Online Bible

- Reklamy -

2 కొరింథీ 1 - తెలుగు సమకాలీన అనువాదము

1 పౌలు, దేవుని చిత్తం బట్టి క్రీస్తు యేసు అపొస్తలుడు మన సోదరుడు తిమోతి, కొరింథీలోని దేవుని సంఘానికి, అకయ ప్రాంతమంతటిలోని దేవుని పరిశుద్ధులందరికి కలిపి వ్రాయునది:

2 మన తండ్రియైన దేవుని నుండి, ప్రభువైన యేసు క్రీస్తు నుండి మీకు కృపా సమాధానములు కలుగును గాక.


అన్నిటిలో ఆదరణనిచ్చు దేవునికి స్తోత్రాలు

3 మన యేసు క్రీస్తు ప్రభువుకు తండ్రియైన దేవునికి కృతజ్ఞతలు చెల్లింద్దాము. మన తండ్రి కనికరం గలవాడు. సమస్త ఆదరణ అనుగ్రహించే దేవుడు.

4 దేవుడు మనల్ని ఏ ఆదరణతో ఆదరిస్తున్నాడో, అలాగే, దేవుని నుండి మనకు లభించిన ఆదరణతో, పలురకాలైన కష్టాల్లో ఉన్న వారిని మనం ఆదుకోగలం.

5 క్రీస్తు కష్టాల్లో మనం ఎక్కువగా పాలుపంచుకొన్నట్టుగా క్రీస్తు ద్వారా మనం ఆయన ఇచ్చే గొప్ప ఆదరణలో పాలుపంచుకోగలం.

6 మేము శ్రమపడడం మీకు ఆదరణ రక్షణ కలుగడానికే. ఆదరణ లభిస్తే, అది మీ కొరకే కనుక మేము ఓర్పుతో సహించే కష్టాలనే మీరు ఓపికతో భరించడానికి శక్తి లభిస్తుంది.

7 మీరు మా కష్టాల్లో పాల్గొనట్లే, మాకు లభించే ఆదరణలో కూడ మీరు పాల్గొంటారని మాకు తెలుసు. కనుక మీలోని మా నిరీక్షణ ఎన్నటికి చలించదు.

8 సోదరులారా, ఆసియా ప్రాంతంలో మాకు ఎదురైన కష్టాన్ని గురించి మీకు చెప్పకుండా ఉండాలని అనుకోవడం లేదు. మేము మా శక్తికి మించిన కష్టాలకు గురైయ్యాము. కనుక మేము జీవితంపై ఆశ వదులుకొన్నాం.

9 మాపై మరణశిక్ష విధించబడినట్లుగ భావించించాము. మేము మాపై ఆధారపడక, మృతులను కూడ పునరుత్ధానులుగా చేసిన దేవునిపై ఆధారపడడానికే అలా జరిగింది.

10 మరణకరమైన భయంకర ప్రమాదాల నుండి ఆయన మమ్మల్ని ఎప్పుడు కాపాడుతున్నాడు. ఇక ముందు కూడ కాపాడతాడు. ఆయన తిరిగి మమ్మల్ని కాపాడతాడని ఆయనలో నిరీక్షణ కలిగివున్నాము.

11 మీ ప్రార్థనల ద్వారా మాకు సహాయం చేస్తున్నారు, గనుక వాటిలో అనేక ప్రార్థనలకు జవాబుగా దేవుడు మాకు కనికరం చూపినందుకు మా పక్షంగా అనేకులు కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు.


పౌలు ప్రణాళికలో మార్పు

12 ఇప్పుడు ఇది మాకు గర్వకారణం: ముఖ్యంగా మీతో మాకు గల సంబంధం విషయంలో నిజాయితీతో, దేవుడు అనుగ్రహించు పవిత్రతతో మేము నడుచుకొన్నాము, లోకజ్ఞానంపై ఆధారపడకుండా దేవుని కృపపై ఆధారపడి నడుచుకొన్నామని మా మనస్సాక్షి సాక్ష్యమిస్తుంది.

13 ఎందుకంటే, మీరు చదివి, అర్థం చేసుకోగలిగినంత మాత్రమే మీకు వ్రాస్తున్నానని, నేను అనుకుంటున్నాను,

14 ఇప్పుడు మీరు కొంతవరకు మాత్రమే అర్థం చేసుకోగల విషయాన్ని, రాబోవు కాలంలో సంపూర్ణంగా గ్రహిస్తారని నేను నిరీక్షిస్తున్నాను. అప్పుడు యేసు ప్రభువు దినాన మమ్మల్ని చూసి మీరు ఎంతగా గర్విస్తారో, మిమ్మల్ని చూసి మేము కూడా అలాగే గర్విస్తాం.

15 దీన్ని గురించి నాకు దృఢ నిశ్చయం ఉన్నందువల్ల, మీకు రెట్టింపు ఆనందం కలిగేలా నేను మిమ్మల్ని చూడడానికి రావాలని మొదట అనుకున్నాను.

16 ఎందుకంటే, నేను మాసిదోనియాకు వెళ్ళి, తిరిగి వచ్చినపుడు మిమ్మల్ని చూడాలని అనుకున్నాను. నా యూదయ ప్రయాణానికి మీ నుండి సహాయం పొందాలనుకున్నాను.

17 ఇలా ఆలోచించడంలో నేను అస్థిరుడనని మీకు అనిపిస్తుందా? నేను స్వార్ధంగా ఆలోచించేవాడనా? ఔనని, కాదని చెప్పేవాడనా?

18 అయితే దేవుడు నమ్మదగినవాడైతే, నేను మీకు చేసిన వాగ్దానం “అవునని” చెప్పితే “కాదు” అనేలా ఉండదు.

19 ఎందుకంటే, సిల్వాను ద్వారా, తిమోతి ద్వారా, నా ద్వారా మీకు బోధించబడిన, దేవుని కుమారుడైన యేసు క్రీస్తు అవునని చెప్పి, కాదనేవాడు కాడు. అవుననే వాడు.

20 ఎందుకంటే, దేవుని వాగ్దానాలన్ని క్రీస్తులో “అవును” అన్నట్లుగా ఉన్నాయి. అందుకే, దేవునికి మహిమ కలుగడానికి యేసు క్రీస్తు ద్వారా మనం “ఆమేన్” అని అంటున్నాము.

21 మీతో కూడ క్రీస్తులో నిలిచివుండేలా, మమ్మల్ని స్థిరపరచి అభిషేకించినవాడు దేవుడే.

22 ఆయనే తన ముద్రను మనపై వేసి మనల్ని తన వారిగా ప్రకటించారు. ఆయన మనకిచ్చిన వాటిని ధృవపరచడానికి మన హృదయాల్లో పవిత్రాత్మను అనుగ్రహించరు.

23 నా ప్రాణం తోడు, దేవుని నా సాక్షిగా పిలుస్తాను; మిమ్మల్ని బాధపెట్టడం ఇష్టం లేక నేను తిరిగి కొరింథీకి రాలేదు.

24 అందుకే మీరు విశ్వాసం వల్ల దృఢంగా నిలిచివున్నారు. కనుక మీ విశ్వాస విషయమై మేము ఆజ్ఞాపించడంలేదు. పైగా మేము మీ సంతోషం కొరకు మీతో సహకరిస్తున్నాం.

తెలుగు సమకాలీన అనువాదము™, క్రొత్త నిబంధన

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022 Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడినది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version™, New Testament

Copyright © 1976,1990, 2022 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
Následuj nás:



Reklamy