గలతీయులకు 4 - తెలుగు సమకాలీన అనువాదము1 అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, వారసుడు బాలునిగా ఉన్నంత వరకు, అతడు ఆస్తి అంతటికి యజమాని అయినప్పటికీ, అతడు దాసుని కన్నా గొప్పవాడు కాడు. 2 తన తండ్రి నిర్ణయించిన సమయం వరకు వారసుడు సంరక్షకులు మరియు ధర్మకర్తల ఆధీనంలో ఉంటాడు. 3 అలాగే మనం తగిన వయస్సు వచ్చేవరకు, ఈ లోకానికి సంబంధించిన మూల నియమాల క్రింద బానిసలుగా ఉన్నాం. 4 అయితే నియమించబడిన కాలం పూర్తి అయినప్పుడు, దేవుడు తన కుమారున్ని, ధర్మశాస్త్ర ఆధీనంలో, ఒక స్త్రీ ద్వారా జన్మింపజేసారు, 5 ధర్మశాస్త్ర ఆధీనంలో ఉన్న వారిని విడిపించాలని, తద్వార మనం పుత్రత్వాన్ని దత్తతగా పొందుకోడానికి. 6 మీరు ఆయన కుమారులు కనుక, “అబ్బా, తండ్రీ” అని మొరపెట్టే తమ కుమారుని యొక్క ఆత్మను దేవుడు మన హృదయాల్లోనికి పంపారు. 7 కనుక ఇకపై మీరు దాసులు కారు, కానీ దేవుని పిల్లలు; మీరు ఆయన పిల్లలు కనుక, దేవుడు మిమ్మల్ని వారసులుగా చేశారు. పౌలుకు గలతీయులను గురించిన చింత 8 గతంలో, మీరు దేవుని యెరుగక ముందు, మీరు స్వాభావికంగా దేవుళ్ళు కాని వారికి బానిసలై యున్నారు. 9 కాని ఇప్పుడు మీరు దేవుణ్ణి తెలుసుకున్నారు, లేక దేవుడు మిమ్మల్ని ఎరిగియున్నారు. అలాంటప్పుడు మీరు మళ్ళీ వెనక్కి ఆ బలహీనమైన దిక్కుమాలిన సిద్ధాంతాల వైపు ఎందుకు తిరుగుతున్నారు? మీరు మళ్ళీ వాటికి బానిసలవ్వాలని కోరుకుంటున్నారా? 10 మీరు ప్రత్యేకమైన రోజులను, నెలలను సంవత్సరాలను ఆచరిస్తున్నారు గదా! 11 నేను మీ కొరకు పడిన ప్రయాసమంతా వృధా అవుతుందేమో, అని భయపడుతున్నాను. 12 సహోదరీ సహోదరులారా, నేను మీలా మారినట్లే మీరూ నాలా మారాలని మిమ్మల్ని వేడుకొంటున్నాను. మీరు నా పట్ల ఏ తప్పు చేయలేదు. 13 మీకు తెలిసే ఉన్నట్టు, నాకున్న అనారోగ్యాన్ని బట్టి నేను మొదటిగా మీకు సువార్త ప్రకటించాను. 14 నా అనారోగ్యం మీకు ఇబ్బందిని కలిగించినప్పటికీ, మీరు నా పట్ల తిరస్కారాన్ని లేదా అలక్ష్యాన్ని చూపించలేదు. నిజానికి, మీరు నన్ను దేవుని దూతలా, నేనే యేసుక్రీస్తును అయినట్లు చేర్చుకున్నారు. 15 అయితే నా వలన మీరు పొందిన దీవెన ఇప్పుడేమైపోయింది? మీరు మీ సొంత కళ్ళను కూడా పెరికివేసి నాకు ఇచ్చేవారని, నేను మీ గురించి సాక్ష్యమివ్వగలను. 16 అయితే ఇప్పుడు మీకు సత్యాన్ని చెప్పడం వల్ల నేను మీకు శత్రువుగా మారానా? 17 ఆ ప్రజలు మిమ్మల్ని గెలవాలని ఆసక్తి కలిగి ఉన్నారు, కాని అది ఏ మేలుకొరకు కాదు. మీరు వారి పట్ల ఆసక్తిని చూపించాలని, వారు మా నుండి మిమ్మల్ని వేరు చేయాలనుకుంటున్నారు. 