారికి రాజై షోమ్రోనులో ఇశ్రాయేలువారిని ఇరువదిరెండు సంవత్సరములు ఏలెను.

30 ఒమ్రీ కుమారుడైన అహాబు తన పూర్వికులందరిని మించునంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను.

31 నెబాతు కుమారుడైన యరొబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచు కొనుట స్వల్పసంగతి యనుకొని, అతడు సీదోనీయులకు రాజైన ఎత్బయలు కుమార్తెయైన యెజెబెలును వివాహము చేసికొని బయలుదేవతను పూజించుచు వానికి మ్రొక్కు చునుండెను.

32 షోమ్రోనులో తాను బయలునకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠమును కట్టించెను.

33 మరియు అహాబు దేవతాస్తంభమొకటి నిలిపెను. ఈ ప్రకారము అహాబు తన పూర్వికులైన ఇశ్రాయేలురాజులందరికంటె ఎక్కువగా పాపముచేసి ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను.

34 అతని దినములలో బేతేలీయుడైన హీయేలు యెరికో పట్టణమును కట్టించెను. అతడు దాని పునాదివేయగా అబీరాము అను అతని జ్యేష్ఠపుత్రుడు చనిపోయెను; దాని గవునుల నెత్తగా సెగూబు అను అతని కనిష్ఠపుత్రుడు చనిపోయెను. ఇది నూను కుమారుడైన యెహోషువద్వారా యెహోవా సెలవిచ్చిన మాటచొప్పున సంభవించెను.

Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible

Copyright © 2016 by The Bible Society of India

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Následuj nás:



Reklamy