18 ఆసక్తి కలిగి ఉండడం మంచిదే, ఉద్దేశం మంచిదై యుండాలి, మరియు నేను మీతో ఉన్నప్పుడే కాదు, ఎప్పుడూ అలాగే ఉండాలి. 19 నా ప్రియ పిల్లలారా, మీలో క్రీస్తు రూపించబడే వరకు నేను మరలా ప్రసవ వేదన పడుతున్నాను. 20 నేను మీ గురించి కలవరపడుతున్నాను. ఇప్పుడు నేను మీతో ఉండి, నా స్వరాన్ని మార్చి మాట్లాడగలిగితే ఎంత బాగుండేది! హాగరు, శారా 21 చెప్పండీ, ధర్మశాస్త్ర ఆధీనంలో ఉండాలనుకునే మీకు, ధర్మశాస్త్రం ఏమి చెప్తుందో తెలియదా? 22 వ్రాయబడి ఉన్న ప్రకారం, అబ్రాహాముకు ఇద్దరు కుమారులు, ఒకడు దాసియైన స్త్రీ ద్వారా, మరొకడు స్వతంత్రురాలైన స్త్రీ ద్వారా పుట్టిన వారు. 23 దాసియైన స్త్రీ ద్వారా పుట్టిన కుమారుడు శరీరానుసారంగా పుట్టిన వాడు, స్వతంత్రురాలైన స్త్రీ ద్వారా పుట్టిన కుమారుడు దైవిక వాగ్దాన ఫలితంగా పుట్టిన వాడు. 24 ఈ విషయాలు ఉపమానరీతిగా తీసుకోబడుతున్నాయి: ఈ స్త్రీలు రెండు నిబంధనలను సూచిస్తున్నారు. ఒక నిబంధన సీనాయి పర్వతం దగ్గరిది, ఇది హాగరు: బానిసలుగా ఉండడానికి పిల్లలను కంటుంది. 25 హాగరు అరేబియాలో ఉన్న సీనాయి పర్వతాన్ని సూచిస్తుంది. ప్రస్తుతం ఉన్న యెరూషలేము పట్టణంలా ఆమె తన పిల్లలతో సహా బానిసత్వంలో ఉంది. 26 కాని పైనుండి వచ్చే యెరూషలేము స్వతంత్రమైనది, ఆమె మనకు తల్లి. 27 అయితే వ్రాయబడిన ప్రకారం, “గొడ్రాలా, పిల్లలు కననిదానా, ఆనందించు; ప్రసవవేదన పడనిదానా, ఆనందంతో కేకలు వేయి; ఎందుకంటే, భర్త ఉన్న దాని పిల్లలకంటే భర్తలేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు.” 28 అయితే సహోదరీ సహోదరులారా, మీరు ఇస్సాకులా వాగ్దానం ద్వారా పుట్టిన పిల్లలు. 29 ఆ సమయంలో శరీరానుసారమైన కుమారుడు ఆత్మానుసారమైన కుమారుని ఎలా హింసించాడో ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. 30 అయితే లేఖనం ఏమి చెప్తుంది? “దాసిని ఆమె కుమారుని పంపించి వేయి, ఎందుకంటే స్వతంత్రురాలైన స్త్రీకి పుట్టిన కుమారుడు దాసురాలైన స్త్రీ యొక్క కుమారునితో వారసత్వం పంచుకోలేడు” అని చెప్తుంది. 31 కాబట్టి సహోదరీ సహోదరులారా, మనం దాసురాలైన స్త్రీ పిల్లలం కాదు, గాని స్వతంత్రురాలైన స్త్రీ పిల్లలం. |
తెలుగు సమకాలీన అనువాదము™, క్రొత్త నిబంధన
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022 Biblica, Inc.
అనుమతితో ఉపయోగించబడినది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
Telugu Contemporary Version™, New Testament
Copyright © 1976,1990, 2022 by Biblica, Inc.
Used with permission. All rights reserved worldwide.
Biblica, Inc.